ఇంగ్లాండ్ చిత్తు
చివరి టెస్టులో భారత్ ఘనవిజయం
సిరీస్ 3-1తో టీమ్‌ఇండియా వశం
లార్డ్స్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కోహ్లీసేన
అహ్మదాబాద్
ఎలా మొదలెట్టామన్నది కాదు.. ఎలా ముగించామన్నది ముఖ్యం!
ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత విజయానంతరం సొంతగడ్డపై ఎంతో ధీమాగా సిరీస్‌ను ఆరంభించి అనూహ్య పరాభవంతో విమర్శలెదుర్కొన్న టీమ్‌ఇండియా.. ముగింపులో మాత్రం తలెత్తుకుని నిలిచింది!
రెండో టెస్టు నుంచి ఆటను తనవైపు ‘తిప్పేసుకున్న’ కోహ్లీసేన.. ప్రత్యర్థిని వరుసగా మూడు మ్యాచ్‌ల్లో స్పిన్ ఉచ్చులో బిగించి ఘోర పరాభవాల్ని రుచి చూపింది.
మొతేరా ఈసారి బ్యాటింగ్‌కూ సహకరించినప్పటికీ, పర్యటక జట్టు నుంచి కనీస పోరాట పటిమ కొరవడిన వేళ.. ఇన్నింగ్స్ విజయంతో సిరీస్‌ను ముగించిన టీమ్‌ఇండియా, ప్రపంచ ఛాంపియన్‌షిప్ పట్టికలో అగ్రస్థానంతో సగర్వంగా ఫైనల్లోకి అడుగు పెట్టింది.
సొంతగడ్డపై ఎనిమిదేళ్లకు పైగా అప్రతిహతంగా సాగుతున్న జైత్రయాత్రను కొనసాగించిన భారత్.. వరుసగా 13వ సిరీస్ విజయాన్ని ఖాతాలో వేసుకోవడం విశేషం.
రెండో రోజు విజయానికి బాటలు పడిపోయాయి. పైచేయి భారత్‌దే. కానీ ప్రత్యర్థి ప్రతిఘటిస్తుందేమో అనుకుంటే.. అలాంటిదేమీ జరగలేదు. వాషింగ్టన్ సుందర్ (96 నాటౌట్; 174 బంతుల్లో 10×4, 1×6) లాంటి లోయర్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ వీరవిహారం చేసిన పిచ్ మీద.. కాసేపటికే ఇంగ్లిష్ జట్టు పేక మేడలా కూలిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 54.5 ఓవర్లలో 135 పరుగులకే ఆలౌటై ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో చిత్తయింది. భారత స్పిన్ అస్త్రాలు అశ్విన్ (5/47), అక్షర్ పటేల్ ((5/48) మరోసారి ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. డాన్ లారెన్స్ (50; 95 బంతుల్లో 6×4), జో రూట్ (30; 72 బంతుల్లో 3×4) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. అంతకుముందు సుందర్, అక్షర్ (43; 97 బంతుల్లో 5×4, 1×6)ల జోరుతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులు చేసి ఆలౌటైంది. పంత్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపిక కాగా.. అశ్విన్ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. ఈ విజయంతో భారత్ సిరీస్‌ను 3-1తో చేజిక్కించుకోవడమే కాక.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పట్టికలో అగ్రస్థానంతో ఫైనల్‌కు అర్హత సాధించింది.
చేతులెత్తేసిన ఇంగ్లాండ్: పిచ్ గత మ్యాచ్‌లో మాదిరి స్పిన్నర్ల స్వర్గధామం కాదు. ఇది డేనైట్ టెస్టూ కాదు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 365 పరుగులు చేసింది. పంత్ శతకం బాదాడు. సుందర్ సెంచరీకి చేరువగా వచ్చాడు. ఇలాంటి పిచ్‌పై ఇంగ్లాండ్ కుప్పకూలిన తీరు అనూహ్యం. రెండో ఇన్నింగ్స్‌లో తొలి 4 ఓవర్లు మాత్రమే ఆ జట్టు వికెట్ కోల్పోకుండా నిలిచింది. అశ్విన్ బంతి అందుకున్న తొలి ఓవర్లోనే ఆ జట్టు రెండు వికెట్లు ఇచ్చేసింది. వరుస బంతుల్లో క్రాలీ (5), బెయిర్‌స్టో (0)లను అతను పెవిలియన్ చేర్చాడు. క్రాలీ ఆఫ్ సైడ్ స్లిప్‌లో రహానెకు దొరికిపోతే.. బెయిర్‌స్టో లెగ్ స్లిప్‌లో రోహిత్ చేతికి చిక్కాడు. కాసేపటికే సిబ్లీ (3).. అక్షర్ పటేల్ వికెట్ల ఖాతా తెరిచాడు. స్టోక్స్ (2) కూడా ఎంతోసేపు నిలవలేదు. అక్షర్ బౌలింగ్‌లోనే లెగ్ స్లిప్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. స్కోరు 30/4. ఈ దశలో కెప్టెన్ రూట్‌తో పాటు పోప్ (15) ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. అయితే అక్షర్ బౌలింగ్‌లోనూ ముందుకొచ్చి షాట్ ఆడబోయి విఫలమైన పోప్ స్టంపౌటై వెనుదిరగ్గా.. అశ్విన్ వేసిన తర్వాతి ఓవర్లో రూట్ వికెట్ల ముందు దొరికిపోయాడు. 65/5కు చేరుకున్న ఇంగ్లాండ్.. వందైనా చేస్తుందా అనిపించింది. ఫోక్స్ (13) సహకారంతో లారెన్స్ ధాటిగా ఆడి స్కోరును మూడంకెలకు చేర్చాడు. 109 పరుగుల వద్ద ఫోక్స్ ఔటయ్యాక ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఎంతోసేపు సాగలేదు. అవతల వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో ధాటిగా ఆడి అర్ధశతకం పూర్తి చేసిన లారెన్స్.. చివరికి అశ్విన్ బౌలింగ్‌లో సిరీస్ చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు.
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 205
భారత్ తొలి ఇన్నింగ్స్: 365
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (సి) రహానె (బి) అశ్విన్ 5; సిబ్లీ (సి) పంత్ (బి) అక్షర్ 3; బెయిర్‌స్టో (సి) రోహిత్ (బి) అశ్విన్ 0; రూట్ ఎల్బీ (బి) అశ్విన్ 30; స్టోక్స్ (సి) కోహ్లి (బి) అక్షర్ 2; పోప్ (స్టంప్డ్) పంత్ (బి) అక్షర్ 15; లారెన్స్ (బి) అశ్విన్ 50; ఫోక్స్ (సి) రహానె (బి) అక్షర్ 13; బెస్ (సి) పంత్ (బి) అక్షర్ 2; లీచ్ (సి) రహానె (బి) అశ్విన్ 2; అండర్సన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 12 మొత్తం: (54.5 ఓవర్లలో ఆలౌట్) 135; వికెట్ల పతనం: 1-10, 2-10, 3-20, 4-30, 5-65, 6-65, 7-109, 8-111, 9-134; బౌలింగ్: సిరాజ్ 4-0-12-0; అక్షర్ పటేల్ 24-6-48-5; అశ్విన్ 22.5-4-47-5; సుందర్ 4-0-16-0
సుందర్.. ఆహా, అయ్యో!
రెండో రోజు పంత్, సుందర్‌ల అనూహ్య ప్రతిఘటనతో మ్యాచ్‌పై పట్టు కోల్పోయిన ఇంగ్లాండ్.. మూడో రోజు ఉదయం సాధ్యమైనంత త్వరగా చివరి మూడు వికెట్లు పడగొట్టి ఆధిక్యాన్ని తగ్గించాలని చూడగా.. ఆ జట్టు ఆశలకు గండి కొట్టారు సుందర్, అక్షర్. ఓవర్‌నైట్ స్కోరు 294/7తో భారత ఇన్నింగ్స్ కొనసాగించిన వీళ్లిద్దరినీ.. ఇంగ్లాండ్ బౌలర్లు ఇబ్బంది పెట్టలేకపోయారు. ఆధిక్యం వంద దాటగానే ఇద్దరూ దూకుడుగా ఆడటం మొదలుపెట్టారు. ముఖ్యంగా సుందర్ పూర్తి సాధికారితతో బ్యాటింగ్ చేశాడు. అతడి లాఫ్టెడ్ షాట్లు ముచ్చటగొలిపాయి. అక్షర్ సైతం క్రీజు దాటి బయటికొచ్చి చక్కటి షాట్లు అందుకున్నాడు. చూస్తుండగానే భారత్ ఆధిక్యం 150, వీరి భాగస్వామ్యం వంద దాటిపోయింది.అయితే సుందర్ 96 పరుగులపై ఉండగా.. అనూహ్యంగా భారత్ ఒక్క పరుగూ జోడించకుండా మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. రూట్ బౌలింగ్‌లో లేని పరుగు ప్రయత్నించి అక్షర్ రనౌటైపోగా.. తర్వాతి ఓవర్లో స్టోక్స్ వరుస బంతుల్లో ఇషాంత్ (ఎల్బీ), సిరాజ్ (బౌల్డ్)లను ఔట్ చేసి సుందర్‌కు శతకానందం లేకుండా చేశాడు.
భారత్ నంబర్‌వన్
దుబాయ్: ఇంగ్లాండ్‌తో ఆఖరి టెస్టులో ఘన విజయం సాధించిన టీమ్‌ఇండియా ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత పొందడంతో పాటు.. టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 12 విజయాలు, నాలుగు ఓటములు, ఒక డ్రాతో మొత్తం 520 పాయింట్లతో భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ లీగ్ దశను అగ్రస్థానంతో ముగించింది. 420 పాయింట్లతో న్యూజిలాండ్ రెండో స్థానం సాధించింది. ఏడు మ్యాచ్‌ల్లో నెగ్గిన కివీస్.. నాలుగు టెస్టులు ఓడింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ 3, 4 స్థానాల్లో నిలిచాయి. తొలి రెండు స్థానాల్లో ఉన్న భారత్, కివీస్ జూన్‌లో లార్డ్స్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో తలపడతాయి. భారత్ (122 రేటింగ్ పాయింట్లు) ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. న్యూజిలాండ్ (118)ను వెనక్కి నెట్టింది. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ముందు ర్యాంకింగ్స్‌లో భారత జట్టు రెండో స్థానంలో ఉంది.
చెన్నైలో పుంజుకున్న తీరు నాకు అత్యంత సంతృప్తినిచ్చింది. తొలి టెస్టులో ఇంగ్లాండ్ మాపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టాస్ కీలక పాత్ర పోషించింది. బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. రెండో టెస్టులో మేం మరింత తీవ్రతతో బౌలింగ్, ఫీల్డింగ్ చేశాం. అందుకే పుంజుకున్న తీరు చాలా సంతోషాన్నిచ్చింది. మా రిజర్వ్ విభాగం చాలా బలంగా ఉంది. భారత క్రికెట్‌కు అది శుభసూచకం. సంధికాలంలో జట్టు ప్రమాణాలు పడిపోవు. ఆఖరి టెస్టులో కీలక సమయంలో రిషబ్, వాషింగ్టన్ నెలకొల్పిన భాగస్వామ్యం సరిగ్గా అదే చెబుతోంది.
- విరాట్ కోహ్లి
‘‘మేం ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించాం. అది చాలా ముఖ్యం. సిరీస్‌లో క్లిష్టమైన పరిస్థితి ఎదురైన ప్రతీసారీ ఎవరో ఒకరు దృఢ సంకల్పంతో నిలిచారు’’
- అశ్విన్
‘‘తొలి టెస్టు బాగా ఆడాం. చివరి మూడు టెస్టుల్లో మాత్రం భారత్‌తో సరితూగలేకపోయాం. అవకాశాలను భారత్ సద్వినియోగం చేసుకుంది. మేం చేసుకోలేకపోయాం. మేం మంచి స్థితిలో ఉన్న సమయంలో వాషింగ్టన్, పంత్ చాలా బాగా ఆడారు. మేం చాలినన్ని పరుగులు చేయలేదు. మాపై భారత్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. సిరీస్ ఫలితం నిరాశ కలిగిస్తోంది’’
- జో రూట్
‘గత మూడు నాలుగు నెలల్లో పంత్ ఎంతో శ్రమించాడు. ఫలితాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం పంత్ గొప్పగా బ్యాటింగ్ చేశాడు. నేను చూసినంత వరకు భారత్‌లో ఓ భారత బ్యాట్స్‌మెన్ ఆడిన అత్యుత్తమ ఎటాకింగ్ ఇన్నింగ్స్ ఇదే. ముఖ్యంగా బంతి తిరుగుతున్నప్పుడు ఆరో స్థానంలో. మేం అతడి పట్ల కఠినంగా వ్యవహరించాం. ఆటను ఇంకాస్త గౌరవించాలని చెప్పాం. బరువు తగ్గాలని, కీపింగ్‌పై బాగా శ్రమించాలని చెప్పాం. పంత్ ఎంత ప్రతిభావంతుడో మనకు తెలుసు’’
- రవిశాస్త్రి
1 తొలి టెస్టులో ఓడిన తర్వాత ఓ సిరీస్‌ను 3-1తో సొంతం చేసుకోవడం టీమ్ ఇండియాకిదే తొలిసారి.
4 ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ నాలుగు సార్లు 150 కంటే తక్కువకే ఆలౌటైంది. చివరగా 1909లో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ఆ జట్టుకు ఈ అనుభవం ఎదురైంది.
27 సిరీస్‌లో అక్షర్ వికెట్లు. ఆడిన తొలి టెస్టు సిరీస్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో అతను అగ్రస్థానంలో ఉన్న దిలీప్ దోషి (1979లో ఆస్ట్రేలియాపై) సరసన చేరాడు.8 టెస్టుల్లో ఎనిమిదో సారి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన అశ్విన్.. అత్యధిక సార్లు ఆ అవార్డు అందుకున్న బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. మురళీధరన్ (11), కలిస్ (9) మాత్రమే అతనికంటే ముందున్నారు.
1 ప్రపంచంలో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 30 వికెట్లు పడగొట్టడంతో పాటు శతకం చేసిన తొలి ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. ఓ టెస్టు సిరీస్‌లో 30 లేదా అంతకంటే ఎక్కువ వికెట్ల ఘనతను రెండు సార్లు సాధించిన తొలి భారత బౌలర్ అతనే.
6- చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో చెరో అయిదు వికెట్లు పడగొట్టిన అశ్విన్, అక్షర్ ఆ ఘనత సాధించిన భారత ఆరో జంటగా నిలిచింది. 1981 తర్వాత భారత బౌలర్లు ఇలా ఒకే ఇన్నింగ్స్‌లో చెరో అయిదు వికెట్లు పడగొట్టడడం ఇదే తొలిసారి.