ముంబయి/దిల్లీ: ఆస్ట్రేలియాపై గొప్పగా ఆడి సిరీస్‌ను నిలబెట్టుకున్న భారత క్రికెట్ జట్టు సొంతగడ్డపై అడుగుపెట్టింది. గురువారం స్వదేశానికి వచ్చిన టీమ్‌ఇండియాకు అదిరే స్వాగతం లభించింది. ‘ఆలారే ఆలా అజింక్య ఆలా’ నినాదాలతో తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె, కోచ్ రవిశాస్త్రితో పాటు ఇతర జట్టు సభ్యులకు అభిమానులు ఎర్రరంగు తివాచీతో గొప్ప స్వాగతాన్ని పలికారు. డోలు, మేళాలు వాయిస్తూ.. గులాబి రేకులు చల్లుతూ మన రహానె వచ్చాడంటూ అభిమానులు సందడి చేశారు. రహానె, శాస్త్రితో పాటు స్టార్ ఓపెనర్ రోహిత్‌శర్మ ముంబయిలో దిగగా.. బ్రిస్బేన్ టెస్టు హీరో రిషబ్ పంత్, ఓపెనర్ పృథ్వీషా, శార్దూల్ ఠాకూర్ రాజధాని దిల్లీ చేరుకున్నారు. మతుంగలోని రహానె ఇంటి దగ్గర కూడా అభిమానులు డోలు వాయిస్తూ, ఈలలు వేస్తూ అతనికి ఘన స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా వారితో కలిశారు. భార్య, రెండేళ్ల చిన్నారి సహా వచ్చిన అజింక్య అభివాదం చేస్తూ ముందుకు సాగాడు. మరోవైపు ఆస్ట్రేలియా పర్యటనలో అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేయడమే కాకుండా అంచనాలను మించి రాణించిన తమిళనాడు పేసర్ నటరాజన్‌కు అతని స్వస్థలం చిన్నప్పంపట్టిలో అభిమానులు నీరాజనాలు పలికారు. రథంపై ఊరేగిస్తూ సంబరాలు చేసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో మహ్మద్ సిరాజ్‌కు ఘనస్వాగతం లభించింది.