ఇంటర్నెట్‌డెస్క్: మరో మూడు, నాలుగు రోజుల్లో రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ కంగారూల గడ్డకు చేరుకోవాలని, లేనిపక్షంలో వారిద్దరికీ ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో ఆడే అవకాశాలు కఠినంగా మారుతాయని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి అన్నాడు. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో గాయం నుంచి కోలుకుంటున్న రోహిత్, ఇషాంత్ శర్మ.. ఆస్ట్రేలియాకు ఎప్పుడు పయనమవుతారనే విషయం బీసీసీఐ ఇప్పటివరకు ప్రకటించలేదు. ఆస్ట్రేలియాలో 14 రోజుల క్వారంటైన్ నిబంధనలు తప్పనిసరి కావడంతో రోహిత్, ఇషాంత్ భారత్ నుంచి సోమవారానికి బయలుదేరకపోతే డిసెంబంర్ 6న జరిగే ఆస్ట్రేలియా-ఎ జట్టుతో తొలి వార్మప్ మ్యాచ్‌కు దూరమవుతారు. డిసెంబర్ 11న రెండో వార్మప్ మ్యాచ్ జరగనుంది.
‘‘రోహిత్ వైట్ బాల్ సిరీస్‌లకు లేడు. అతడు ఎంతసేపు విశ్రాంతి తీసుకోవాలనే విషయంపై ఆలోచిస్తున్నారు. టెస్టు సిరీస్‌కు ఆడాలనుకుంటే రోహిత్ మూడు నుంచి నాలుగు రోజుల్లో బయలుదేరాలి. లేనిపక్షంలో అవకాశాలు కఠినంగా మారుతాయి. అయితే ఆసీస్‌కు బయలుదేరడానికి ఎక్కువ సమయం తీసుకుంటే క్వారంటైన్ నిబంధనలతో తర్వాత సవాలుగా మారుతుంది. అప్పుడు టెస్టు సిరీస్‌కు ఆడే అవకాశాలు సంక్లిష్టం అవుతాయి. ఇషాంత్ శర్మకి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు అనంతరం విరాట్ కోహ్లీ పితృత్వ సెలవులపై స్వదేశానికి తిరిగి వెళ్లనుండటం గురించి రవిశాస్త్రి మాట్లాడాడు. ‘‘ కోహ్లీ సరైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. అలాంటి మధుర క్షణాలు మళ్లీమళ్లీ రావు. ఆ సమయంలో స్వదేశానికి చేరుకున్నందుకు అతడు ఎంతో సంతోషిస్తాడు. గత ఐదు, ఆరేళ్లలో జట్టును అతడు విజయపథంలో నడిపించాడు. కాబట్టి అతడి గైర్హాజరీ జట్టుకు లోటుగానే ఉంటుంది. అయితే అవకాశం కోసం ఎదురుచూస్తున్న యువకులు ఇది ఉపయోగపడుతుంది’’ అని రవిశాస్త్రి వెల్లడించాడు. నవంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది.