వ్యాధులు - బాధలు

Published : 21/05/2019 00:29 IST
పుప్పి పళ్లు.. ఆపై జివ్వు!

సమస్య - సలహా

సమస్య: నాకు పుప్పిపళ్లు ఉన్నాయి. చల్లటి పదార్థాలేవైనా తాకితే పళ్లు జివ్వుమంటున్నాయి. దీనికి పరిష్కారమేంటి? కృత్రిమ దంతాలు అమర్చుకోవటం మంచిది కాదని స్నేహితులు చెబుతున్నారు. ఏం చెయ్యాలో చెప్పండి?

- రామ్‌ (ఈమెయిల్‌ ద్వారా)

 

సలహా: నిజానికి పుప్పి పళ్లు, పళ్లు జివ్వుమనటం వేర్వేరు సమస్యలు. పళ్లు పుచ్చిపోయినా జివ్వుమనాలని లేదు. అలాగే జివ్వుమన్నంత మాత్రాన పళ్లు పుచ్చిపోవాల్సిన పని లేదు. అయితే మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తుంటే మీకు రెండు సమస్యలూ ఉన్నట్టు తోస్తోంది. మన పంటి మీద ఎనామిల్‌ అనే గట్టి పొర ఉంటుంది. పళ్లు పుచ్చిపోయినప్పుడు ఇది దెబ్బతిని, లోపలుండే డెంటిన్‌ బయటపడొచ్చు. దీంతో అక్కడి నాడులు ప్రేరేపితమై చల్లటి పదార్థాలు తిన్నప్పుడు జివ్వుమని లాగుతుండొచ్చు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే క్రమంగా పళ్లు మొత్తం దెబ్బతినే ప్రమాదముంది. అందువల్ల మీరు వెంటనే నిపుణులైన దంత వైద్యుడిని సంప్రదించటం మంచిది. ముందుగా మీకు పళ్లు ఎంతవరకు పుచ్చిపోయాయి? పైపొర మాత్రమే దెబ్బతిన్నదా? లోపలి వరకు దెబ్బతిన్నదా? అనేది చూడాల్సి ఉంటుంది. మామూలు ఎక్స్‌రేతోనే ఇది బయటపడుతుంది. పైపొర మాత్రమే దెబ్బతింటే డీసెన్సిటైజింగ్‌ టూత్‌పేస్ట్‌లు.. మౌత్‌వాష్‌లు వాడుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. జివ్వుమనటం తగ్గుతుంది. అవసరమైతే దెబ్బతిన్న భాగాన్ని శుభ్రం చేసి ఫిల్లింగ్‌ చేయొచ్చు. ఒకవేళ లోపలి వరకూ పుచ్చి పోయి నాడులు కూడా ప్రభావితమైతే రూట్‌ కెనాల్‌ చికిత్స చేసి క్యాప్స్‌ బిగించొచ్చు. ఇక పళ్లు బాగా దెబ్బతిని.. లోపల ఇన్‌ఫెక్షన్‌ తలెత్తి.. చీము కూడా పడితే పళ్లను తొలగించాల్సి రావొచ్చు. అప్పుడు వాటి స్థానంలో కట్టుడు పళ్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే ఇంప్లాంట్‌ అమర్చి.. దాని మీద కృత్రిమ పన్ను బిగించొచ్చు. ఒకేచోట రెండు మూడు పళ్లు తీయాల్సి వస్తే.. వాటికి అటు పక్క, ఇటు పక్క పళ్లు బలంగా ఉన్నప్పుడు బ్రిడ్జి పద్ధతిలో కృత్రిమ దంతాలు అమర్చుకోవచ్చు. వీటిని జాగ్రత్తగా కాపాడుకుంటే మామూలు దంతాల మాదిరిగానే పనిచేస్తాయి. భయపడాల్సిన పనేమీ లేదు. కృత్రిమ దంతాలు మంచివి కావనుకోవటం అపోహ. ఇవి ఆహారం బాగా నమలటానికి, ముఖం అందంగా కనబడటానికి తోడ్పడతాయి. ఇలా పోషణలోపం బారినపడకుండా, ఆత్మ విశ్వాసం సన్నగిల్లకుండా  కాపాడతాయి. ఫలితంగా శారీరక, మానసిక ఆరోగ్యమూ మెరుగవుతుంది.

మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను పంపాల్సిన చిరునామా
సమస్య - సలహా, సుఖీభవ,  ఈనాడు ప్రధాన కార్యాలయం,
రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512
email: sukhi@eenadu.in

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని