తండ్రి మరణంపై కృనాల్ భావోద్వేగ పోస్టు..
(Krunal Pandya Twitter Photo)
ఇంటర్నెట్‌డెస్క్: తన తండ్రి మరణం పట్ల కృనాల్ పాండ్య ఇన్‌స్టాలో ఓ భావోద్వేగ పోస్టు పెట్టాడు. తమ సోదరుల ఎదుగుదలకు ఎంతో కృషి చేశారని.. తన తండ్రి గురించి చెప్పడానికి 100 పుస్తకాలు కూడా చాలవని అన్నాడు. పాండ్య సోదరుల తండ్రి హిమాన్షు పాండ్య ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే.
‘నాన్నా నీ గురించి నా భావాలు వ్యక్తపర్చడానికి 100 పుస్తకాలూ చాలవు. నీ వల్లే మేం ఇక్కడి వరకూ వచ్చాం. నీ వల్లే నేను ఇంతటివాడినయ్యా. మీరు లేరనే విషయాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. మాకెన్నో మధుర జ్ఞాపకాలు వదిలి వెళ్లారు. మిమ్మల్ని గుర్తుచేసుకున్నప్పుడు నేను చిరునవ్వులు మాత్రమే చిందించగలను. మేము ఈ స్థాయిలో రాణించడానికి మీరు కూడా మా అంతే కష్టపడ్డారు. మాపై మీరు పెట్టుకున్న నమ్మకం మాలో ఆత్మవిశ్వాసం నింపింది. మీతో సరదాగా గొడవ పడిన సంఘటనలు, మిమ్మల్ని విసిగించిన సందర్భాలు, మీతో కలిసి నవ్వుకున్న జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి’ అని కృనాల్ పేర్కొన్నాడు.
‘నేను సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీకి వెళ్లేముందు మీతో ఫొటో తీసుకోవాలని చెప్పారు. అదే మన ఆఖరి ఫొటో అవుతుందని నాకు తెలియదు. మీరు లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నా. మీ స్థానాన్ని ఎలా భర్తీ చేయాలో అర్థంకావడం లేదు. కానీ, మీ జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది. ఎందుకంటే మీరు జీవితం మొత్తాన్ని ఆస్వాదించారు. మీరెప్పుడూ నా గుండెల్లోనే ఉంటారు. మీరు లేకుండా.. మేమూ, మన ఇల్లు ఇంతకుముందులా ఉండదు. మీరు ఉన్నప్పుడు మమ్మల్ని ఎలా చూసుకున్నారో.. పైనుంచి కూడా అలాగే చూస్తారని తెలుసు. జీవితం గురించి అనేక విషయాలు నేర్పినందుకు ధన్యవాదాలు. మీరు గర్వపడేలా మేముంటాము. నాకెంతో ఇష్టమైన వ్యక్తి మీరు. మిమ్మల్ని మిస్ అవుతున్నా. చివరగా మీరే నా రాక్‌స్టార్, అన్నింటికీ మించి గొప్ప గురువు’ అని పేర్కొని తన తండ్రితో ఉన్న ఫొటోలను వీడియో రూపంలో పంచుకున్నాడు.
ఇవీ చదవండి..
స్మిత్ చూస్తుండగానే రోహిత్ షాడో బ్యాటింగ్
సిరాజ్.. ఇక కుర్రాడు కాదు