వ్యాధులు - బాధలు

Updated : 10/09/2019 06:49 IST
ఒక్క క్షణం ! ఆగిచూడు!

నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం

ఉన్నది ఒక్కటే జీవితం. ఏం సాధించినా అందులోనే. అలాంటి జీవితాన్ని అర్ధాంతరంగా కాలదన్నుకుంటే? మన కథ అక్కడితోనే పరిసమాప్తమవుతుంది!

ఏదో సాధించాలనే తపన.. ఏమీ సాధించలేదేనన్న నిరాశ.. ఇంకేమీ సాధించలేమోనన్న నిస్పృహ.. ఇలాంటి స్థితిలోనే ఎంతోమంది నిండు జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. పరీక్షలో మార్కులు తక్కువ పడ్డాయనో.. భార్యతోనో భర్తతోనో పొరపొచ్చాలు వచ్చాయనో.. చిన్న చిన్న సమస్యలకే కుంగిపోయి బలవన్మరణాలకు పాల్పడటం ఎంతవరకు సమంజసం? తాము పోయినంత మాత్రాన సమస్యలు మాయమవుతాయా? ఆత్మహత్యలకు తెగబడే ముందు ఒక్క క్షణం ఆగి, తమను తాము ప్రశ్నించుకుంటే ఎన్నో జీవితాలు నిలబడతాయి. తిరిగి పచ్చగా కళకళలాడతాయి. ఇందుకు మనమంతా కలసికట్టుగా ప్రయత్నించటం అత్యవసరమని ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం గట్టిగా నినదిస్తోంది.

* విశేష్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి. చెన్నైలో అద్దెగదిలో ఉంటూ చదువుతున్నాడు. ఒకరోజు కాలేజీ నుంచి తల్లిదండ్రులకు ఫోన్‌ వచ్చింది. మీ అబ్బాయి మూడు నెలల నుంచి కాలేజీకి రావటం లేదన్నది దాని సారాంశం. ఎందుకిలా? అని అడిగితే ‘నాకు చాలా భయమేస్తోంది. ఏమాత్రం బతకాలని అనిపించటం లేదు’ అని చెప్పాడు. తల్లిదండ్రులు అతడిని ఇంటికి తీసుకొచ్చి డాక్టర్‌కు చూపించారు. మూడు నెలల పాటు కుంగుబాటు చికిత్స తీసుకున్నాక కోలుకున్నాడు. ఇంజినీరింగ్‌ పాసయ్యి మంచి ఉద్యోగంలో చేరాడు.
* చైతన్య బాగా చదువుతాడు. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటాడు. ఎక్కడా ఏ లోటు లేదు. అలాంటి పిల్లాడు ఒకరోజు తల్లికి ఫోన్‌ చేసి.. ‘అమ్మా.. నేను రైల్వే స్టేషన్‌లో ఉన్నాను. రైలు కింద పడాలనుకుంటున్నా’ అని ఏడుస్తూ చెప్పాడు. ఆమెకేం చేయాలో పాలు పోలేదు. అతడిని అలాగే మాటల్లో పెట్టి హుటాహుటిన రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఎలాగో నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చింది. కారణమేంటని చూస్తే తాజా పరీక్షలో మార్కులు కొద్దిగా తక్కువ వచ్చాయంతే. కౌన్సెలింగ్‌ ఇప్పిస్తే మామూలు మనిషయ్యాడు.
జీవితానికీ బలవన్మరణానికీ మధ్య ఒక్క క్షణమే తేడా. ఆ క్షణాన్ని అధిగమిస్తే ఎన్నో జీవితాలను కాపాడుకోవచ్చనటానికి ఇవే నిదర్శనాలు. ఆత్మహత్య చేసుకోవాలని ముందే నిర్ణయించుకున్నవారినైనా, క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవాలని అనుకున్నవారినైనా సానుభూతితో అర్థం చేసుకొని, అవసరమైన భరోసా కల్పిస్తే ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలిసిపోకుండా కాపాడుకోవచ్చు. కావాల్సిందల్లా సమయోచితంగా స్పందించటం. ఇదేమీ పెద్ద పని కాదు. అయినా ఎంతోమంది ఆత్మహత్యల మూలంగా అమూల్యమైన ప్రాణాలను పోగొట్టుకుంటుండటం విషాదం. ప్రపంచవ్యాప్తంగా ఏటా 8 లక్షల మంది బలవన్మరణాలకు పాల్పడుతుండగా.. వీరిలో 1.35 లక్షల మంది (17%) మనదేశానికి చెందినవారే! నిజానికివన్నీ నివారించదగ్గ మరణాలే. ఒకింత సంయమనంతో వ్యవహరిస్తూ, సానుకూల దృక్పథంతో ఆలోచించగలిగితే వీటిని చాలావరకు ఆపేయొచ్చు. బలవన్మరణాలకు దారితీస్తున్న కారణాలు, పొడసూపే హెచ్చరిక సంకేతాల గురించి తెలుసుకొని ఉంటే ముందే జాగ్రత్త పడొచ్చు.
చనిపోతే సమస్య పోతుందా?
ఆత్మహత్యకు పాల్పడే వారు చేసే పెద్ద పొరపాటు- ‘చనిపోతేనే మేలు. నా సమస్యకు అదే పరిష్కారం. కుటుంబ సమస్యలూ తొలగిపోతాయి. కుటుంబమంతా హాయిగా ఉంటుంది’ అని అనుకోవటం. చనిపోయినంత మాత్రాన సమస్యలు ఎక్కడికీ పోవు. పైగా తల్లిదండ్రులకు, కుటుంబానికి తీరని క్షోభ మిగిల్చినవారవుతారు. నవ మాసాలు మోసి, కనిపెంచిన పిల్లలు.. పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులు దూరమైతే ఆ వేదనను వర్ణించటం ఎవరి తరమూ కాదు. ఆత్మీయులను కోల్పోయామన్న బాధ విడవకుండా వేధిస్తుంది. మానసిక సమస్యలూ వెంటాడతాయి. అందువల్ల తాము చనిపోతే మిగతావారంతా హాయిగా ఉంటారని అనుకోవటం భ్రమ. క్షణికావేశంలో ప్రాణాలను పోగొట్టుకొని కుటుంబానికి క్షోభ మిగల్చటం కన్నా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడటమే ఉత్తమం.
నేరుగా అడగటమే మేలు
‘నీకు ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయా?’ ఈ ప్రశ్న వేయటానికి మనం సహజంగానే భయపడుతుంటాం. ఇలా అడగటం ద్వారా ఆత్మహత్య ఆలోచనకు బీజం వేస్తున్నామేమోననీ జంకుతుంటాం. కానీ ఏదైనా అనుమానం వచ్చినప్పుడు నేరుగా అడగటమే మేలు. ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నవారు తమ బాధను, వేదనను ఎవరైనా వింటే బాగుండుననే భావిస్తుంటారు. నేరుగా అడిగితే అసలు విషయాన్ని బయట పెట్టటానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మనసులోని బాధ తొలగిపోతుంది. తమ వేదనను ఇతరులు అర్థం చేసుకుంటారనే ఆశ కలుగుతుంది. దీంతో ఆత్మహత్య ఆలోచనను వాయిదా వేసుకోవచ్చు. ‘నా సమస్యకు ఇదే పరిష్కారం కాకపోవచ్చు, ప్రయత్నిస్తే ఇంకేదైనా మార్గం దొరుకుతుందేమో’ అనీ అనుకోవచ్చు. పూర్తిగా మనసు మార్చుకోనూ వచ్చు.


మూడు రకాలు..
ఆత్మహత్యలు ఎక్కువగా 15-24 ఏళ్లు, 45-60 ఏళ్ల వారిలో కనిపిస్తుంటాయి. వీటిని మూడు రకాలుగా పరిగణించొచ్చు. కొందరు తమలోని బాధను వెలిబుచ్చటానికి బలవన్మరణానికి ప్రయత్నిస్తుంటారు. మరికొందరు నిజంగానే ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకొని సన్నద్ధమవుతూ వస్తుంటారు. నిజానికి ఆత్మహత్య ఆలోచన వచ్చినా చాలామందిలో అక్కడితోనే ఆగిపోతుంది. కొందరు మాత్రం ఆలోచనల నుంచి బయటపడలేక, బలీయమైన కోరికతో సన్నాహాలు చేసుకుంటూ.. చివరికి ఆత్మహత్యకు ఒడిగడుతుంటారు. ఇంకొందరు ఇలాంటి ఆలోచనలు, ప్రయత్నాలేవీ లేకుండానే కోపంతోనో, సహనం నశించో విచక్షణ కోల్పోయి అప్పటికప్పుడు అఘాయిత్యానికి తెగిస్తుంటారు (ఇంపల్సివ్‌ సూసైడ్‌). ఆత్మహత్య ప్రయత్నాలు మహిళల్లో ఎక్కువ. ఆత్మహత్యలతో చనిపోయేవారిలో మగవారు అధికం.


హెచ్చరిక సంకేతాలపై కన్నేయండి
ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నవారిలో ప్రవర్తన పరంగా కొన్ని మార్పులు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా అప్పటికే మానసిక సమస్యలతో బాధపడుతున్నవారి విషయంలో, ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు ఇలాంటి విపరీత మార్పులు కనిపిస్తే తాత్సారం చేయరాదు.
* ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం
* స్నేహితులకు, బంధువులకు దూరంగా ఉండటం
* పండుగలు, వివాహాల వంటి వేడుకల్లో పాల్గొనకపోవటం
* సామాజిక కార్యక్రమాలంటే ఆసక్తి చూపకపోవటం
* ఎప్పుడూ విచారంగా ఉండటం
* తమ వస్తువులను వేరేవాళ్లకు ఇచ్చేయటం
* ఆత్మహత్య లేఖలు రాయటానికి ప్రయత్నించటం
* స్నేహితులకు ‘గుడ్‌ బై’ సందేశాలు పంపుతుండటం
* బతకాలని అనిపించటం లేదని చుట్టుపక్కలవాళ్లతో అనటం
* చావు గురించి ఎక్కువగా మాట్లాడుతుండటం
* చనిపోయినవాళ్లు ఎంత అదృష్టవంతులో అని చెబుతుండటం
* యాసిడ్‌, కిరోసిన్‌, బ్లేడ్లు, కత్తుల వంటివి గదిలో దాచుకోవటం  
* ముందే వీలునామా రాసిపెట్టడం
* మద్యం, మాదక ద్రవ్యాల అలవాట్లు


ముప్పు కారకాలేంటి?
ఆత్మహత్యలకు రకరకాల అంశాలు దోహదం చేయొచ్చు. తీరని కష్టాలు, బాధలు.. పరీక్షలో ఫెయిల్‌ కావటం, కుటుంబ తగాదాలు, ఆర్థిక ఇబ్బందుల వంటివేవైనా కారణం కావొచ్చు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులను చాలామంది బాగానే నెట్టుకొస్తుంటారు. కొందరు మాత్రం వీటి మూలంగా తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనతో క్రమంగా కుంగుబాటులోకి జారుకుంటారు. ఇదే చివరికి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అందువల్ల ఆత్మహత్యలకు దారితీసే అంశాలేంటన్నది గుర్తించి, జాగ్రత్త పడటం మంచిది.
* వృద్ధాప్యాన్ని భారంగా భావించడం
* ఇటీవలే విడాకులు తీసుకోవడం
* వ్యక్తిగత సంబంధాలు, అన్యోన్యత దెబ్బతినడం
* దీర్ఘకాల జబ్బులతో బాధపడుతుండడం
* మాదక ద్రవ్యాల వ్యసనంలో కూరుకుపోవడం
* జీవితమంతా నిరాశామయంగా కనిపించడం
* పరీక్షల్లో ఫెయిల్‌ కావడం
* ఉద్యోగం పోవడం
* ఆర్థిక ఇబ్బందులు
* జీవిత భాగస్వామి, ఆత్మీయుల మరణం
* ఇంట్లో తరచూ గొడవలు
* ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడడం
* విడవకుండా, దీర్ఘకాలంగా వేధించే నొప్పులు
* గృహ హింస, లైంగిక వేధింపుల వంటి వాటికి గురికావడం
* కుటుంబంలో ఎవరైనా ఆత్మహత్యలకు పాల్పడటం
* ఒకసారి ఆత్మహత్య చేసుకొని విఫలం కావడం


మానసిక సమస్యలు ప్రధానం
ఆత్మహత్యలతో ప్రాణాలు పొగొట్టుకుంటున్నవారిలో 90% మంది ఎప్పుడో అప్పుడు ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడ్డవారే! వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కుంగుబాటు (డిప్రెషన్‌) గురించి. దీని బారినపడ్డవారు తీవ్రమైన నిరాశా నిస్పృహల్లో కూరుకుపోతుంటారు. తాము దేనికీ పనికిరామని భావిస్తుంటారు. ప్రతిదీ నిష్ప్రయోజనంగా తోస్తుంది. భవిష్యత్తు ఏదీ కనిపించదు. సమస్య తీవ్రమవుతున్న కొద్దీ తాము బతికి ప్రయోజనం లేదనే ఆలోచన మనసును తొలిచేస్తుంటుంది. దీన్ని గుర్తించి, సరైన చికిత్స తీసుకోకపోతే ఆత్మహత్యలకూ ప్రేరేపించొచ్చు. కొందరు జన్యుపరంగా కుంగుబాటుకు లోనవుతుంటారు. ఇలాంటి వారిలో కొందరు కుంగుబాటు లక్షణాలు.. తీవ్రమైన కష్టాలు, ఇబ్బందులేవీ లేకపోయినా ఆత్మహత్యలకు ఒడిగడుతుంటారు. మెదడులో సెరటోనిన్‌ స్థాయులు తగ్గటమూ కుంగుబాటుకు దారితీయొచ్చు. స్కిజోఫ్రినియా, బైపోలార్‌ డిజార్డర్‌ వంటి సమస్యలూ ఆత్మహత్యల ముప్పును పెంచొచ్చు.


చికిత్స
అదే పనిగా ఆత్మహత్య ఆలోచనలు వేధిస్తున్నవారికి కొన్ని చికిత్సలు బాగా ఉపయోగపడతాయి. డాక్టర్లు ముందుగా ఆత్మహత్య ఆలోచనలు రావటానికి కారణమేంటన్నది లోతుగా పరిశీలిస్తారు. మానసిక సమస్యలేవైనా ఉన్నాయేమో చూసి.. అవసరాన్ని బట్టి చికిత్స చేస్తారు.
* మందులు: ఆత్మహత్యలకు చాలావరకు మానసిక సమస్యలే ప్రధాన కారణం. అలాంటివేవైనా ఉంటే తగు మందులు ఇస్తారు. వీటితో ఆయా సమస్యల లక్షణాలతో పాటు ఆత్మహత్య ఆలోచనలూ తగ్గుతాయి.
* కాగ్నిటివ్‌ బిహేవియర్‌ చికిత్స (సీబీటీ): ఇందులో కుంగుబాటు మూలంగా అస్తవ్యస్తమైన ఆలోచనలను సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు. ఫలితంగా ఆత్మహత్య చేసుకోవాలనే తలంపులకూ కళ్లెం పడుతుంది. పరిస్థితులను అర్థం చేసుకొని మెలగడం అలవడుతుంది.
* ఎలక్ట్రో కన్వల్షన్‌ థెరపీ: దీన్నే ‘షాక్‌ చికిత్స’ అనీ పిలుచుకుంటారు. ఆత్మహత్య ఆలోచనలు ఉద్ధృతంగా వస్తున్నవారికిది ఉపయోగపడుతుంది. కౌన్సెలింగ్‌, మందుల వంటి పద్ధతులతో ఎలాంటి మార్పు లేనప్పుడు దీన్ని సూచిస్తారు. 4-6 వారాల పాటు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇది తక్షణ ప్రభావం చూపుతుంది, మంచి ఫలితం కనిపిస్తుంది.


నివారించుకోవచ్చు..
ఆత్మహత్యకు పాల్పడి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డ వారి నోటి నుంచి వెలువడే మొదటి మాట ‘అలా చేసి ఉండకపోతే బాగుండేది’ అనే. చేసిన పనికి పశ్చాత్తాప పడేవాళ్లే ఎక్కువ. అందువల్ల ఇంట్లోవాళ్లు, సన్నిహితులు ముందు నుంచే జాగ్రత్తగా వ్యవహరిస్తే అఘాయిత్యాలకు పాల్పడకుండా కాపాడుకోవచ్చు. కావాల్సిందల్లా విపరీత ప్రవర్తన, ఆలోచనలు, మానసిక స్థితిపై కన్నేసి ఉంచటం.


* కుంగుబాటుతో బాధపడుతున్నా యుక్తవయసు పిల్లలకు దాని గురించి తెలియదు. ఏదో తెలియని నిరాశా నిస్పృహలకు లోనవుతూ, ఏదో ఒక బలహీన క్షణాన తీవ్ర సాహసానికి ఒడిగడుతుంటారు. అందువల్ల కుంగుబాటు లక్షణాలను విస్మరించటం తగదు. దీర్ఘకాలంగా హుషారు, సంతోషం లోపించటం.. రోజువారీ పనులనూ సరిగా చేసుకోలేకపోవటం, నలుగురితో కలివిడిగా లేకపోవటం వంటివన్నీ కుంగుబాటు సంకేతాలే. వీటిని గుర్తించి జాగ్రత్త పడడం, అవసరమైతే చికిత్స ఇప్పించటం మంచిది.


* ఆత్మహత్యకు పాల్పడే సూచనలు కనిపిస్తున్నప్పుడు నిరంతరం ఎవరో ఒకరు తోడుండటం మంచిది. మందులు, కత్తులు, బ్లేడులు, పురుగుమందులు, కిరోసిన్‌ వంటివి అందుబాటులో లేకుండా చూసుకోవాలి.


* బాత్రూమ్‌, పడకగదిలో మరీ ఎక్కువసేపు ఉండటం వంటి అనుమానాస్పద పరిస్థితుల్లో గడియ పగలగొట్టి అయినా లోపలికి వెళ్లి చూడాలి. ఏమాత్రం సంకోచం పనికిరాదు.


* మానసిక సమస్యలతో బాధపడేవారు తమ బాధను తల్లిదండ్రులు, బంధువులు, తోటి విద్యార్థులు, స్నేహితులు, ఉపాధ్యాయుల వంటి వారి దగ్గర ఎప్పుడో అప్పుడు ఏదో ఒక రూపంలో వ్యక్తం చేసే ఉంటారు. ఇలాంటి సమయాల్లో చాలామంది చేసే పొరపాటు చెప్పే విషయాలను కొట్టిపారేయటం. వేరే రకంగా ఆలోచించమని, సానుకూల దృక్పథం అలవరచుకోమని, తీవ్రమైన ఆలోచనలు చేయొద్దని సలహాలు ఇవ్వటం. తమలో తాము దాచుకోలేక, మోయలేకనే వాటిని ఇతరులతో పంచుకుంటున్నారనే సంగతిని అంతా గుర్తించాలి. మనసు విప్పి భావాలను పంచుకునే వాతావరణం కల్పించాలి. దీంతో సగం సమస్య మటుమాయం అవుతుంది.


* ఇప్పుడు ఆత్మహత్యల నివారణకు అన్నిచోట్లా సహాయ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో ఆత్మహత్యలకు పాల్పడేవారు చెప్పే మాటలను శ్రద్ధగా వింటూ, సానుభూతి చూపిస్తారు. ఇలా మాట్లాడే క్రమంలోనే మనసు మార్చుకునే వాళ్లు ఎందరో.


* వ్యాయామంతో మెదడుకు రక్తసరఫరా మెరుగవుతుంది. మూడ్‌ను ఉత్సాహపరిచే.. నొప్పి, బాధలను తగ్గించే ఎండార్ఫిన్లు మెదడులో ఉత్పత్తి అవుతాయి. అలాగే ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటుకు దారితీసే కార్టిజోల్‌ హార్మోన్‌ స్థాయులు తగ్గుముఖం పడతాయి. ఇవన్నీ ఆత్మహత్య ఆలోచనలకు కళ్లెం వేసేవే. అందువల్ల క్రమం తప్పకుండా రోజుకు కనీసం అరగంట సేపు వ్యాయామం చేసేలా ప్రోత్సహించాలి. నడక వంటి తేలికపాటివైనా మంచి ఫలితం చూపుతాయి. వీటితో ఉత్సాహం ఇనుమడిస్తుంది.


 

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని