బ్రిస్బేన్: గాయపడ్డ టీమ్‌ఇండియాపై సిరీసు డ్రా చేసుకోవడం గత సిరీసు ఓటమి కన్నా ఘోరమని ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాటింగ్ అంటున్నాడు. సమయం తక్కువగా ఉండటంతో ఆఖరి టెస్టులో విజయం, డ్రాలో రహానె సేన దేనికోసం ప్రయత్నిస్తుందో చూడాల్సి ఉందన్నాడు. మంగళవారం ఆట తొలి గంటలో ఎవరి పరిస్థితి ఏంటో తేలిపోతుందని పేర్కొన్నాడు.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ప్రస్తుతం రెండు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. నాలుగో టెస్టులో ఆఖరి రోజైన మంగళవారం టీమ్‌ఇండియా విజయం కోసం 324 పరుగులు చేయాలి. డ్రా చేయాలనుకుంటే రోజంతా వికెట్లు కాచుకోవాలి. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, సీనియర్ ఆటగాళ్లు లేని టీమ్‌ఇండియా చేతిలో ఆసీస్ ఓటమి పాలవ్వొద్దని, మ్యాచులో గెలిచి తీరాలని పాంటింగ్ ఆసీస్‌కు సలహా ఇస్తున్నాడు.
‘ఈ సిరీసు డ్రా చేసుకోవడం రెండేళ్లనాటి ఓటమి కన్నా ఘోరం. నేనైతే ఇలాగే చూస్తాను. ఎందుకంటే ఈ సిరీసులో పోరాడేందుకు టీమ్‌ఇండియా 20 మందిని తీసుకుంది. ఆసీస్ జట్టులోకి వార్నర్ వచ్చాడు. స్మిత్ అన్ని టెస్టులూ ఆడాడు. క్రితంసారి వారు లేరు. అందుకే డ్రా చేసుకోవడం ఓటమి కన్నా ఘోరమని నా అభిప్రాయం’ అని పాంటింగ్ అన్నాడు.
టీమ్‌ఇండియా గొప్ప పట్టుదల, పోరాటం ఏదో ఒక దశలో ఆగాల్సిందేనని రికీ అంటున్నాడు. ‘వారు చేస్తున్న పోరాటం ఎక్కడో ఓ చోట ఆగాల్సిందే. బహుశా రేపే ఆ రోజు కావొచ్చు. సిరీస్‌లో చివరి రోజు కాబట్టి భారత్ బహుశా డ్రా కోసం ప్రయత్నించొచ్చు. ఎవరో ఒకరు వదిలేయాల్సిందేనన్నది నా అభిప్రాయం. విజయం కోసం ఆసీస్ శతవిధాలా పోరాడుతుందని తెలుసు. మంగళవారం తొలి గంట అత్యంత కీలకం. వికెట్లు పోకుంటే మాత్రం టీమ్‌ఇండియా వేగంగా పరుగులు చేయాలి. కానీ సిరీసులో ఇంత వేగంతో వారెప్పుడూ పరుగులు చేయలేదు. ఓపెనర్లు రోహిత్, గిల్ వేగంగా పరుగులు చేస్తే పంత్‌ను మళ్లీ ముందుగా పంపించొచ్చు. అప్పుడు విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. లేదంటే 98 ఓవర్లు డిఫెండ్ చేయాలి’ పాంటింగ్ అన్నాడు.
ఇవీ చదవండి
సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
తలకు కుట్లు పడ్డా.. బ్యాటింగ్ చేసిన సుందర్