సోమవారం, జులై 13, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ఛేదన రారాజుకు జయం.. జోగి మాయ

టీమ్‌ఇండియా టీ20 మధుర స్మృతులు

(ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం)

టీ20 క్రికెట్‌ ప్రపంచకప్‌. అరంగేట్రంతోనే అభిమానులను ఓలలాడించిన మెగాటోర్నీ. ఇప్పటి వరకు పొట్టి క్రికెట్‌ ఎన్నో రసవత్తర పోరాటాలకు ఆలవాలంగా నిలిచింది. మేటి జట్లకు షాకులిచ్చిన పసికూనలు. ఆఖరి బంతికి సిక్సర్లతో సాధించిన విజయాలు. మ్యాచుల్ని మలుపు తిప్పిన మెరుపు క్యాచులు. ఇలా ఎన్నెన్నో మధుర స్మృతులు అభిమానులకు అందించింది. ఈ ఏడాది విశ్వసమరంపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది. అప్పటిలోగా అరుదైన పోరాటాలను గుర్తుచేసుకుందాం!!


మాయా..మాయా.. జోగి మాయా

భారత్‌×పాక్‌; 2007 ప్రపంచకప్‌ ఫైనల్‌: అరంగేట్రం ప్రపంచకప్‌లో అంచనాల్లేకుండా సంచనాలు సృష్టించింది టీమ్‌ఇండియా. అప్పటి యువీ విధ్వంసాలు, గంభీర్‌ పోరాటాలు, మహీ సారథ్యం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. లీగ్‌దశలోనే దాయాది పాక్‌పై సూపర్‌ ఓవర్‌లో గెలిచి అభిమానులకు ధోనీసేన ఆనందం పంచింది. ట్రోఫీ కోసం జరిగిన ఆఖరి సమరం సైతం అదే స్థాయిలో ఉత్కంఠ రేపింది. గంభీర్‌ (75), రోహిత్‌ (30) పోరాటంతో టీమ్‌ఇండియా 157 పరుగులు చేసింది. ఛేదనలో రాబిన్‌ ఉతప్ప చేతిలో రనౌట్‌కు ముందే ఇమ్రాన్‌ నజీర్‌ (33; 14 బంతుల్లో) దుమ్మురేపాడు. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసినా మిస్బా ఉల్‌ హఖ్‌ (43) నిలవడంతో విజయం రెండు జట్లను దోబూచులాడింది. జోగిందర్‌ శర్మ వేసిన ఆఖరి ఓవర్‌ రెండో బంతికి మిస్బా సిక్సర్‌ బాదడంతో సమీకరణం 4 బంతుల్లో 6గా మారింది. మూడో బంతిని స్కూప్‌ చేయబోయిన అతడు షార్ట్‌ ఫైన్‌లెగ్‌లో శ్రీశాంత్‌కు చిక్కడంతో పాక్‌ 152కు ఆలౌటైంది. ధోనీసేన ప్రపంచకప్‌ ముద్దాడింది.


చేటు చేసిన ముందస్తు సంబరాలు

భారత్‌×బంగ్లాదేశ్‌, 2016 ప్రపంచకప్‌ లీగ్‌: భారత్‌ ఆతిథ్యమిచ్చిన టీ20 ప్రపంచకప్‌-2016ను అంత సులభంగా మర్చిపోలేరు. అందులోనూ బంగ్లాదేశ్‌ ముందుగా సంబరాలు చేసుకొని విజయం వద్ద బోల్తా పడ్డ సన్నివేశాలను అస్సలు మర్చిపోలేం. ఏ దశలో చూసినా ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియాపై గెలుపు అంచనాల్లేవు. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో టీమ్‌ఇండియా 146/7తో నిలిచింది. రైనా (30), కోహ్లీ (24), ధావన్‌ (23) ఫర్వాలేదనిపించారు. ఛేదనలోనే అసలు మజా వచ్చింది. ఆఖరి ఓవర్లో భారత్‌ 10 పరుగుల్ని కాపాడుకోవాలి. ధోనీ, రోహిత్‌ చర్చించి బంతి హార్దిక్‌ పాండ్యకు ఇచ్చారు. ముష్ఫికర్‌ రహీమ్‌ (11) వరుసగా రెండు బౌండరీలు బాదడంతో బంగ్లా ఆటగాళ్లు ముందుగానే సంబరాలు చేసుకున్నారు. ఇంకో పరుగు చేస్తే డ్రా. కానీ పాండ్య అద్భుతం చేశాడు. నాలుగో బంతికి రహీమ్‌, ఐదో బంతికి మహ్మదుల్లాను పెవిలియన్‌ పంపించాడు. ఆఖరి బంతికి ఉత్కంఠ ఆకాశాన్నంటింది. ధోనీ చాకచక్యంతో ముస్తాఫిజుర్‌ను రనౌట్‌ చేయడంతో పరుగు తేడాతో విజయం భారత్‌ వశమైంది.


ఛేదన రారాజుకు ప్రపంచం వందనం

భారత్‌×ఆస్ట్రేలియా; 2016 ప్రపంచకప్‌ లీగ్‌: దాదాపుగా క్వార్టర్‌ ఫైనల్‌ తరహా మ్యాచ్‌ ఇది. గెలవకపోతే టీమ్‌ఇండియా సెమీస్‌కు అర్హత సాధించదు. ఖవాజా (26; 16 బంతుల్లో), ఫించ్‌ (43; 34 బంతుల్లో), మాక్స్‌వెల్‌ (31; 28 బంతుల్లో) రాణించడంతో ఆసీస్‌ 160/6 పరుగులు చేసింది. మొహాలి పిచ్‌ స్పిన్‌, ఊహించని బౌన్స్‌కు అనుకూలించడంతో టీమ్‌ఇండియా ఛేదన అత్యంత కష్టంగా మారింది. గెలుపు అసాధ్యమేమో అనిపించింది. కానీ ‘ఛేదన రారాజు’ విరాట్‌ కోహ్లీ (82*; 51 బంతుల్లో) అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. అతడిలోని నిఖార్సైన అథ్లెట్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు. మొహాలి వేడిలో వికెట్ల మధ్య ఏడుసార్లు డబుల్స్‌ తీశాడు. అదీ అత్యంత వేగంగా. కానీ విజయం కోసం 18 బంతుల్లో 39 పరుగులు చేయాల్సి వచ్చింది. అప్పుడే కోహ్లీ 4, 4, 6, బాది ఫాల్క్‌నర్‌ వేసిన 18వ ఓవర్లో ధోనీ సాయంతో 19 పరుగులు సాధించాడు. సమీకరణం 12 బంతుల్లో 20గా మారింది. కౌల్టర్‌నైల్‌ వేసిన 19వ ఓవర్లో విరాట్‌ మరింత చెలరేగి 0, 4, 4, 4, 0, 4 భారత్‌కు విజయం ఖరారు చేశాడు. ధోనీ ఎప్పటిలాగే ఆఖర్లో ఓ బౌండరీ బాదడంతో ఐదు బంతులు మిగిలుండగానే జట్టు గెలుపు జెండా ఎగరేసింది.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని