ఇంటర్నెట్‌డెస్క్: సిడ్నీలో క్వారంటైన్ నిబంధనలు పాటిస్తూ ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనకు టీమిండియా సన్నద్ధమవుతుంది. దీనిలో భాగంగా భారత ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోయి ఆదివారం ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. సీకే నాయుడు ఎలెవన్ జట్టుకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహించగా రంజిత్‌సింగ్‌జీ ఎలెవన్ జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ విషయాన్ని ‘ఇండియన్ క్రికెట్ టీమ్’ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తెలిపింది. ప్రాక్టీస్ మ్యాచ్‌కు సంబంధించిన ఫొటోలను స్టోరీస్‌లో పోస్ట్ చేసింది.
కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన రాహుల్ సేన 40 ఓవర్లలో 235 పరుగులు చేసింది. శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్ ఓపెనర్లుగా వచ్చారు. అనంతరం బరిలోకి దిగిన సీకే నాయుడు జట్టు 35.4 ఓవర్లలోనే అయిదు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కోహ్లీసేన తరఫున ఓపెనర్లుగా పృథ్వీ షా, శుభ్‌మన్ గిల్ దిగారు. అయితే ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్లు చెలరేగారు. కేఎల్ రాహుల్ 66 బంతుల్లో 83 పరుగులు చేయగా, కోహ్లీ 58 బంతుల్లోనే 91 పరుగులు బాదాడు. నవంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. సిడ్నీ వేదికగా తొలి వన్డే జరగనుంది.