దిల్లీ: మెల్‌బోర్న్ టెస్టులో శతకం తనకెంతో ప్రత్యేకమైందని, సిరీస్ విజయానికి అది బాటలు వేసిందని అజింక్య రహానె అన్నాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో ఘోరపరాభవం తర్వాత పగ్గాలు అందుకున్న అజింక్య.. మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ‘‘నా సొంత ఘనతలకంటే మ్యాచ్, సిరీస్ గెలవడానికే నా ప్రాధాన్యత. కానీ మెల్‌బోర్న్‌లో శతకం నాకెంతో ప్రత్యేకమైంది. లార్డ్స్ శతకమే నాకు ప్రత్యేకమైందని మెల్‌బోర్న్‌లో చెప్పాను. కానీ నా లార్డ్స్ సెంచరీ కంటే మెల్‌బోర్న్ సెంచరీ (112)నే మెరుగైందని చాలా మంది నాతో చెప్పారు. అందుకు ఎలా స్పందించాలో నాకర్థం కాలేదు. కానీ అడిలైడ్ టెస్టు తర్వాత పరిస్థితులను దృష్టిలోపెట్టుకుని చూస్తే మెల్‌బోర్న్ టెస్టు సిరీస్‌కు ఎంతో కీలకమైంది. అక్కడ సెంచరీనే ప్రత్యేకమైందని నాకిప్పుడు అనిపిస్తోంది’’ అని రహానె చెప్పాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36కే కుప్పకూలిన టీమ్ ఇండియా.. ఆ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. కానీ కెప్టెన్ కోహ్లీ, పేసర్ షమి లేకపోయినా తాత్కాలిక కెప్టెన్ రహానె సారథ్యంలో భారత్.. రెండో టెస్టులో బలంగా పుంజుకుని 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇవీ చదవండి..