పిల్లల ఆరోగ్యం

Updated : 08/07/2021 19:11 IST
హలో.. వింటున్నారా?

నేడు ప్రపంచ వినికిడి దినం

వినికిడే ఆధారం. మన కథ దాంతోనే ఆరంభం. తల్లి కడుపులోంచి బయట పడగానే ఏడుస్తాం. మన ఏడుపుతో పాటు చుట్టుపక్కల శబ్దాలనూ వినటం ఆరంభిస్తాం. దీంతోనే పరిసరాలను, ప్రపంచాన్ని అర్థం చేసుకోవటం మొదలెడతాం. తల్లి మాటకు మనసు ఉప్పొంగినా, తండ్రి మాటకు ఒళ్లు పులకించినా అంతా వినికిడి మహిమే. మన చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, అభిప్రాయాల కలబోత, నలుగురితో సంబంధ బాంధవ్యాలు, సంగీత రసాస్వాదన.. ఇలా అన్నింటికీ వినికిడే మూలం. వినికిడి లేకపోతే జీవితమే నిశ్శబ్దంగా మారిపోతుంది. పసిపిల్లల్లో వినికిడి దెబ్బతింటే అసలు మాటలే రావు. చెవిటి, మూగవాళ్లుగానే మిగిలిపోతారు. వినికిడికి అంత ప్రాధాన్యం. కాబట్టే ‘జీవితానికి వినికిడి: వినికిడి లోపంతో మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోకండి’ అని నినదిస్తోంది ప్రపంచ వినికిడి దినం. ఈ సందర్భంగా వినికిడి లోపానికి దారితీసే కారణాలు, చికిత్సలు, నివారణపై సమగ్ర కథనం ఈ వారం మీకోసం.

మాటలు, శబ్దాల వంటి వాటిని మనం యథాలాపంగా వింటుంటాం గానీ ఇదో అద్భుత ప్రక్రియ. ఇందుకోసం బయటి చెవి దగ్గర్నుంచి మెదడు వరకూ పెద్ద యంత్రాంగమే పని చేస్తుంటుంది. మన చెవిని మూడు భాగాలుగా విభజించుకోవచ్ఛు 1. బయటి చెవి. పైకి కనిపించేది ఇదే. దీని గుండానే శబ్ద తరంగాలు లోపలికి అడుగిడతాయి. 2. మధ్య చెవి. ఇందులో శబ్ద తరంగాలకు కంపించే కర్ణభేరి, దానికి అనుసంధానంగా మూడు గొలుసు ఎముకలు (మాలియస్‌, ఇంకస్‌, స్టేపిస్‌) ఉంటాయి. ఆయా శబ్దాలకు కర్ణభేరితో పాటు గొలుసు ఎముకలూ కంపిస్తాయి. 3. లోపలి చెవి. వినికిడికి తోడ్పడే అత్యంత కీలకమైన, సున్నితమైన భాగం ఇది. గుండ్రంగా, నత్తలా కనిపించే ‘కాక్లియా’ ఉండేది ఇందులోనే. మధ్య చెవిలోని గొలుసు ఎముకల్లో ఒకటి దీనికి అనుసంధానమై ఉంటుంది. కాక్లియాలో ద్రవం, ఆ ద్రవంలో తేలియాడే సున్నితమైన, సూక్ష్మమైన వెంట్రుకల్లాంటి రోమకణాలు వినికిడిలో కీలకపాత్ర పోషిస్తాయి. కర్ణభేరి, గొలుసు ఎముకల కదలికలతో కాక్లియాలోని ద్రవంలో సున్నితమైన అలలు లేస్తాయి. ఇవి రోమకణాలు అటూఇటూ కదిలేలా చేస్తాయి. వీటి నుంచి పుట్టుకొచ్చే విద్యుత్‌ ప్రచోదనాలు శ్రవణ నాడి ద్వారా ప్రయాణించి మెదడుకు చేరుకుంటాయి. అప్పుడు మెదడులో మాటలు, వినికిడికి సంబంధించిన భాగం శబ్దాలను విడమరచి వినపడేలా చేస్తుంది. అప్పుడే మనకు శబ్దాలను విన్న అనుభూతి కలుగుతుంది. ఈ మొత్తం యంత్రాంగంలో ఎక్కడ తేడా తలెత్తినా వినికిడి దెబ్బతినే ప్రమాదముంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనా ప్రకారం- ప్రపంచవ్యాప్తంగా 46.6 కోట్ల మంది పిల్లలు, పెద్దలు వినికిడి లోపంతో బాధపడుతున్నారు. దీంతో ఎంతోమంది శారీరకంగా, మానసికంగా, సామాజికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. మంచి విషయం ఏంటంటే వినికిడి లోపాన్ని సరిదిద్దటానికి ఇప్పుడు మంచి చికిత్సలు, సాధనాలు అందుబాటులో ఉండటం. సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకుంటే చాలావరకు ఇబ్బందుల పాలు కాకుండా చూసుకోవచ్ఛు అందువల్ల వినికిడి లోపం గురించి తెలుసుకొని ఉండటం, అవగాహన కలిగుండటం ప్రతి ఒక్కరి బాధ్యత.

వింటేనే మాటలు!

మనం మాట్లాడేది నోటితో. వినేది చెవులతో. ఇవి రెండూ వేర్వేరుగా అనిపించినా వీటి మధ్య అవినాభావ సంబంధముంది. ముఖ్యంగా పసితనంలో వినికిడి చాలా ముఖ్యం. చెవులు వినిపిస్తేనే మాటలు వస్తాయి. మనకు వినిపించే శబ్దాలు మెదడులోకి వెళ్లి నిక్షిప్తం అవుతాయి. ఆయా మాటలను వినటం, వాటిని అనుకరించటం ద్వారానే మాటలు నేర్చుకుంటామనే సంగతి చాలామందికి తెలియదు. అంటే మాటలు రావటానికి వినికిడి అత్యంత కీలకమన్నమాట. దురదృష్టవశాత్తు మనదేశంలో ప్రతి వెయ్యి శిశువుల్లో 5-6 మంది వినికిడి లోపంతో పుడుతున్నారని, వీరిలో తీవ్ర వినికిడి లోపం గలవారు 1-2 మంది ఉంటున్నారని అంచనా. దీన్ని సకాలంలో గుర్తించలేకపోవటం మూలంగానే ఎంతోమంది చెవిటి-మూగ పిల్లలుగా మిగిలిపోతుండటం విషాదం. వినికిడి లోపాన్ని ముందే గుర్తించి వినికిడి సాధనాలను, కాక్లియార్‌ ఇంప్లాంట్లను అమర్చగలిగితే వీరిని అందరి పిల్లలా ఎదిగేలా చేయొచ్ఛు చక్కటి జీవితాన్ని అందించొచ్ఛు

తీవ్రతా ముఖ్యమే

పిల్లలకు మాటలు వచ్చే విషయంలో వినికిడిలోపం తీవ్రతా ముఖ్యమే. వినికిడి లోపం మామూలుగా, మధ్యస్థంగా ఉన్నవాళ్లు కొంతవరకు వినగలుగుతారు. కొంతవరకు శబ్దాలు గ్రహించగలుగుతారు. కొన్ని శబ్దాలు, మాటలు మెదడులో నిక్షిప్తమవుతాయి. అందువల్ల వీరికి మాటలు వచ్చే అవకాశముంది. కాకపోతే అంత స్పష్టంగా ఉండకపోవచ్ఛు కాస్త నంగినంగిగా మాట్లాడొచ్ఛు వినికిడి లోపం తీవ్రంగా, మరీ తీవ్రంగా ఉన్నవారికి అసలే వినిపించకపోవటం వల్ల మాటలు రాకపోవచ్ఛు ఇలాంటివారిని సకాలంలో గుర్తించటం చాలా కీలకం. పుట్టిన వెంటనే శ్రవణ పరీక్ష చేయటం ద్వారా సమస్యను ముందే గుర్తించొచ్ఛు దీంతో అవసరమైన చికిత్స చేయటానికి వీలుంటుంది.

ప్రతి బిడ్డకూ పుట్టగానే ఆటోఎకోస్టిక్‌ ఎమిషన్‌ పరీక్ష చేసి, వినికిడి సామర్థ్యాన్ని గుర్తించటం తప్పనిసరి. సమస్య 30 డెసిబెల్స్‌ కన్నా ఎక్కువ ఉంటే వినికిడిలోపం ముప్పు ఉందనే అర్థం. ఇలాంటివారికి బ్రెయిన్‌స్టెమ్‌ ఎవకోడ్‌ రెస్పాన్స్‌ ఆడియోమెట్రీ (బెరా) పరీక్ష ద్వారా వినికిడి లోపం ఎంత ఉందని తెలుసుకోవాల్సి ఉంటుంది. తీవ్రతను బట్టి చికిత్స తీరుతెన్నులను నిర్ధారిస్తారు.●

పిల్లల్లో - కారణాలు

పిల్లలు తల్లి కడుపులో ఉండగానే 16 వారాల గర్భం సమయంలోనే శబ్దాలను వినగలుగుతారు. పుట్టిన వెంటనే తల్లి గొంతును గుర్తించగలుగుతారు కూడా. అయితే కొందరు పిల్లలకు పుట్టుకతోనే వినికిడి లోపం ఉంటుంది. కొందరికి మాటలు వచ్చిన తర్వాత రకరకాల సమస్యలతో వినికిడి దెబ్బతినొచ్ఛు ఇందుకు పలు అంశాలు దోహదం చేస్తుంటాయి.

గర్భిణికి రుబెల్లా, సైటోమెగాలే వంటి వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు వస్తే పిండం మీద దుష్ప్రభావం చూపొచ్ఛు ఇవి వినికిడికి అంత్యంత కీలకమైన కాక్లియాలో లోపాలకు దారితీయొచ్చు.

గర్భిణులు వేసుకొనే కొన్నిరకాల యాంటీబయోటిక్‌ మందులతోనూ పిల్లల్లో వినికిడి లోపం తలెత్తొచ్చు.

పుట్టిన వెంటనే పిల్లలు ఏడ్వకపోతే అత్యవసర విభాగంలో చేర్చి చికిత్స చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఇలా 48 గంటలకు పైగా అత్యవసర విభాగంలో చేర్చిన పిల్లలకూ వినికిడి లోపం రావొచ్ఛు అమైనోగ్లైకోజైడ్‌ రకం యాంటీబయోటిక్‌ మందులు, తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ల మూలంగా కాక్లియాలోని సూక్ష్మ కేశాలు దెబ్బతినే ప్రమాదముంది. అలాగే పుట్టిన వెంటనే ఏడ్వకపోవటం వల్ల మెదడుకు తగినంత ఆక్సిజన్‌ అందక మాటలు, వినికిడికి సంబంధించిన భాగాలు దెబ్బతినొచ్ఛు ఇదీ వినికిడిలోపానికి దారితీయొచ్చు.

పుట్టిన తొలిరోజుల్లో తీవ్రమైన కామెర్ల మూలంగానూ వినికిడి దెబ్బతినొచ్ఛు బిలిరుబిన్‌ స్థాయులు మరీ ఎక్కువైతే మెదడులో బేసల్‌ గాంగ్లియా భాగం దెబ్బతినటం దీనికి మూలం.

అమ్మవారు (మీజిల్స్‌), గవద బిళ్లలు (మంప్స్‌), మెదడు పొరల వాపు (మెనింజైటిస్‌), ఆటలమ్మ (చికెన్‌పాక్స్‌) వంటి ఇన్‌ఫెక్షన్లు సైతం వినికిడిని దెబ్బతీయొచ్ఛు మెనింజైటిస్‌ బారినపడ్డవారిలో కాక్లియాలో సిమెంటు లాంటి పదార్థం ఏర్పడి సమస్యాత్మకంగా పరిణమించొచ్చు.

మేనరికం పెళ్లి చేసుకున్నవారికి పుట్టే పిల్లల్లో జన్యులోపాల కారణంగానూ వినికిడి లోపం తలెత్తొచ్ఛు కాక్లియార్‌ ఇంప్లాంట్‌ అవసరమైన ప్రతి 10 మంది పిల్లల్లో 8 మంది మేనరిక వివాహాలు చేసుకున్నవారికి పుట్టినవారే ఉంటుండటం గమనార్హం.

కొందరికి పుట్టుకతోనే స్టేపిస్‌ ఎముక బిగుసుకుపోతుంది. ఏమాత్రం కదలదు. ఇది వినికిడి లోపానికి దారితీస్తుంది.

మధ్య చెవిలో జిగురు ద్రవం పోగుపడటం (ఆటటైటిస్‌ మీడియా విత్‌ ఎఫ్యూజన్‌) మూలంగానూ వినికిడి లోపం రావొచ్ఛు దీన్నే గ్లూ ఇయర్‌ అనీ అంటారు. వీరికి సర్జరీతో ద్రవాన్ని తొలగించి, వెంటిలేషన్‌ గొట్టాలు పెట్టాల్సి ఉంటుంది. సమస్యను సరిచేస్తే కాస్త ఆలస్యమైనా మాటలు బాగానే వస్తాయి. ●

చికిత్స

వినికిడిలోపం ఒక మాదిరిగా ఉన్న పిల్లలకు వినికిడి సాధనాలు బాగా ఉపయోగపడతాయి. ఇవి శబ్దాలు పెద్దగా వినిపించేలా చేస్తాయి. దీంతో బాగా వినిపిస్తుంది. అనంతరం పిల్లలకు స్పీచ్‌ థెరపీ చేయటం ద్వారా మాటలు బాగా వచ్చేలా చేయొచ్ఛు సమస్యను ఎంత త్వరగా గుర్తించి చికిత్స చేస్తే అంత త్వరగా మాటలు వస్తాయి. తీవ్రం, మరీ తీవ్ర సమస్య గలవారికి కాక్లియార్‌ ఇంప్లాంట్‌ను అమర్చాల్సి ఉంటుంది. వీరికి ఆడిటరీ వెర్బల్‌ థెరపీ కూడా అవసరం. శబ్దాలు వినిపించటం, అవి మెదడులో నిక్షిప్తమయ్యేలా చూడటం, తిరిగి మాట్లాడేలా చేయటం దీనిలోని ముఖ్యాంశం. దీన్ని కూడా వీలైనంత త్వరగానే చేయాలి. ఆలస్యమైనకొద్దీ మాటల స్పష్టత దెబ్బతినే ప్రమాదముంది. కాక్లియార్‌ ఇంప్లాంట్‌ను అమర్చటానికి 1-2 ఏళ్ల వయసు ఉత్తమం. 3-5 వరకూ అమర్చొచ్ఛు 5 ఏళ్లు దాటితే మాటలు సరిగా రావు. నంగినంగిగా మాట్లాడతారు.

పెద్దవారిలో ఒక మాదిరి నుంచి మధ్యస్థంగా వినికిడి లోపం ఉన్నవారికి వినికిడి సాధనాలు బాగా ఉపయోగపడతాయి. తీవ్రం నుంచి మరీ తీవ్ర వినికిడిలోపం గలవారికి కాక్లియార్‌ ఇంప్లాంట్‌ సర్జరీ ద్వారా వినగలిగేలా చేయొచ్ఛు ●

లోపం- రెండు రకాలు

చెవి నిర్మాణంలో గానీ బయటి, మధ్య, లోపలి చెవిలోని భాగాల్లో గానీ ఎక్కడ సమస్య తలెత్తినా వినికిడి లోపానికి దారితీయొచ్ఛు బయటి, మధ్య చెవిలో సమస్యలు గలవారికి శబ్ద తరంగాలు అసలు లోపలికే వెళ్లవు. ఇలాంటి రకాన్ని ‘కండక్టివ్‌’ వినికిడి లోపం అంటారు. కొందరికి లోపలి చెవిలోని కాక్లియాలో లోపాలు, కాక్లియా నుంచి మెదడుకు శబ్దాలను చేరవేసే శ్రవణ నాడి సరిగా లేకపోవటం, నాడి ఉన్నా సన్నబడి పోవటం వంటి వాటితో వినికిడి లోపం తలెత్తొచ్ఛు దీన్నే ‘సెన్సోరిన్యూరల్‌’ వినికిడి లోపం అంటారు. ●

పిల్లల్లో ఎప్పుడు అనుమానించాలి?

పిల్లలు 3 నెలల వయసు వచ్చేవరకు పెద్ద శబ్దాలకు ప్రతిస్పందిస్తుంటారు. తల్లి మాటలకు నవ్వటం, ఊరుకోవటం చేస్తుంటారు. 6 నెలల వయసు వచ్చేసరికి శబ్దాలు వచ్చే వైపునకు కళ్లు తిప్పుతుంటారు. ఏడాది వయసుకు శబ్దాలు వచ్చే వైపునకు తిరుగుతుంటారు. వద్దు, ఇలా రా, ఇంకేం కావాలి అనే మాటలకు ప్రతిస్పందించటం మొదలెడతారు. రెండేళ్లు వచ్చేసరికి పేరు పెట్టి పిలిస్తే ప్రతిస్పందిస్తారు. ఇలా వయసుతో పాటు వచ్చే మార్పుల్లో ఎలాంటి తేడా కనిపించినా వినికిడి లోపాన్ని అనుమానించాల్సి ఉంటుంది. మళ్లీ మళ్లీ చెప్పమని అడుగుతుండటం, టీవీ సౌండ్‌ పెంచుతుండటం, చదువులో వెనకబడిపోతుండటం, ప్రవర్తన సమస్యలు కనిపిస్తుండటం, చెవిలో చీము కారుతుండటం, చెవి నొప్పితో జ్వరం వంటివి ఉన్నా వినికిడి లోపాన్ని అనుమానించాలి.●

పెద్దవాళ్లలో - కారణాలు

పెద్ద వయసులో వచ్చే వినికిడిలోపాన్ని ‘పోస్ట్‌ లింగ్వల్‌ డఫె్‌నెస్‌’ అంటారు. ఇందుకు వయసుతో పాటు వచ్చే మార్పులతో పాటు ఇన్‌ఫెక్షన్ల వంటివీ కారణం కావొచ్చు.

వయసుతో పాటు వచ్చే చెవుడు (ప్రెస్‌బయోసిస్‌) 50, 55 ఏళ్ల వయసులో మొదలవుతుంటుంది. వీరికి మంద్ర స్వరాలు (లో టోన్స్‌) బాగానే వినిపిస్తాయి గానీ ఉచ్చ స్వరాలు (హై టోన్స్‌) సరిగా వినిపించవు. ప్రశాంత వాతావరణంలో మాటలు బాగానే వినిపిస్తాయి. చుట్టుపక్కల చప్పుళ్లు ఉన్నప్పుడు ఇబ్బంది పడతారు. ఆడవారి మాటలు సరిగా వినిపించవు. టీవీ సౌండ్‌ పెద్దగా పెడుతుంటారు. కాస్త దూరం నుంచి పిలిస్తే పలకలేరు. ఇది కుటుంబ సభ్యులకు ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తుంది. దీనికి మందులంటూ ఏవీ ఉండదు. సమస్య తీవ్రంగా ఉంటే వినికిడి సాధనాలు వాడుకోవాల్సి ఉంటుంది. సమస్య మరీ తీవ్రమైతే కాక్లియర్‌ ఇంప్లాంట్‌ అమర్చాల్సి ఉంటుంది.

పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేచోట పనులు చేసేవారికీ వినికిడి దెబ్బతినొచ్ఛు 85 డెసిబెల్స్‌ కన్నా ఎక్కువ శబ్దాలు వచ్చేచోట రోజుకు 8 గంటల సేపు పనిచేసేవారికి దీని ముప్పు ఎక్కువ. సాయుధ దళాలు, గని కార్మికులు, డీజేలు, పోలీసు సిబ్బంది వంటి వారికి ఇలాంటి లోపం రావొచ్ఛు ఇది పూర్తిగా నివారించుకోదగిన సమస్య. వినికిడిలోపం ఎక్కువగా గలవారికి వినికిడి సాధనాలు వాడుకోవాల్సి ఉంటుంది.

కొందరికి హఠాత్తుగా వినికిడి తగ్గుతుంటుంది. ఇన్‌ఫెక్షన్లు, మధుమేహం, అధిక రక్తపోటు, కొన్ని రక్తనాళాల సమస్యల వంటివి ఇందుకు దోహదం చేస్తుంటాయి. కిడ్నీ సమస్యలు, డయాలసిస్‌ చేయించుకునేవారికీ దీని ముప్పు ఎక్కువే. హఠాత్తుగా వినికిడి తగ్గిపోయేవారు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. వీలైనంత త్వరగా చికిత్స తీసుకుంటే వినికిడి దెబ్బతినకుండా చూసుకోవచ్ఛు 24-48 గంటల సమయం చాలా కీలకం. వీరికి మధ్యచెవిలోకి కార్టికోస్టిరాయిడ్‌ ఇంజెక్షన్లు ఇవ్వటం బాగా ఉపయోగపడుతుంది. నెల దాటినా చికిత్స తీసుకోకపోతే వినికిడి పూర్తిగా పోయే ప్రమాదముంది. అప్పుడు వినికిడి సాధనాలు, కాక్లియార్‌ ఇంప్లాంట్‌ సర్జరీ తప్ప మరో మార్గం ఉండదు.

దీర్ఘకాలంగా మధ్య చెవిలో ఇన్‌ఫెక్షన్‌ (క్రానిక్‌ సపరేటివ్‌ ఆటైటిస్‌ మీడియా) మూలంగా చెవిలో చీము, కర్ణభేరికి రంధ్రం పడటం మూలంగానూ వినికిడిలోపం రావొచ్ఛు కొందరికి కర్ణభేరి వెనకాల తిత్తిలాంటిదీ ఏర్పడొచ్చు (కొలెస్టియోటోమా). వీరికి చీము అంత ఎక్కువగా ఉండదు గానీ చెడు వాసన వస్తుంటుంది. ఇన్‌ఫెక్షన్‌ చుట్టుపక్కల ఎముక నుంచి పుర్రె ఎముకకూ విస్తరించే ప్రమాదముంది. ఇవి వినికిడిలోపానికి దారితీస్తాయి. వీరికి మాస్టయిడక్టమీ ప్రక్రియ ద్వారా చీమును తొలగించి, కర్ణభేరిని తిరిగి సరిచేయాల్సి ఉంటుంది (టింపనోప్లాస్టీ).

కొందరికి వంశపారంపర్యంగా ఆటోస్క్లెరోసిస్‌తోనూ వినికిడి దెబ్బతినొచ్ఛు ఇది ఆడవారిలో ఎక్కువ. ఇందులో స్టేపిస్‌ ఎముక బిగుసుకుపోతుంది. స్టేపిడాటమీ ప్రక్రియ ద్వారా స్టేపిస్‌ను తొలగించి, టెఫ్లాన్‌ పిస్టన్‌ అమర్చి మూడో ఎముకలా పనిచేసేలా చేస్తారు. దీంతో వినికిడి వెంటనే మెరుగవుతుంది.●

నివారించుకోవచ్చు

వినికిడిలోపాన్ని చాలావరకు నివారించుకోవచ్ఛు ఇందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.

రుబెల్లా, గవద బిళ్లలు, మెనింజైటిస్‌ వంటి ఇన్‌ఫెక్షన్ల నివారణకు టీకాలు ఇప్పించటం ముఖ్యం.

గర్భధారణ సమయంలో, పుట్టిన తర్వాత తల్లీబిడ్డల ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రతి శిశువుకూ పుట్టిన వెంటనే వినికిడి పరీక్ష చేయించాలి.

పనిచేసే చోట, చుట్టుపక్కల పెద్ద శబ్దాలు లేకుండా చూసుకోవాలి. పెద్ద శబ్దాలు వచ్చే చోట పనిచేసేవారు చెవులకు మఫ్స్‌ ధరించాలి.

ఎక్కువసేపు పెద్ద వాల్యూమ్‌తో సంగీతం వంటివి వినొద్ధు ఇయర్‌ ఫోన్స్‌ వాడేటప్పుడు వాల్యూమ్‌ మరీ శ్రుతి మించకుండా చూసుకోవాలి.

ఏవైనా మందులు వినికిడిని దెబ్బతీసే అవకాశముంటే ఆ విషయాన్ని డాక్టర్‌ను అడిగి తెలుసుకోవాలి.

వినికిడి లోపాన్ని అనుమానిస్తే తాత్సారం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.

కాటన్‌ బడ్స్‌, పిన్నులు, క్లిప్పులు, టూత్‌పిక్స్‌ వంటివి చెవిలో పెట్టటం తగదు.

చెవిలోంచి చీము, నీరు వంటివి వస్తుంటే నిర్లక్ష్యం చేయొద్దు.

చెవిలో నూనె వంటివేమీ పోయొద్దు.

అపరిశుభ్రమైన నీటిలో ఈదటం, స్నానం చేయటం తగదు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని