పిల్లల ఆరోగ్యం

Updated : 01/01/2019 14:55 IST
కొంచెం తినగానే పిల్లాడికి వాంతి?

సమస్య - సలహా 

సమస్య: మా బాబు వయసు 2 సంవత్సరాల 8 నెలలు. గత నెల రోజుల నుంచి తిండి సరిగా తినటం లేదు. కొంచెం తినగానే వాంతి చేసుకుంటున్నాడు. ఎంజైమ్‌ సిరప్‌లు వాడినా ఫలితం కనబడటం లేదు. ఇంతకు ముందు బాగానే తినేవాడు. హఠాత్తుగా ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కావటం లేదు. దీనికి పరిష్కారమేంటి?

- మాధవీ నాయుడు (ఈమెయిల్‌ ద్వారా)

సలహా:

 మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తుంటే పెద్దగా కంగారు పడాల్సిన పనేమీ లేదనే అనిపిస్తోంది. అన్నవాహిక, జీర్ణాశయం మధ్యలో ఉండే బిగుతైన కండర వలయం (ఈసోఫేగల్‌ స్ఫింక్టర్‌) వదులు కావటమే దీనికి కారణమని తోస్తోంది. సాధారణంగా మనమేదైనా తిన్నప్పుడు అది అన్నవాహిక గుండా కిందికి జారుతూ.. జీర్ణాశయం వద్దకు రాగానే ఈ కండర వలయం కాస్త వదులవుతుంది. దీంతో ముద్ద జీర్ణాశయంలోకి చేరుకుంటుంది. ఆ వెంటనే కండర వలయం తిరిగి బిగుతుగా అయిపోతుంది. ఒకవేళ ఇది గట్టిగా మూసుకుపోకపోతే జీర్ణాశయంలోని ఆమ్లాలు, ఆహార పదార్థాలు పైకి ఎగదన్నుకు వస్తాయి. కొందరిలో వాంతి కూడా కావొచ్చు. చిన్న పిల్లల్లో ఇలాంటి సమస్య ఎక్కువగా చూస్తుంటాం. దీనికి కారణం వీరిలో ఈసోఫేగల్‌ స్ఫింక్టర్‌ కాస్త వదులుగా ఉండటం. ఇది వయసు పెరుగుతున్నకొద్దీ మెరుగవుతూ వస్తుంది. అయితే కొందరిలో రెండేళ్లు దాటినా కూడా కండర వలయం బిగువును సాధించకపోవచ్చు. ఇదేమంత కంగారు పడాల్సిన విషయం కాదు. క్రమంగా మెరుగవుతూ వస్తుంది. కొన్నిసార్లు పిల్లలకు ఇష్టం లేని పదార్థాలు పెట్టినా సరిగా తినకపోవచ్చు. తిండి సహించక వాంతి చేసుకోవచ్చు. కాబట్టి ముందు మీరు పిల్లాడికి నచ్చజెబుతూ, ఇష్టమైన పదార్థాలు తినిపించే ప్రయత్నం చేయండి. అప్పటికీ ఫలితం కనబడకపోతే ఒకసారి పీడియాట్రిక్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రతించటం మంచిది. ఎందుకంటే అల్సర్‌, పూత వంటి సమస్యలతోనూ కొన్నిసార్లు పిల్లలు సరిగా తినకపోవచ్చు. వీరికి బేరియం ద్రవాన్ని తాగించి తీసే ఎక్స్‌రే గానీ గ్యాస్ట్రోస్కోపీ గానీ చేసి సమస్యను నిర్ధరించాల్సి ఉంటుంది. సమస్యలేవైనా ఉన్నట్టు తేలితే తగు చికిత్స చేస్తారు.

- డా।।. కె.జగన్మోహనరావు సీనియర్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌

మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను పంపాల్సిన చిరునామా 
సమస్య - సలహా సుఖీభవ ఈనాడు ప్రధాన కార్యాలయం, 
రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512 email: sukhi@eenadu.in

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని