Published : 19/06/2021 01:51 IST
కొత్త పట్టణాలొస్తున్నాయ్‌...!

ప్రాంతీయ వలయ రహదారికి అటు ఇటుగా..

ఈనాడు, హైదరాబాద్‌

స్థిరాస్తి వ్యాపారంలో టౌన్‌షిప్‌ల శకం మళ్లీ మొదలైంది. హైదరాబాద్‌లో రెండు దశాబ్దాల క్రితమే శివారు ప్రాంతాల్లో వీటి పోకడ మొదలైనా.. మధ్యలో చాలాకాలం పాటు రియల్‌ వ్యాపారులు వీటికి దూరంగా ఉన్నారు.  వెంచర్లు, ఆకాశహర్మ్యాల నిర్మాణాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం టౌన్‌షిప్‌ల పాలసీ తేవడంతో పలువురు స్థిరాస్తి వ్యాపారులు వీటి ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. ప్రాంతీయ వలయ రహదారికి చేరువలో ఎక్కువగా ఈ తరహా ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు ముందస్తు బుకింగ్‌లు ప్రారంభించగా.. మరికొన్ని ఆయా ప్రాజెక్టుల్లో కొంతవరకు విక్రయాలు పూర్తి చేశాయి. ఇంకొన్ని సంస్థలు రాబోయే ఒకటి రెండేళ్లలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
బాహ్యవలయ రహదారి(ఓఆర్‌ఆర్‌)తో నగరానికి రవాణా అనుసంధానం మెరుగైంది. ప్రస్తుతం పరిశ్రమలు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, కలెక్టరేట్లు, వినోద కేంద్రాలు, డాటా సెంటర్లు, విద్యాలయాలు అవుటర్‌ చేరువలోనే అధికంగా ఏర్పాటవుతున్నాయి. అత్యధిక శాతం ఓఆర్‌ఆర్‌ బయటే వస్తున్నాయి. వీటి నిర్మాణ పనులు ప్రస్తుతం వేర్వేరు దశల్లో ఉన్నాయి. ఒకటి రెండేళ్లలో అక్కడ కార్యకలాపాలు మరింత పుంజుకోనున్నాయి. ప్రాంతీయ వలయ రహదారి పనులు మొదలైతే వీటి పరిధి మరింత విస్తరించి.. పెద్ద ఎత్తున ఉపాధికి నిలయాలుగా మారబోతున్నాయి. వీరందరికీ పెద్ద ఎత్తున ఆవాసాలు కావాలి. నగరంలో నివాసం అంటే ఉపాధి కేంద్రాల నుంచి ఎంతలేదన్నా 30 నుంచి 50 కి.మీ. దూరం అవుతుంది. వీటన్నింటి దృష్ట్యా భవిష్యత్తులో డిమాండ్‌ ఉంటుందని ఓఆర్‌ఆర్‌ బయట-ప్రాంతీయ వలయ రహదారి చుట్టుపక్కల టౌన్‌షిప్‌ ప్రాజెక్టులను రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ప్రకటిస్తున్నాయి.

అన్నివర్గాలకు తగ్గట్టుగా..
ఇప్పటివరకు ఎక్కువగా ఒక ప్రాజెక్టులో అపార్ట్‌మెంట్లు లేదంటే విల్లాలు నిర్మిస్తూ వస్తున్నారు. సాధారణంగా ఇవి ఐదు ఎకరాల నుంచి 50 ఎకరాల విస్తీర్ణంలో ఉండేవి. ప్రాజెక్టు మొత్తం ఒకే విధంగా డిజైన్‌ చేసేవారు. ఇప్పుడు వేర్వేరు ఆదాయా వర్గాలను దృష్టిలో పెట్టుకుని టౌన్‌షిప్పు ప్రాజెక్టులతో ముందుకొస్తున్నారు. ఇందులో కొంత విస్తీర్ణంలో స్థలాలకు కేటాయిస్తున్నారు. ఇంకొంత స్థలంలో అపార్ట్‌మెంట్లు కట్టబోతున్నారు. మరికొంత స్థలంలో విల్లాలను అభివృద్ధి చేస్తున్నారు. వీటితో పాటూ అక్కడే అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు, ఆసుపత్రులు, వాణిజ్య కేంద్రాలు, మాల్స్‌, మల్టీఫ్లెక్స్‌లు ఉండేలా డిజైన్‌ చేస్తున్నారు. రెండు వందల గజాల స్థలం రూ.20 లక్షలు మొదలు, అపార్ట్‌మెంట్లు రూ.40 నుంచి రూ.50 లక్షల ధరల శ్రేణిలో,  విల్లాలు రూ.రెండు కోట్లపైన ఈ ప్రాజెక్టుల్లో విక్రయిస్తున్నారు. తక్కువలో తక్కువ 50 ఎకరాలు మొదలు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో వీటిని చేపడుతున్నారు. భారీ ప్రాజెక్టులు కావడంతో దశలవారీగా పట్టాలెక్కిస్తున్నారు.
* విమానాశ్రయం పరిధిలోనూ వీటిని అభివృద్ధి చేస్తున్నారు.
* ఫార్మాసిటీకి చేరువలో యాచరంలో ఒక సంస్థ విల్లాలు, స్థలాలతో కలిపి ఒక టౌన్‌షిప్‌ తీసుకొచ్చింది.
* చౌటుప్పల్‌ దగ్గరలో ఒక సంస్థ భారీ ఎత్తున దీనిని అభివృద్ధి చేస్తోంది.
* శ్రీశైలం రహదారిలో ఓఆర్‌ఆర్‌ చేరువలో విల్లాలు, అపార్ట్‌మెంట్లు, పాఠశాలలు, ఇతర సౌకర్యాలతో  ఒక సంస్థ చాలా ఏళ్ల క్రితమే ఈ పోకడకు తెరతీసింది.  


భవిష్యత్తు పెట్టుబడిగా..

గరానికి దూరంగా టౌన్‌షిప్‌లు వస్తున్నా.. ఓఆర్‌ఆర్‌తో రవాణా మెరుగు కావడంతో అత్యవసరాల్లో గంటలో నగరానికి చేరుకునే అవకాశం స్థిరాస్తి వ్యాపారానికి సానుకూలంగా మారింది. ఎక్కువ మంది భవిష్యత్తు పెట్టుబడిగా చూస్తున్నారు. నగరం రాబోయే పదేళ్లలో మరింత విస్తరించే అవకాశం ఉండటం వల్ల ముందుచూపుతో వీటిల్లో పెట్టుబడికి మొగ్గు చూపుతున్నారు. కాలుష్యానికి దూరంగా, ఆహ్లాదంగా, పచ్చని పరిసరాల్లో ఉండేందుకు సకల సౌకర్యాలున్న వీటి వైపు కొంతమంది ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతానికి చాలావరకు ప్రాజెక్టులు ప్రణాళిక దశలోనే ఉన్నాయి. కొన్ని సంస్థలు మౌలిక వసతుల కల్పన మొదలెట్టాయి. వీటి అభివృద్ధికి భారీ ఎత్తున నిధులు కావాల్సి ఉండటంతో దశలవారీగా ప్రాజెక్టును పూర్తిచేయనున్నాయి.

* కడ్తాల్‌ సమీపంలో దశాబ్దకాలంగా ఒక సంస్థ స్థలాలు, విల్లాలు, పాఠశాల, ఆసుపత్రి, ఇతర సౌకర్యాలతో ఇందుకు దశాబ్దం క్రితమే పురుడు పోసింది.
* శంషాబాద్‌లో ఒక సంస్థ 150 ఎకరాల విస్తీర్ణంలో అపార్ట్‌మెంట్లు, విల్లాలు, పాఠశాల, ఆసుపత్రి, వాణిజ్యకేంద్రాలతో టౌన్‌షిప్‌ అభివృద్ధి చేస్తోంది.  
* విమానాశ్రయం చేరువలో మరో సంస్థ రెండువేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి టౌన్‌షిప్‌నకు ప్రణాళికలు రూపొందిస్తోంది. చాలావరకు భూసేకరణ పూర్తయింది. డిజైనింగ్‌ దశలో ఉంది.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని