ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్-గావస్కర్ ట్రోఫీని భారత్ 2-1 తేడాతో సాధించింది. గబ్బా టెస్టులో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాను మట్టికరిపించి చారిత్రక విజయం అందుకుంది. అయితే తొలి టెస్టులో ఓటమిపాలైన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలి జీర్ణించుకోలేని రికార్డును నమోదు చేసింది. దానికి తోడు కెప్టెన్ విరాట్ కోహ్లీ పితృత్వ సెలవులపై స్వదేశానికి వెళ్లాడు. దీంతో ఆసీస్ మాజీ క్రికెటర్లు సిరీస్‌లో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూస్తుందని మొదటి టెస్టు అనంతరం జోస్యం చెప్పారు.
‘విరాట్ కోహ్లీ లేకపోతే భారత్‌కు కష్టమే. 4-0తో ఆస్ట్రేలియాదే సిరీస్’ అని రికీ పాంటింగ్, మార్క్ వా, బ్రాడ్ హాడిన్ పేర్కొన్నారు. మైకేల్ క్లార్క్ ఇంకాస్త తొందరపడి.. ‘కోహ్లీ లేకుండా టీమిండియా కంగారూల గడ్డపై గెలిస్తే ఏడాది పాటు సంబరాలు చేసుకోవచ్చు’ అని మితిమీరిన వ్యాఖ్యలు చేశాడు. వాళ్లకు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ కూడా వంతపాడాడు. కానీ అడిలైడ్ టెస్టు తర్వాత భారత్ దెబ్బతిన్న సింహంలా గర్జించింది. మెల్‌బోర్న్‌లో గెలిచించి.. అద్భుత పోరాటంతో సిడ్నీ టెస్టును డ్రాగా ముగించింది. ఇక నిర్ణయాత్మక ఆఖరి టెస్టులో పూర్తి ఆధిపత్యం చెలాయించి సిరీస్ కైవసం చేసుకుంది.
అయితే భారత్‌ను తక్కువగా అంచనా వేసిన ఆసీస్ మాజీలపై ప్రస్తుతం నెట్టింట్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాళ్లపై మీమ్స్ పోటెత్తున్నాయి. వాళ్లు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేయడంతో పాటు చురకలంటించేలా చేసిన పోస్ట్‌లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆసీస్ మాజీలకు టీమిండియా తగిన గుణపాఠం చెప్పిందని పలువురు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, సీనియర్ స్పిన్నర్ అశ్విన్ కూడా ఆసీస్‌ను ట్రోల్ చేస్తూ పోస్ట్‌లు పెట్టారు. మాజీ క్రికెటర్లు చేసిన కామెంట్లు ఇప్పుడు చదువుతుంటే ఎంతో ఆనందంగా ఉందని శశిథరూర్ అన్నారు. క్లార్క్ చెప్పిన్నట్లు ఈ విజయాన్ని ఏడాది పాటు సంబరాలు చేసుకోవాలని ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి
ఆసీస్ పొగరుకు, గర్వానికి ఓటమిది