వ్యాధులు - బాధలు

Updated : 12/11/2019 01:37 IST
కిడ్నీ మార్పిడి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

సమస్య - సలహా

సమస్య: మా నాన్నగారికి ఏడాది కిందట కిడ్నీ మార్పిడి జరిగింది. ఆహారం, ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలపండి.

- పార్థసారథి మజ్జి (ఈమెయల్‌ ద్వారా)

సలహా: కిడ్నీ పనితీరు బాగుంటే ప్రత్యేకించి ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అందరూ తినేవే తినొచ్చు. కాకపోతే ఇంట్లో వండిన ఆహారాన్నే తీసుకోవాలి. వండిన వెంటనే వేడి వేడిగా ఉన్నప్పుడే తినాలి. కొవ్వు పదార్థాలు తగ్గించాలి. బయట పదార్థాల జోలికి వెళ్లకపోవటం ఉత్తమం. కాచి చల్లార్చిన నీటినే తాగాలి. బయటకు వెళ్లినా కాచి చల్లార్చిన నీటిని వెంట తీసుకొని వెళ్లి, తాగాలి. గంటకు ఒక గ్లాసు నీళ్లు తాగితే మంచిది. వేసవిలో మరింత ఎక్కువగా నీళ్లు తాగాలి. దీంతో ఒంట్లో నీటిశాతం తగ్గకుండా చూసుకోవచ్చు. ఒంట్లో నీటిశాతం తగ్గితే కిడ్నీ పనితీరు అస్తవ్యస్తం కావొచ్చు. బరువు పెరగకుండా చూసుకోవటం ముఖ్యం. బరువు ఎక్కువైతే కిడ్నీ మీద భారం పెరుగుతుది, మరింత ఎక్కువగా కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. మద్యం, పొగ అలవాట్లుంటే వెంటనే మానెయ్యాలి. మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలేవైనా ఉంటే కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. రక్తపోటు ఎక్కువగా ఉంటే ఉప్పు తగ్గించాలి. గ్లూకోజు స్థాయులు పెరగకుండా తక్కువ తక్కువగా ఎక్కువసార్లు తినటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. రోజూ గంటసేపు నడవటం మంచిది. దీంతో రక్తపోటు, మధుమేహం, బరువు అదుపులో ఉంటాయి. కిడ్నీ మార్పిడి చేయించుకున్నవారు జీవితాంతం, క్రమం తప్పకుండా  మందులు వేసుకోవటం చాలా కీలకం. ఒక్క పూట మందులు వేసుకోకపోయినా కిడ్నీల మీద విపరీత ప్రభావం పడుతుంది. శరీరం కిడ్నీని తిరస్కరించే ప్రమాదముంది. అందువల్ల మందుల విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదిస్తూ అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. రోగనిరోధక శక్తిని అణచిపెట్టే మందులు వేసుకోవటం వల్ల ఇన్‌ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. అందువల్ల పరిశుభ్రత ముఖ్యం. రోజూ స్నానం చేయాలి. తరచుగా చేతులు సబ్బుతో కడుక్కోవాలి. ఎక్కువమంది గుమిగూడే చోట్లకు వెళ్లకపోవటం ఉత్తమం.


ఎలెక్ట్రోకన్వల్సివ్‌ చికిత్స తీసుకోవచ్చా?

సమస్య: మా అమ్మగారికి 50 ఏళ్లు. చాలాకాలంగా మానసిక సమస్యతో బాధపడుతోంది. ఆమెకు ఎలెక్ట్రోకన్వల్సివ్‌ థెరపీ (ఈసీటీ) చేస్తున్నారు. ఇటీవల గుండె బలహీనంగా ఉన్నట్టు బయటపడింది. కోర్సు పూర్తయ్యేంతవరకు ఈసీటీని కొనసాగించాలని గుండె డాక్టర్‌ చెప్పారు. దీన్ని దీర్ఘకాలం కొనసాగిస్తే మున్ముందు ఏవైనా ఇబ్బందులు తలెత్తుతాయా?

- కల్పన ధర్మాజీ (ఈమెయిల్‌ ద్వారా)

సలహా: తీవ్రమైన కుంగుబాటు, స్కిజోఫ్రినియా వంటి మానసిక సమస్యలకు ఎలెక్ట్రోకన్వల్సివ్‌ థెరపీ చేస్తారు. స్వల్ప విద్యుత్‌ ప్రచోదనాల ద్వారా మెదడులోని భాగాలను ప్రేరేపితం చేయటం దీని ప్రత్యేకత. దీంతో పెద్దగా దుష్ప్రభావాలేవీ ఉండవు. ఈసీటీ తీసుకున్నప్పుడు కొద్దిగా తలనొప్పి, చికిత్స చేసిన చోట కాస్త నొప్పి, కండరాలు అదరటం వంటివి ఉండొచ్చు. దీని మూలంగా దీర్ఘకాలంలో పెద్దగా ఇబ్బందులేవీ ఉండవు. సాధారణంగా ఈసీటీని మత్తుమందు (అనస్థీషియా) ఇచ్చే చేస్తారు. శరీరం సమర్థంగా, తట్టుకునే స్థితిలో ఉంటేనే మత్తుమందు ఇస్తారు. అందుకే సైక్రియాటిస్ట్‌, మత్తుమందు నిపుణుడు, నర్సు లేదా డాక్టర్‌తో కూడిన బృందం దీన్ని నిర్వహిస్తుంది. మీ అమ్మగారికి ఈసీటీని  కొనసాగించొచ్చని గుండె డాక్టర్‌ సూచించారని మీరు చెబుతున్నారు. అంటే మత్తుమందును తట్టుకునే స్థితిలో ఉన్నారనే అనుకోవచ్చు. అందువల్ల కోర్సు పూర్తయ్యేవరకు తీసుకోవచ్చు.


మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను పంపాల్సిన చిరునామా

సమస్య - సలహా సుఖీభవ ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512

email: sukhi@eenadu.in

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని