ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియా పర్యటన ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చిందని టీమిండియా వైస్‌కెప్టెన్ అజింక్య రహానె అన్నాడు. చివరి మూడు టెస్టుల్లో ఆఖరి వరకు జట్టుగా పోరాడాలనుకున్నామని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ‘‘అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బాగానే ఆడాం. కానీ ఒక గంట పేలవమైన ఆటతో మ్యాచ్ మారిపోయింది. ఆ తర్వాత ఆ ఓటమి గురించి చర్చించుకోలేదు. మిగిలిన మ్యాచ్‌ల్లో ఆఖరి నిమిషం వరకు పోరాడాలని నిర్ణయించుకున్నాం’’ అని అన్నాడు.
నాలుగు టెస్టుల్లో చోటు దక్కని స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ గురించి జింక్స్ మాట్లాడుతూ..‘‘కుల్‌దీప్ యాదవ్ ఎంతో ప్రతిభావంతుడు. కానీ అతడికి అవకాశం రాలేదు. ఆటగాళ్ల గాయాలు, జట్టు కూర్పు ఆలోచనలతో చోటు దక్కలేదు. జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. గతంలో అనుభవించా కూడా. అయితే కుల్‌దీప్ మ్యాచ్ విన్నర్. మా ఆటగాళ్లందరికీ జట్టును గెలిపించే సామర్థ్యం ఉంది. వాళ్లకి మద్దతు అవసరం’’ అని అన్నాడు. కోహ్లీ గైర్హాజరీలో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న రహానె ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను 2-1తో సాధించిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి