వ్యాధులు - బాధలు

Published : 08/10/2019 00:58 IST
చిగుళ్ల ‘పోటు’!

చిగుళ్ల వాపుతో బాధపడుతున్నారా? అయితే ఒకసారి రక్తపోటును పరీక్షించుకోండి. చిగుళ్లవాపు (పెరియోడాంటైటిస్‌) సమస్యతో బాధపడేవారికి అధిక రక్తపోటు ముప్పు పెరుగుతున్నట్టు బయటపడింది మరి. బ్రిటన్‌కు చెందిన యూసీఎల్‌ ఈస్ట్‌మన్‌ డెంటల్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు 81 అధ్యయనాల ఫలితాలను విశ్లేషించి ఈ విషయాన్ని గుర్తించారు. ఇందులో రక్తపోటు 140/90, అంతకన్నా ఎక్కువ ఉండటాన్ని అధిక రక్తపోటుగా పరిగణించారు. చిగుళ్లు ఆరోగ్యంగా ఉన్నవారితో పోలిస్తే చిగుళ్ల జబ్బు బాధితులకు అధిక రక్తపోటు ముప్పు 20% ఎక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. చిగుళ్ల జబ్బు తీవ్రమవుతున్నకొద్దీ ముప్పు సైతం పెరుగుతోంది. చిగుళ్ల వాపు ఒక మాదిరిగా గలవారికి అధిక రక్తపోటు వచ్చే అవకాశం 22% ఎక్కువగా ఉంటుండగా.. తీవ్రంగా ఉన్నవారికి 49% వరకూ పెరుగుతోంది. చిగుళ్ల వాపుతో పాటు దీనికి దోహదం చేసే బ్యాక్టీరియా మూలంగా ఒంట్లో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) ప్రేరేపితమవటం, ఇది రక్తనాళాల పనితీరును దెబ్బతీయటం ఇందుకు కారణం కావొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. మొత్తమ్మీద చిగుళ్ల జబ్బుతో బాధపడేవారికి సగటున సిస్టాలిక్‌ రక్తపోటు (ముందు అంకె) 4.5 పాయింట్లు అధికంగా ఉంటున్నట్టు తేలింది. సిస్టాలిక్‌ రక్తపోటు 5 పాయింట్లు పెరిగితే గుండెజబ్బు లేదా పక్షవాతం మూలంగా మరణించే ముప్పు 25% ఎక్కువవుతుందని గుర్తించటం అవసరం. పెద్దవారిలో 30-45% మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని అంచనా. ప్రపంచవ్యాప్తంగా అకాల మరణాలకు కారణమవుతున్న సమస్యల్లో రెండో స్థానం దీనిదే. చిగుళ్లవాపు సమస్యా తక్కువదేమీ కాదు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 50% మంది దీంతో బాధపడుతున్నవారే. చిగుళ్ల జబ్బుతో బాధపడేవారిలో గుండెపోటు, పక్షవాతం ముంచుకురావటానికి అధిక రక్తపోటు దోహదం చేస్తుండొచ్చని పరిశోధకులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందు నుంచే చిగుళ్ల ఆరోగ్యం మీద ఓ కన్నేసి ఉంచటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రోజూ ఉదయం, రాత్రి పడుకునే ముందు పళ్లు తోముకోవటం, ఏవైనా ఇబ్బందులు మొదలైతే వెంటనే డాక్టర్‌కు చూపించుకోవటం మంచిది. దీంతో దంతాలను కాపాడుకోవటమే కాకుండా అధిక రక్తపోటు బారినపడకుండానూ చూసుకోవచ్చు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని