ఆసీస్‌తో టెస్ట్ సిరీస్ విజయంపై మోహన్ విశ్లేషణ
ఇంటర్నెట్ డెస్క్: స్టార్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లేకపోవడం.. కొత్త ఓపెనింగ్ భాగస్వామ్యం.. మొదటి టెస్టులో ఘోర పరాజయం.. తర్వాత సారథి విరాట్ కోహ్లీకి పితృత్వపు సెలవులు.. ఇదీ రెండో టెస్ట్‌కు ముందు టీమిండియా పరిస్థితి. తాత్కాలిక కెప్టెన్ అజింక్యా రహానె తెలివైన సారథ్యంలో రెండో టెస్ట్‌ను గెలుచుకుంది. తెలుగు కుర్రాడు హనుమ విహారి, అశ్విన్ అద్భుతమైన పోరాటంతో మూడో టెస్ట్‌ను భారత్ డ్రాగా ముగించింది. నిర్ణయాత్మకమైన నాలుగో టెస్ట్ ప్రారంభానికి ముందే టీమిండియాకు గాయాల దెబ్బ తగిలింది. కీలకమైన బుమ్రా, అశ్విన్, విహారి, జడేజా గాయపడ్డారు. దీంతో నాలుగో టెస్టులో తుది జట్టు కూర్పుపైనే సందిగ్ధత నెలకొంది. మ్యాచ్ ఆరంభమవ్వడానికి కొద్దిసేపు ముందు మాత్రమే పదకొండు మంది పేర్లను ప్రకటించడం గమనార్హం. శుభ్‌మన్‌గిల్, సిరాజ్, నటరాజన్, సైని, వాషింగ్టన్ సుందర్ ఇదే సిరీస్‌లో అరంగేట్రం చేయడం విశేషం.
భీకరమైన ఆసీస్ బౌలింగ్‌ను రహానె నాయకత్వంలో గిల్, పంత్, పుజారా, రోహిత్ అద్భుతంగా అడ్డుకుని విజయాన్ని సొంతం చేసుకున్నారు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల బోర్డర్-గావస్కర్ సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. రిషబ్ పంత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఆసీస్ బౌలర్ కమిన్స్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కాయి. టీమిండియా విజయంపై ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు మోహన్ ఆనందం వ్యక్తం చేశారు. భారత ఆటగాళ్లు రాణించిన తీరుపై మోహన్ ఈనాడు-ఈటీవీకి వివరించారు. ఆయన ఏమంటున్నారో మీ కోసం..
‘‘తొలి టెస్ట్ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలో ఘోర ఓటమి చవి చూశాం. రెండో టెస్ట్ నుంచి జట్టుకు నేతృత్వం వహించిన అజింక్యా రహానె కూల్ కెప్టెన్. అలాగే యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. రోహిత్ శర్మ వచ్చిన తర్వాత సీనియర్ ఆటగాడు ఉండటం జట్టులో ఆత్మవిశ్వాసం పెంచింది. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఏడో వికెట్‌కు వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ రికార్డు స్థాయిలో 123 పరుగులు జోడించారు. హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఐదు వికెట్ల ప్రదర్శన అద్భుతం. భారత్‌కు కీలక బౌలర్‌గా సిరాజ్ ఎదిగాడు. శార్దూల్ ఠాకూర్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ప్రధాన పాత్ర పోషించాడు. ఆసీస్ గడ్డపై ఈ సిరీస్‌ను కైవసం చేసుకోవడమే అతిపెద్ద గొప్పతనం. ఒకే సిరీస్‌లో ఐదుగురు ఆటగాళ్లు అరంగేట్రం చేయడం.. వారంతా రాణించడం అద్భుతం. కఠినమైన ఆస్ట్రేలియా బౌలింగ్‌ను భారత యువ బ్యాట్స్‌మెన్ ఎదుర్కొని పరుగులు చేయడమంటే సాధారణ విషయం కాదు’’ అని మోహన్ అభిప్రాయపడ్డారు.
విరాట్ కోహ్లీ గైర్హాజరీలో రహానె జట్టును అద్భుతంగా నడిపించాడని మోహన్ కొనియాడారు. అలాగే భారత ఆటగాళ్లపై జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ ఇటు బౌలింగ్‌తోపాటు బ్యాటింగూ బాగుందని, అది భారత్‌కు అడ్వాంటేజీగా మారిందని అభిప్రాయపడ్డారు. విదేశీ గడ్డపై రాణిస్తే క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. ఈ విజయంతో టెస్టు ర్యాంకింగ్‌లోనూ భారత్ ముందుకు దూసుకెళ్లినట్లు క్రికెట్ విశ్లేషకుడు మోహన్ వివరించారు.
ఇదీ చదవండి..
* భారత్ vs ఆస్ట్రేలియా: కొత్త రికార్డులు
* ధోనీని అధిగమించి పంత్ కొత్త రికార్డు..