కెప్టెన్ లేకపోవడం టీమ్‌ఇండియాకు లోటు: ఛాపెల్
ఇంటర్నెట్‌డెస్క్: త్వరలో ఆస్ట్రేలియాతో ఆడబోయే టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ తర్వాత టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడకపోవడం ఆ జట్టుకు పూడ్చలేని లోటని దిగ్గజ క్రికెటర్ ఇయాన్ ఛాపెల్ పేర్కొన్నాడు. తాజాగా ఛాపెల్ ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోకు రాసిన వ్యాసంలో ఈ విషయాన్ని వివరించాడు. డిసెంబర్ 17-21 వరకు తొలి టెస్టు అనంతరం కోహ్లీ పితృత్వపు సెలవుల మీద భారత్‌కు తిరిగి వస్తున్న సంగతి తెలిసిందే. అతడు లేకపోవడం టీమ్‌ఇండియా బ్యాటింగ్ లైనప్‌కు లోటని, అదే సమయంలో ఇతర యువ క్రికెటర్లు తమ ప్రతిభని నిరూపించుకునేందుకు సరైన అవకాశమని చెప్పాడు. అయితే, తుది జట్లలో ఎవరిని ఎంపిక ఎంపిక చేస్తారనే విషయంపైనే సిరీస్ ఆధారపడిందని పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియా ఓపెనింగ్ భాగస్వామ్యంలో డేవిడ్ వార్నర్‌కు జోడీగా విల్ పుకోవిస్కి సరైన ఆటగాడని, జో బర్న్స్ కాదని ఛాపెల్ అభిప్రాయపడ్డాడు. ఆ విషయంలో బర్స్న్‌కు మద్దతుగా నిలిచిన ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్‌తో విభేదించాడు. ప్రస్తుత ఫామ్‌ను బట్టే తుది జట్టును ఎంపిక చేయాలని సూచించాడు. అనంతరం టీమ్‌ఇండియా సాధనపై స్పందిస్తూ.. ప్రస్తుత కరోనా నిబంధనల నడుమ కోహ్లీసేనకు మంచి ప్రాక్టీస్ సమయం దొరికిందని, దాంతో ఆస్ట్రేలియా వాతావరణానికి వారు అలవాటు పడతారని పేర్కొన్నాడు. అలాగే భారత్‌లో లాక్‌డౌన్ సమయంలో ప్రాక్టీస్ చేసుకునేందుకు అవకాశం కల్పించడం కూడా ఆ జట్టుకు కలిసి వస్తుందని వివరించాడు. కాగా, భారత ఆటగాళ్లు ప్రస్తుతం సిడ్నీ క్రికెట్ మైదానం సమీపంలోనే క్వారంటైన్‌లో ఉన్నారు. అక్కడే సాధన చేస్తూ అక్కడి పరిస్థితులకు అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 27 నుంచి మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్నారు. ఆపై ప్రతిష్ఠాత్మకమైన టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.