బుధవారం, అక్టోబర్ 28, 2020

వాస్తు

Published : 29/12/2018 01:45 IST
నలువైపులా మార్కెట్‌ జోరు! 

కొనుగోలుదారులకు కొంత మోదం.. కొంత ఖేదం 
2018లో స్థిరాస్తి రంగం

ఈనాడు, హైదరాబాద్‌: స్తిరాస్థి రంగం ఈ ఏడాది దూకుడుగా సాగింది. భూములు, స్థలాలు, ఫ్లాట్ల ధరలు అమాంతం పెరిగాయి. రియాల్టీకి కేంద్రంగా ఉన్న పశ్చిమ హైదరాబాద్‌ మొదలు నగరంలో అన్నివైపులా మార్కెట్‌ జోరు కన్పించింది. నిర్మాణాలు ఊపందుకున్నాయి. స్థలాల ధరలు బాగా పెరగడంతో ఇదివరకే కొన్నవారు సంతోషంగా ఉన్నా.. అందనంత ఎత్తుకు ఇళ్లు, స్థలాల రేట్లు ఎగబాగడం కొనాలనే యోచనలో ఉన్నవారిని తీవ్ర నిరాశకు గురిచేసింది. ధరలు అసలు ఎందుకు పెరుగుతున్నాయో ఇటు కొనుగోలుదారులకు, అటు పరిశ్రమవర్గాలకే అర్థం కాని పరిస్థితుల్లో 2018 స్థిరాస్తి మార్కెట్‌ గడిచింది. 2019లో ఈ దూకుడు కొనసాగనుందా?..చూడాలి. 
స్థిరాస్తి రంగం హైదరాబాద్‌లో నాలుగేళ్లుగా స్థిరంగా కొనసాగుతోంది. గత మూడేళ్లలో పెద్ద నోట్ల ఉపసంహరణ, జీఎస్‌టీ, రెరా వంటి ఒడుదొడుకులు ఎదురైనా.. వాటిపై స్పష్టత వచ్చాక మార్కెట్‌ స్థిరపడింది. గత ఏడాది నుంచి మార్కెట్‌ మరింత పుంజుకుంది. ఈ ఏడాది అది కొనసాగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా ఆ ప్రభావమేమి మార్కెట్‌పై కన్పించలేదు. తనిఖీల నేపథ్యంలో నగదు చెల్లింపులో ఇబ్బందులతో లావాదేవీలు తాత్కాలికంగా వాయిదా పడినా కొనుగోళ్లు యథావిధిగా సాగాయి.

స్థలాల ధరలు పెరగడం వెనక..

భూమి కూడా ఆయిల్‌ మాదిరే. మార్కెట్‌ ఎకానమీపై ఆధారపడి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉండటం, పాలనాపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోవడం, శాంతిభద్రతలు మెరుగ్గా ఉండటంతో మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ స్థలాలు, భూములు కొనేందుకు పెట్టుబడిదారులు ఆసక్తిచూపిస్తున్నారు. రూపాయితో పోలిస్తే డాలర్‌ విలువ పెరగడంతో ప్రవాస భారతీయులు సైతం భూములపై పెట్టుబడి పెడుతున్నారు. మొత్తంగా 2018లో గృహ, కార్యాలయ మార్కెట్‌లో వృద్ధి కన్పించింది. సిద్ధంగా ఉన్న నాణ్యమైన ఏ1 కార్యాలయాలను బహుళ జాతి కంపెనీలు లీజుకు తీసుకునేందుకు ముందుకొచ్చాయి. ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఇవన్నీ గృహ నిర్మాణంలో డిమాండ్‌ పెరిగేందుకు దోహదం చేస్తాయి. గత పాలకులే తిరిగి అధికారంలోకి రావడంతో పాత విధానాలకే కొనసాగింపు ఉంటుంది కాబట్టి 2019లోనూ మార్కెట్‌లో ఇదే దూకుడు కొనసాగే అవకాశం ఉంది.
- పి.రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి, క్రెడాయ్‌ హైదరాబాద్‌ 

అడ్డంకులు అధిగమిస్తే మరింత మెరుగుదల

ఈ ఏడాది భూములు, స్థలాలు, కార్యాలయాలు, రిటైల్‌, ఇళ్ల ధరలు అన్నీ పెరిగాయి. ఇళ్ల ధరల్లో 15-25 శాతం వృద్ధి ఉంటే ఏ-1 కార్యాలయాల్లో ధరల వృద్ధి 40 నుంచి 50 శాతంగా ఉంది. పూర్తయిన ఇళ్లకు జీఎస్‌టీ లేకపోవడంతో గతంలో అమ్ముడుకాకుండా మిగిలిపోయిన ఫ్లాట్లు విక్రయమయ్యాయి. మొత్తం మార్కెట్‌ పరంగా ఈ ఏడాది ఆశాజనకంగా సాగింది. కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి.. వాటిని అధిగమిస్తే రాబోయే ఏడాదిలోనూ మార్కెట్‌ మెరుగ్గా ఉంటుంది. జీఎస్‌టీ అధికంగా ఉండటం, స్పష్టత కొరవడటంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌లు ఆలస్యమయ్యాయి. భూముల మార్పిడి అనుకున్నంత వేగంగా సాగడం లేదు. పర్యావరణ ప్రభావం అంచనా చేసే కమిటీ లేకపోవడం కొత్త ప్రాజెక్ట్‌లపై ప్రభావం పడుతోంది. వీటిపై ప్రభుత్వాలు సానుకూలంగానే ఉన్నాయి.. త్వరగా పరిష్కారాలు లభిస్తే మేలు జరుగుతుంది. భూముల ధరలు అనూహ్యంగా పెరగకుండా కొంత స్థిరత్వం రావాల్సి ఉంది. ఇది జరగాలంటే అన్ని చోట్ల మౌలిక వసతులు మెరుగవ్వాలి. 
- ఆర్‌.చలపతిరావు, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు, ట్రెడా 

2019పై భారీ ఆశలు

స్థిరాస్తి రంగానికి 2019 మరింత సానుకూలంగా ఉంటుందని నిర్మాణదారులు భావిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లు/ఫ్లాట్ల కొనుగోలు జీఎస్‌టీతో భారంగా మారింది. 12 శాతం జీఎస్‌టీ విధిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌ డ్యూటీ దీనికి అదనం. నిర్మాణంలో ఉన్న ఇల్లు కొంటే 18 శాతం పన్నులు కొనుగోలుదారుడు చెల్లించాల్సి రావడం తలకు మించిన భారంగా మారింది. జీఎస్‌టీని 12 నుంచి 6 శాతానికి తగ్గించాలని స్థిరాస్తి సంఘాలు మొదటి నుంచి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రస్తుతం జీఎస్‌టీ మండలి ముందు తగ్గింపు ప్రతిపాదనలు ఉన్నాయి. వాటిని పరిశీలిస్తోంది. కొత్త సంవత్సరంలో ఇది అమల్లోకి వస్తే సొంతింటి భాగ్యం మరింత ఎక్కువమందికి దక్కనుంది. 

నిర్మాణ రంగంలో దాదాపు మిగతా వస్తువులు, సామగ్రిపై 18 శాతం జీఎస్‌టీ ఉండగా సిమెంట్‌పై అత్యధికంగా 28 శాతం ఉంది. దీనిని 18 శాతానికి తగ్గించే ప్రతిపాదనలు ప్రస్తుతం జీఎస్‌టీ మండలి ముందు ఉన్నాయి. ఈ రెండింటిపై కొత్త సంవత్సరంలో సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉందని నిర్మాణదారులు ఆశిస్తున్నారు. పెరిగిన ధరలతో సామాన్యులకు అందకుండా పోతున్న సొంతింటి కల సాకారం చేసుకోవడం కేంద్రం తీసుకోబోయే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది.

స్థలాలపైనే పెడుతున్నారు..

ఇదివరకు తమ వద్ద ఉన్న సొమ్మును వేర్వేరు పొదుపు సాధనాల్లో మదుపు చేసేవారు. బ్యాంకుల్లో డిపాజిట్లు, షేర్లు, బంగారం కొనేవారు. రాబడి అంతగా లేకపోవడమే కాదు అసలుకు భద్రత కొరవడటంతో భూములపై మదుపు చేస్తున్నారు. స్థోమతను బట్టి స్థలాలు, భూములు.. ఇళ్లు, విల్లాలు కొనుగోలు చేస్తున్నారు. నిబంధనల మేరకు ఉన్న లేఅవుట్లలో హాట్‌కేకుల్లా విక్రయం అవుతున్నాయి. డిమాండ్‌ అధికంగా ఉండటంతో ధరలు నెలనెలా పెంచేస్తున్నారు. ఇళ్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న ప్రాంతాల్లో ఎవరూ ఊహించనంతగా ఎగబాకాయి. ఏడాది వ్యవధిలోనే చ.గజం కొన్ని ప్రాంతాల్లో పదివేల వరకు పెరిగిన దాఖలాలు ఉన్నాయి. అపార్ట్‌మెంట్లలో కొంత ఫర్వాలేదు. ఇక్కడ చ.అ.రూ.400 నుంచి రూ.600 వరకు పెరుగుదల కన్పించింది.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని