పిల్లల ఆరోగ్యం

Updated : 15/10/2019 00:40 IST
పిల్లాడికి వృషణం ఉబ్బు!

సమస్య-సలహా

సమస్య: మా పిల్లాడి వయసు రెండేళ్లు. గత ఆరు నెలల నుంచి ఎడమ వృషణం ఉబ్బుగా ఉంది. ఇది వరిబీజం (హైడ్రోసిల్‌) అని, వెంటనే శస్త్రచికిత్స చేయాలని డాక్టర్లు చెప్పారు. పిల్లాడు ఇంకా చిన్నగానే ఉన్నాడు, ఇప్పుడప్పుడే శస్త్రచికిత్స వద్దని కొందరు డాక్టర్లు అంటున్నారు. ఏం చేయాలో పాలు పోవటం లేదు. దీనికి కచ్చితంగా ఆపరేషన్‌ చేయాల్సిందేనా? మందులతో ఏమైనా తగ్గుతుందా?

- కె. సతీశ్‌ (ఈ మెయిల్‌ ద్వారా)

సలహా: మీ పిల్లాడికి వచ్చింది వరిబీజమే. మీరు పంపిన స్కానింగ్‌ చిత్రాలు, రిపోర్టులను చూస్తుంటే సమస్య పెద్దగానే ఉన్నట్టు కనిపిస్తోంది. దీనికి శస్త్రచికిత్స చేయటం తప్ప మరో మార్గం లేదు. మందుల వంటి ఇతరత్రా చికిత్సలేవీ ఉపయోగపడవు. సాధారణంగా వృషణాలు పిండం కడుపులో ఏర్పడతాయి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు 9 నెలల సమయంలో నెమ్మదిగా కిందికి దిగుతాయి. ఇవి కిందికి దిగిన తర్వాత కడుపు గోడ వద్ద ఏర్పడిన మార్గం మూసుకుపోతుంది. కారణమేంటో తెలియదు గానీ కొందరిలో ఈ మార్గం సరిగా మూసుకుపోదు. దీంతో వృషణం పొరల్లో నీరు చేరి ఉబ్బుతుంది. దీన్నే వరిబీజం అంటారు. మీ పిల్లాడికి వచ్చిన సమస్య ఇదే. మామూలుగానైతే పిల్లల్లో వరిబీజం ఉన్నప్పుడు 18 నెలల వయసు వచ్చేంతవరకు వేచి చూస్తారు. ఎందుకంటే ఈ సమయంలో కొన్నిసార్లు మార్గం దానంతటదే మూసుకుపోతుంది. పెద్దగా ఇబ్బందులేవీ ఉండవు. ఒకవేళ 18 నెలలు దాటిన తర్వాతా ఉబ్బు అలాగే ఉన్నట్టయితే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ఎవరికైనా ఉబ్బు ఎక్కువగా ఉంటే అంతకన్నా ముందే చేయాల్సి రావొచ్ఛు మీ పిల్లాడి వయసు రెండేళ్లు అంటున్నారు. ఉబ్బూ ఎక్కువగానే ఉంది. కాబట్టి శస్త్రచికిత్స చేసి, సరిచేయటమే పరిష్కారం. వరిబీజం శస్త్రచికిత్స పెద్దదేమీ కాదు. చాలా తేలికైంది. వృషణం దగ్గర 3.5 సెం.మీ. చిన్న కోతతోనే చేస్తారు. మచ్చేమీ పడదు. చికిత్స పూర్తికాగానే ఇంటికి వెళ్లిపోవచ్ఛు భయపడాల్సిన పనిలేదు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని