పిల్లల ఆరోగ్యం

Updated : 17/12/2019 01:23 IST
మూత్రపిండ ఉపద్రవం!

సమస్య పెద్దదే. సందేహమేమీ లేదు. అలాగని అందరికీ ప్రమాదకరం కాకపోవచ్చు. కొన్నిసార్లు దానంతటదే సమసిపోవచ్చు. కొందరికే తీవ్రంగా పరిణమించొచ్చు.  గర్భస్థ శిశువుల్లో తలెత్తే కిడ్నీ ఉబ్బు  అలాంటి సమస్యే.

పిల్లలకు చిన్న సమస్య వచ్చినా పెద్దవాళ్ల మనసు కలవరపడిపోతుంది. మరి కిడ్నీ ఉబ్బు అయితే? అదీ తల్లి కడుపులో ఉండగానే తలెత్తితే? ఎక్కడా లేని భయాలు ముసురుకుంటాయి. బిడ్డకు ఏమవుతుందో? కిడ్నీ ఎలా ఉంటుందో? సరిగా పనిచేస్తుందో, లేదో? శస్త్రచికిత్స చేయాల్సి వస్తుందేమో? శస్త్రచికిత్స చేస్తే పసిగుడ్డు తట్టుకుంటుందో లేదో? కిడ్నీ దెబ్బతింటే తొలగించాల్సి ఉంటుందేమో? అనే సందేహాలెన్నో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. కొందరు తీవ్ర ఆందోళనతో గర్భాన్ని తొలగించుకోవాలనీ భావిస్తుంటారు. నిజానికి అంత భయపడాల్సిన పనిలేదు. గర్భిణులకు చేసే స్కానింగ్‌ పరీక్షల్లో పిండంలో కిడ్నీ ఉబ్బినట్టు (హైడ్రోనెఫ్రోసిస్‌) తేలటం తరచూ చూస్తున్నదే. అత్యాధునిక గర్భిణి పరీక్షలు అందుబాటులోకి రావటం, దాదాపు గర్భిణులంతా వీటిని చేయించుకుంటుండటం, సమస్య స్వల్ప స్థాయిలోనే బయటపడటం వల్ల ఇటీవలి కాలంలో మరింత ఎక్కువగానూ వెలుగు చూస్తున్నాయి. ప్రతి 100 మంది గర్భస్థ శిశువుల్లో ఒకరిలో దీన్ని చూస్తుంటాం. అవటానికిది పెద్ద సమస్యే అయినా అందరికీ కిడ్నీ దెబ్బతినకపోవచ్చు. చాలామందికి దానంతటదే కుదురుకుంటుంది. మూడింట ఒక వంతు పిల్లలకే శస్త్రచికిత్స అవసరమవుతుంది. శస్త్రచికిత్సతో సమస్య పూర్తిగానూ  నయమైపోతుంది. కిడ్నీ తొలగించటమనేది చాలా చాలా అరుదు. భయాందోళనలకు గురికాకుండా సమస్యపై అవగాహన కలిగుండటం అత్యవసరం.

ఏమిటీ సమస్య?
గర్భస్థ శిశువులో 11-12 వారాల సమయంలో కిడ్నీలు మూత్రం తయారుచేయటం ఆరంభిస్తాయి. ఇది మూత్రనాళాల ద్వారా మూత్రాశయానికి చేరుకుంటుంది. మూత్రాశయం సంకోచించగానే బయటకు వచ్చి ఉమ్మనీటిలో కలుస్తుంది. పిండంలో మూత్రం తయారీ ఉద్దేశం రక్తాన్ని వడకట్టటం కాదు గానీ 14వ వారం నుంచి ఉమ్మనీటికి ఇదే ఆధారం. పిండం ఏర్పడే దశలో మూత్ర వ్యవస్థలో ఎలాంటి అవకరం తలెత్తినా సమస్యే. మూత్రనాళంలో అడ్డంకి తలెత్తితే కిడ్నీలో మూత్రనాళం ఆరంభమయ్యే చోట (రీనల్‌ పెల్విస్‌- వృక్కద్రోణి) మూత్రం నిల్వ ఉండిపోతుంది. ఇది కిడ్నీ ఉబ్బటానికి (హైడ్రోనెఫ్రోసిస్‌) దారితీస్తుంది.

ఎందుకిలా?
మన మూత్రకోశ వ్యవస్థ చాలా సంక్లిష్టమైంది. ఇది రెండు భాగాలుగా వృద్ధి చెందుతుంది. మూత్రం తయారయ్యే కిడ్నీలు ఒక భాగంగా.. వృక్కద్రోణి, మూత్రనాళాలు, మూత్రాశయం, మూత్రమార్గం (కలెక్టివ్‌ సిస్టమ్‌) మరొక భాగంగా.. వేర్వేరుగా ఏర్పడి ఒక్కటిగా కలుస్తాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు లోపాలు తలెత్తొచ్చు. సాధారణంగా వృక్కద్రోణి వద్ద.. అలాగే మూత్రనాళం, మూత్రాశయం కలిసేచోట లోపాలు, అడ్డంకులు తలెత్తుతుంటాయి. మగపిల్లల్లో మూత్రమార్గంలోనూ లోపాలు ఉండొచ్చు. కొందరికి మూత్రమార్గం, మూత్రాశయం సరిగా కలవకపోవచ్చు. ఇలాంటి లోపాలు, అడ్డంకులు గలవారిలో మూత్రం సరిగా కిందికి రాదు. దీంతో మూత్రం పైకి ఎగదన్నుకొచ్చి కిడ్నీ ఉబ్బిపోతుంది. కొందరికి కిడ్నీలు సరిగా ఏర్పడకపోవటం (మల్టీ సిస్టిక్‌ డిస్‌ప్లాస్టిక్‌ కిడ్నీ) వంటి ఇతరత్రా కారణాలతోనూ కిడ్నీ ఉబ్బొచ్చు. దీనికి ఇదమిత్థమైన కారణమంటూ ఏదీ లేదు. జన్యు లోపాలు, జన్యు మార్పులు, పోషణలోపం, గర్భిణులు వేసుకునే కొన్నిరకాల మందుల వంటి అంశాలెన్నో దీనికి దారితీయొచ్చు.

నిర్ధారణ ఎలా?
గర్భస్థ శిశువులో కిడ్నీ ఉబ్బు నిర్ధారణకు, తీవ్రతను అంచనా వేయటానికి అల్ట్రాసౌండ్‌ పరీక్షే కీలకం. వృక్కద్రోణి చుట్టుకొలత (యాంటీరియో పోస్టీరియర్‌ డయామీటర్‌- ఏపీడీ) రెండో త్రైమాసికంలో 4 మి.మీ... మూడో త్రైమాసికంలో 7 మి.మీ. కన్నా ఎక్కువుంటే కిడ్నీ ఉబ్బినట్టే. ఇది ఒక కిడ్నీకే పరిమితం కావాలనేమీ లేదు. కొందరికి రెండు కిడ్నీల్లోనూ ఉండొచ్చు.
* కిడ్నీ ఉబ్బు నిర్ధారణ అయ్యాక టిఫా స్కాన్‌ చేస్తారు. సమస్య ఒక కిడ్నీలోనే ఉందా? రెండు కిడ్నీల్లోనూ ఉందా? ఉమ్మనీరు ఎంత ఉంది? వృక్కద్రోణి సైజు ఎంత? కిడ్నీల్లో తిత్తులేవైనా ఉన్నాయా? మూత్రాశయం గోడ మందం పెరిగిందా? ఇతరత్రా లోపాలేవైనా ఉన్నాయా? అనేవి ఇందులో బయటపడతాయి.

మూడు రకాలు
వృక్కద్రోణి చుట్టుకొలతను బట్టి సమస్య తీవ్రతను మూడు రకాలుగా వర్గీకరిస్తారు. రెండో త్రైమాసికంలో మూత్రనాళం చుట్టుకొలత 4-6 మి.మీ. ఉంటే మామూలుగా.. 7-10 మి.మీ. ఉంటే ఒక మాదిరిగా.. 10 మి.మీ. అంతకన్నా ఎక్కువుంటే తీవ్రంగా పరిగణిస్తారు. మూడో త్రైమాసికంలో 7-9 మి.మీ. ఉంటే మామూలుగా.. 10-15 మి.మీ. ఉంటే ఒక మాదిరిగా.. 15 మి..మీ. కన్నా మించితే తీవ్రంగా భావిస్తారు.

నిరంతర పరిశీలన ముఖ్యం
గర్భస్థ శిశువులో కిడ్నీ ఉబ్బినప్పుడు నిరంతరం గమనిస్తూ ఉండటం ముఖ్యం. వీరికి 16వ వారం తర్వాత, 20వ వారంలో అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. ఉబ్బు అలాగే ఉంటోందా? ఎక్కువవుతోందా? మూత్రనాళంలో అడ్డంకులు ఎలా ఉన్నాయి? కొత్తగా లోపాలేవైనా పుట్టుకొచ్చాయా? అనేది వీటి ద్వారా తెలుస్తుంది. ఒక కిడ్నీలోనే సమస్య ఉంటే మూడో త్రైమాసికంలో మరోసారి స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. రెండు కిడ్నీల్లో సమస్య ఉన్నట్టయితే ప్రతి 4 వారాలకు ఒకసారి స్కాన్‌ చేయాల్సి వస్తుంది. సమస్య ఎలా ఉందన్నది తెలుసుకోవటానికే కాదు, పుట్టిన వెంటనే శస్త్రచికిత్స అవసరమా? అన్నది నిర్ణయించటానికివి తోడ్పడతాయి.

మామూలుదైతే  కుదురుకుంటుంది
సమస్య మామూలుగా, ఒక మాదిరిగా ఉంటే పుట్టిన తర్వాత 18 నెలల వయసు వచ్చేవరకు దానంతటదే కుదురుకుంటుంది. వీరికి 4-6 వారాల్లో, అలాగే 4-6 నెలల తర్వాత తరచూ అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేయాల్సి ఉంటుంది. ముందుజాగ్రత్తగా యాంటీబయోటిక్స్‌ అవసరమేమీ ఉండదు. ఒకవేళ మూత్రనాళం చుట్టుకొలత పెరుగుతున్నట్టు అనిపిస్తే డైయురెటిక్‌ రెనోగ్రఫీ పరీక్ష చేయాల్సి ఉంటుంది.

పుట్టిన తర్వాత ఎలా?
కిడ్నీ ఉబ్బుతో పుట్టిన పిల్లల్లో ముందుగా మూత్రం ఎంత వస్తోందని డాక్టర్లు పరిశీలిస్తారు. అనంతరం చేత్తో తాకి గడ్డలు, తిత్తుల వంటివేమైనా ఉన్నాయేమో చూస్తారు. తొలి మూడు రోజుల్లో పిల్లలు పాలు సరిగా తాగరు. మూత్రం అంతగా తయారు కాదు. ఉబ్బు కచ్చితంగా తెలియదు. అందువల్ల మూడు రోజుల తర్వాతే అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేస్తారు. తల్లి కడుపులో ఉన్నప్పుడు మొదలైన సమస్య ఇంకా అలాగే ఉందా? తగ్గిపోయిందా? అనేది ఇందులో తేలుతుంది. సమస్య ఉన్నా,  లేకపోయినా ఆరో వారంలో మరోసారి స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. కొందరికి ఈ సమయంలో ఉబ్బు తగ్గిపోవచ్చు. ఇలాంటివారికి మూడు నెలలు, ఆరు నెలల తర్వాత స్కాన్‌ చేసి చూసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఉబ్బు తగ్గకపోతే వృక్కద్రోణి చుట్టుకొలత, ఎస్‌ఎఫ్‌యూ గ్రేడింగ్‌ ఆధారంగా తీవ్రతను అంచనా వేస్తారు. వృక్కద్రోణి చుట్టుకొలత 10 మి.మీ., అంతకన్నా ఎక్కువ, ఎస్‌ఎఫ్‌యూ గ్రేడ్‌ 3-4 ఉన్నట్టయితే ఎక్కడైనా అడ్డంకులున్నాయా? మూత్రం వెనక్కి వెళ్తోందా? కిడ్నీ పనితీరు ఎలా ఉంది? అనేది చూడటానికి మరికొన్ని పరీక్షలు చేస్తారు. మూత్రాశయం వద్ద మూత్రనాళం సరిగా కుదురుకోని వారికి, ఒకవైపున రెండు మూత్రనాళాలు గలవారికి ఎంఆర్‌ఐ పరీక్ష చేయాల్సి ఉంటుంది.

శస్త్రచికిత్స ఎవరికి?
వృక్కద్రోణి చుట్టుకొలత తగ్గకుండా పెరుగుతున్నవారికి, మూత్రనాళంలో అడ్డంకులున్నట్టు తేలినవారికి, కిడ్నీ సామర్థ్యం (ఫంక్షన్‌) తగ్గుతున్నవారికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. దీన్నే ఆండర్సన్‌-హైన్స్‌ పైలోప్లాస్టీ అంటారు. ఇందులో కిడ్నీ, మూత్రనాళం కలిసే చోట ఏర్పడిన అడ్డంకిని తొలగిస్తారు. కొత్తగా గరాటు ఆకారంలో వెడల్పయిన మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. ఉబ్బిన వృక్కద్రోణి భాగాన్ని తొలగించి, కిడ్నీకి గట్టిగా జోడిస్తారు. అనంతరం స్టెంట్‌ అమరుస్తారు. ఇది మూత్రాశయంలోకి మూత్రం వెళ్లటానికి తోడ్పడుతుంది, కొత్తగా ఏర్పాటు చేసిన మార్గం కుంచించుకుపోకుండా అడ్డుకుంటుంది. ఈ శస్త్రచికిత్సను చర్మానికి గాటు పెట్టి (ఓపెన్‌) గానీ, ల్యాప్రోస్కోపిక్‌ పద్ధతిలో గానీ చేయొచ్చు. ల్యాప్రోస్కోపీ పద్ధతిలో మచ్చ పడదు. త్వరగా కోలుకుంటారు. కాకపోతే ఖర్చు ఎక్కువవుతుంది. శస్త్రచికిత్స అనంతరం వెంటనే ఉపశమనం లభిస్తుంది. కిడ్నీ పనితీరు మెరుగవుతుంది.
* శస్త్రచికిత్స చేసిన తర్వాత 3 నెలల పాటు యాంటీబయోటిక్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు వారాల తర్వాత స్టెంట్‌ తొలగిస్తారు. వీరికి 3 నెలల తర్వాత ఒకసారి అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేసి పరిశీలిస్తారు. అలాగే 6 నెలల తర్వాత డైయురెటిక్‌ రెనోగ్రామ్‌ పరీక్ష చేస్తారు. మూత్ర ప్రవాహం ఎలా ఉందన్నది ఇందులో బయటపడుతుంది.

అవసరమైతే అత్యవసర సర్జరీ
మూత్రమార్గం, మూత్రాశయం కలిసేచోట అడ్డంకి మూలంగా కిడ్నీ వాపుతో పుట్టిన మగబిడ్డకు వీలైనంత త్వరగా సర్జరీ చేయాల్సి ఉంటుంది. పుట్టిన వెంటనే బిడ్డ పరిస్థితి, కిడ్నీ ఉబ్బు, సామర్థ్యం, ఒంట్లో ఇన్‌ఫెక్షన్‌ వంటి వాటిని బట్టి నిర్ణయం తీసుకుంటారు.

ఇతర అడ్డంకులు గలవారికీ..
* మూత్రం పైకి.. అంటే మూత్రాశయం నుంచి కిడ్నీలోకి వెళ్లటం (వెసైకో యురెత్రిక్‌ రిఫ్లక్స్‌) వల్ల కిడ్నీ వాపు తలెత్తినవారికి సమస్య మామూలుగా ఉంటే మందులతో తగ్గిపోతుంది. తీవ్రంగా ఉంటే శస్త్రచికిత్స ద్వారా మూత్రనాళాన్ని సరిచేస్తారు. మూత్రాశయం, మూత్రనాళం కలిసే చోట అడ్డంకి (అబ్‌స్ట్రక్టివ్‌ మెగాయురెటర్‌) ఉంటే ఏడాది వయసు దాటాక  శస్త్రచికిత్స చేసి మూత్రనాళాన్ని తిరిగి మూత్రాశయంలోకి ప్రవేశపెడతారు.


కిడ్నీ తొలగింపు చాలా అరుదు

కిడ్నీ, మూత్రనాళం కలిసే చోట అడ్డంకి మూలంగా వాపు తలెత్తినవారికి కిడ్నీ తొలగించటమనేది చాలా చాలా అరుదు. కిడ్నీ సామర్థ్యం 10% కన్నా తగ్గితే తాత్కాలికంగా చర్మం నుంచి కిడ్నీలోకి గొట్టాన్ని వేయటం (పీసీఎన్‌), మూత్రనాళంలో స్టెంట్‌ వేయటం (డబ్ల్యూజె స్టెంట్‌) వంటి ముందు జాగ్రత్త చికిత్సలే చేస్తారు. నాలుగు వారాల తర్వాత పరిస్థితి మెరుగు పడితే ప్రాథమికంగా కిడ్నీలో మూత్రమార్గం కలిసే చోటును సరిచేస్తారు. అప్పటికీ పరిస్థితి మెరుగుపడకపోతే చివరి ప్రయత్నంగానే కిడ్నీని తొలగిస్తారు. పుట్టుకతో కిడ్నీలో రకరకాల ఆకారాల్లో తిత్తులతో (మల్టీసిస్టిక్‌ డిస్‌ప్లాస్టిక్‌ కిడ్నీ) వాపు తలెత్తినా కిడ్నీ తొలగించాల్సి రావొచ్చు.


గర్భస్థ శిశువుకూ..

ఉమ్మనీరు బాగా తగ్గినప్పుడు, కొందరికి తల్లి కడుపులో ఉండగానే శస్త్రచికిత్స చేసే అవకాశముంది. ఇందులో మూత్రాశయంలోకి గొట్టాన్ని పంపించి, దాన్ని ఉమ్మనీటిలోకి తెరచుకునేలా చేస్తారు (వెసికో-ఆమ్నియోటిక్‌ స్టెంట్‌). దీంతో కిడ్నీలో ఒత్తిడి తగ్గుతుంది. అధునాతన సౌకర్యాలు గల ఆసుపత్రుల్లోనే దీన్ని చేస్తారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని