పిల్లల ఆరోగ్యం

Published : 14/04/2020 00:12 IST
పిల్లలను కాపాడుకోవటమెలా?

సమస్య- సలహా

సమస్య: నాకు ఇద్దరు పిల్లలు. ఒకరికి 3 సంవత్సరాలు. మరొకరికి 4 నెలలు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో దీని బారినపడకుండా పిల్లలను కాపాడుకోవటమెలా? పెద్ద పిల్లాడు అంతగా చేతులు కడుక్కోడు. ఏం చెయ్యాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- రమ్యశ్రీ (ఈ-మెయిల్‌ ద్వారా)

సలహా: పిల్లల ఆరోగ్య సంరక్షణ తల్లిదండ్రులు, పెద్దవాళ్ల బాధ్యతే. పిల్లలు తమంత తాముగా జాగ్రత్తలు తీసుకోలేరు కాబట్టి ఆ పనిని పెద్దవాళ్లే చేయించాలి. అదృష్టవశాత్తు కరోనా ఇన్‌ఫెక్షన్‌ పిల్లలకు అంతగా రావటం లేదు. దీని బారినపడుతున్నవారిలో పదేళ్లలోపు పిల్లలు 2-3% మందే. ఒకవేళ వచ్చినా ప్రస్తుతానికి అంత తీవ్రంగా ఏమీ ఉండటం లేదు. కరోనా వైరస్‌ నేరుగా ఊపిరితిత్తుల కణజాలాన్ని దెబ్బతీయటం.. మన రోగనిరోధక వ్యవస్థలో భాగమైన సైటోకైన్లు అవయవాలపై విపరీత ప్రభావం చూపటం వల్లనే సమస్య తీవ్రమవుతోంది. చిన్నపిల్లల్లో ఈ సైటోకైన్ల ప్రతిస్పందన తక్కువ. కాబట్టి తీవ్రతా తక్కువగానే ఉంటుంది. అందువల్ల మరీ భయపడాల్సిన అవసరం లేదు. అలాగని అజాగ్రత్త పనికిరాదు. నిర్లక్ష్యం అసలే కూడదు. పిల్లలు పెద్దవాళ్లను చూసే నేర్చుకుంటారు. ఆయా పనులను అలవాటు చేసుకుంటారు. కాబట్టి చేతులు కడుక్కోవటం ఎంత ముఖ్యమో పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. వాళ్లు చూస్తుండగా చేతులు కడుక్కోవాలి. దగ్గరుండి కడిగించాలి. ఇలా తరచూ చేస్తుంటే అదే అలవాటవుతుంది. సబ్బుతో రుద్ది చేతులు కడిగిస్తే చాలు. పిల్లలు తమంత తాముగా బయటకు ఎక్కువదూరం వెళ్లలేరు. పెద్దవాళ్ల వెంటే వెళ్తారు. కాబట్టి వారిని బయటకు తీసుకెళ్లకుండా చూసుకోవాలి. జనం ఎక్కువగా గుమిగూడే ఉండే చోట్లకు అసలే తీసుకెళ్లకూడదు. ఒకవేళ వెళ్తే ఇతరులకు దూరంగా ఉంచాలి. అలాగే ఒంట్లో నీటిశాతం తగ్గకుండా చూడాలి. తరచూ నీళ్లు, ద్రవాలు తాగించాలి. పోషణలోపం తలెత్తకుండా మంచి ఆహారం ఇవ్వాలి. ఆరు నెలల లోపు పిల్లలకు విధిగా తల్లిపాలు పట్టాలి. రెండేళ్లు దాటిన పిల్లలైతే బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా ముఖానికి మాస్కు ధరించేలా చూసుకోవాలి ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే, నేర్పిస్తే మున్ముందూ ఉపయోగపడుతుంది. దిగ్బంధం (లాక్‌డౌన్‌) తొలగించిన తర్వాత బయటకు వెళ్తే వైరస్‌ బారినపడకుండా కాపాడుకోవచ్చు.

మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను పంపాల్సిన

చిరునామా సమస్య-సలహా, సుఖీభవ, ఈనాడు ప్రధాన కార్యాలయం,

రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512 email: sukhi@eenadu.in

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని