సరదాగా గడుపుతున్న టీమ్‌ఇండియా క్రికెటర్లు
(Photo: Dhawan Twitter)
ఇంటర్నెట్‌డెస్క్: జీవితంలో ఎంత పెద్దవాళ్లమైనా అప్పుడప్పుడూ అందరిలోనూ చిన్నపిల్లల మనస్తత్వాలు బయటపడుతుంటాయి. ప్రతి ఒక్కరూ జీవితంలోని బాల్యంలో తోటి పిల్లలతో చేసిన అల్లరి, వారితో కలిసి ఆడుకున్న జ్ఞాపకాలు, పోట్లాడిన సందర్భాలు గుర్తు చేసుకొంటుంటారు. కానీ, టీమ్‌ఇండియా ఆటగాళ్లు అలా కాదు. చిన్నపిల్లల్లా మారి ఏది చేయాలనిపిస్తే అది చేశారు. తోటి క్రికెటర్లతో చిన్నపిల్లలా సరదాగా గడిపారు.
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ విజయం సాధించిన టీమ్‌ఇండియా ఇప్పుడు దొరికిన విరామ సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోంది. ఈ శుక్రవారం నుంచి మొతేరాలోనే జరిగే ఐదు టీ20ల సిరీస్ నేపథ్యంలో ఆటగాళ్లంతా అహ్మదాబాద్‌లోని హోటల్లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అక్కడున్న కిడ్స్ ప్లే జోన్‌లో సరదాగా గడిపారు. రోహిత్ శర్మ, రిషభ్ పంత్, కుల్‌దీప్ యాదవ్, శిఖర్‌ధావన్ చిన్నపిల్లల్లా ఎంజాయ్ చేశారు. ధావన్ ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా అందులో.. అతడితో పాటు కుల్‌దీప్ చిన్నపిల్లాడిలా సైకిల్ తొక్కుతూ కనిపించాడు. మరోవైపు పంత్, హిట్‌మ్యాన్ ప్లాస్టిక్ బంతులతో కొట్లాడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారడంతో అభిమానులు కూడా తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు.