ఇంటర్నెట్‌డెస్క్: ఐపీఎల్‌లో గొప్ప ప్రదర్శన చేసినా ముంబయి బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడంపై చర్చలు జోరుగా సాగిన సంగతి తెలిసిందే. సెలక్టర్లపై విమర్శలు వెల్లువెత్తాయి. టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి సైతం సూర్య ఓపికతో ఉండాలని, తప్పక అవకాశం వస్తుందని ట్వీట్ చేశాడు. అయితే ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనకు ఎంపిక కాకపోవడంపై భావోద్వేగానికి గురైనట్టు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్యకుమార్ పేర్కొన్నాడు. భారత జట్టును ప్రకటించిన రోజు బాధతో గదిలో కూర్చున్నాని, రోహిత్ శర్మ సాయంతో ఆటపై తిరిగి దృష్టిసారించానని తెలిపాడు.
‘‘జిమ్‌లో రోహిత్ పక్కన కూర్చుని నన్ను చూస్తున్నాడు. ఎంపికపై శుభవార్త ఆశించానని అతడికి తెలుసు. ‘నేను ఎంతో నిరాశకు గురయ్యా’ అని అతడితో చెప్పాను. తర్వాత రోహిత్ మాట్లాడాడు. ‘ఎంపిక కాకపోవడం గురించి ఆలోచించకుండా జట్టు కోసం నువ్వు గొప్పగా పోరాడతావని నమ్ముతున్నా. ఐపీఎల్‌లో తొలి రోజు నుంచి ఎలా ఆడతున్నావో అలానే ప్రయత్నించు. సరైన సమయంలో నీకు కచ్చితంగా అవకాశం వస్తుంది. అది ఈ రోజు లేదా రేపు కావొచ్చు. ఆత్మవిశ్వాసంతో ఆటను కొనసాగించు’ అని రోహిత్ అన్నాడు. ఆ క్షణంలో అతడి మాటలు నాకు ఎంతో దోహదం చేశాయి. జట్టు ఎంపిక ఆలోచన నుంచి బయటికి వచ్చేలా చేశాయి. నా కళ్లలోని బాధను అతడు స్పష్టంగా చూశాడు’’ అని సూర్యకుమార్ తెలిపాడు.
‘‘అయితే జట్టును ప్రకటిస్తారని తెలియడంతో ఆ రోజు బిజీగా ఉండటానికి ప్రయత్నించా. ఎంపిక చేసిన జట్టును రాత్రి వెల్లడిస్తారనే ఆలోచనను నాలో నుంచి తొలగించడానికి సముదాయించుకున్నా. నా పనులపై దృష్టి సారించా. జిమ్‌లో ఉండటం, జట్టు సభ్యులతో గడపటం చేశా. కానీ నా మదిలో అదే ఆలోచన. కాగా, ఆస్ట్రేలియా పర్యటనకు జట్టును ప్రకటించారు. తర్వాత గదిలోకి వెళ్లి కూర్చున్నా. ఆలోచించడం ప్రారంభించా. జట్టులో నా పేరు ఎందుకు లేదు? అయితే ఎంపికైన ఆటగాళ్లు ఐపీఎల్, భారత్ తరఫున రాణిస్తున్నవారే. దీంతో ఆటపై దృష్టిసారిస్తూ మరిన్ని పరుగులు సాధిస్తూ జట్టులో చోటు కోసం ప్రయత్నించాలని నిర్ణయించుకున్నా. మంచి ప్రదర్శనలు చేస్తూ అవకాశం కోసం ఎదురుచూడాలని భావించా’’ అని సూర్యకుమార్ వెల్లడించాడు. కాగా, యూఏఈ వేదికగా జరిగిన లీగ్ పదమూడో సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన సూర్య 40 సగటుతో 480 పరుగులు చేశాడు. ముంబయి అయిదో సారి టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.