వ్యాధులు - బాధలు

Published : 10/12/2019 01:14 IST
లూప్‌ ఎంతకాలం ఉంచుకోవచ్చు?

సమస్య - సలహా

సమస్య: నా వయసు 30 సంవత్సరాలు. రెండేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. ఒక అమ్మాయి పుట్టింది. పాపకు ఏడాది దాటింది. వెంటనే గర్భం ధరించకూడదని లూప్‌ వేయించుకున్నాను. దీన్ని ఇంకొంత కాలం కొనసాగించాలని అనుకుంటున్నాను. ఇలా ఎన్ని సంవత్సరాల వరకు కొనసాగించొచ్చు? ఎక్కువకాలం వాడితే ఆరోగ్యం ఏమైనా దెబ్బతింటుందా? - ఒక పాఠకురాలు, వినుకొండ (గుంటూరు)

సలహా: గర్భం ధరించొద్దని భావించేవారికి లూప్‌ మంచి సాధనం. దీన్ని ఐయూసీడీ (ఇంట్రాయూటెరిన్‌ కాంట్రాసెప్టివ్‌ డివైస్‌) అనీ అంటారు. అంటే గర్భాశయంలో అమర్చే గర్భనిరోధక సాధనం అన్నమాట. దీని ప్రధానమైన పని అండం, వీర్యం కలవకుండా చేయటం. ఫలోపియన్‌ గొట్టాల నుంచి అండం కిందికి రావటాన్నీ ఆలస్యం చేస్తుంది. అండం గర్భసంచిలో కుదురుకోకుండానూ అడ్డుకుంటుంది. ఇలా ఫలదీకరణ జరక్కుండా, గర్భం ధరించకుండా కాపాడుతుంది. ఆంగ్ల అక్షరం ‘టి’ ఆకారంలో ఉండే ఇది చాలా చిన్న పరికరం. ప్లాస్టిక్‌తో తయారయ్యే దీనికి పల్చటి రాగితీగ చుట్టి ఉంటుంది. చాలామందికి ఇది వేసుకున్నట్టయినా అనిపించదు. శృంగార జీవితానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మీరు లూప్‌ను అమర్చుకొని ఇప్పటికే ఏడాది అయ్యిందని అంటున్నారు. ఇప్పటివరకూ ఎలాంటి సమస్యలు లేవంటే పెద్దగా ఇబ్బందులేవీ ఉండవనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే లూప్‌ బయటకు వచ్చే అవకాశముంటే 2-3 నెలల్లోనే వచ్చి ఉండేది. కొందరికి లూప్‌ అమర్చిన తర్వాత నొప్పి ఉండొచ్చు. దీనికి ప్రధాన కారణం గర్భసంచి కండరాలు పట్టేయటం. నొప్పి మందులు వేసుకుంటే ఇది రెండు మూడు రోజుల్లోనే కుదురుకుంటుంది. కొందరికి తెల్లబట్ట అయినా నెల తర్వాత తగ్గిపోతుంది. లూప్‌ మూలంగా నెలసరి ఎక్కువ రోజులు, ఎక్కువ రక్తస్రావం అవుతుందని, నొప్పి పుడుతోందని కొందరు అంటుంటారు. ఇదీ రెండు మూడు నెలల్లోనే తగ్గిపోతుంది. సాధారణంగా ఇలాంటి సమస్యలు మొదట్లోనే వస్తుంటాయి కాబట్టి ఇప్పుడు చింతించాల్సిన పనిలేదు. కాకపోతే లూప్‌ సరిగా ఉందో లేదో అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. పరికరం చివర ఉండే నైలాన్‌ తాళ్లు జననాంగంలోకి జారి ఉంటాయి. వీటిని పట్టుకొని చూడటం ద్వారా లూప్‌ సరిగా ఉందో లేదో తెలుసుకోవచ్చు.
లూప్‌ను దీర్ఘకాలం వాడుకున్నా ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి మార్పించుకుంటే సరిపోతుంది. అదీ నెలసరి వచ్చిన వెంటనే మార్పించుకోవాలి. ఆలస్యం చేయొద్దు. ఒకవేళ మీరు గర్భం ధరించాలని అనుకుంటే డాక్టర్‌తోనే లూప్‌ను తీయించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సొంతగా తీయటానికి ప్రయత్నించొద్దు. లూప్‌ తీయించుకున్నా గర్భం ధరించొద్దని అనుకుంటే ఆ వెంటనే  ఇతరత్రా గర్భ నిరోధక పద్ధతులు పాటించాలి.

మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను పంపాల్సిన చిరునామా :

సమస్య - సలహా, సుఖీభవ,  ఈనాడు ప్రధాన కార్యాలయం,  
రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512  
email: sukhi@eenadu.in

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని