సిడ్నీ: ఆస్ట్రేలియాలో సత్తాచాటాలంటే గంటకు 140 కిమీ వేగంతో బంతులు సంధించే పేస్ అవసరమని ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి అన్నాడు. 2018-19 ప్రదర్శనను భారత బౌలర్లు పునరావృతం చేయొచ్చని తెలిపాడు. గత ఆసీస్ పర్యటనలో టీమ్‌ఇండియా 2-1తో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. భారత బౌలర్లు ఏకంగా 70 వికెట్లు పడగొట్టారు. పేసర్లు బుమ్రా (21 వికెట్లు), షమి (16), ఇషాంత్‌శర్మ (11) విజృంభించారు. ఈసారి స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ జట్టులో ఉండటంతో ఆసీస్ నుంచి గట్టి సవాల్ ఎదురవుతుందన్నది విశ్లేషకుల అంచనా. అయితే ఫాస్ట్ బౌలర్లు గత ప్రదర్శనను పునరావృతం చేస్తారని షమి ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.
‘‘టీమ్‌ఇండియా ఫాస్ట్ బౌలర్ల బృందం నిలకడగా గంటకు 140 కిమీ వేగంతో బంతులు సంధిస్తుంది. ఆసీస్‌లో సత్తాచాటాలంటే అలాంటి పేస్ అవసరం. రిజర్వ్ బెంచ్‌లో ఉన్నవాళ్లు కూడా ఫాస్ట్ బౌలర్లే. మాలాంటి బౌలింగ్ విభాగం మరెక్కడా లేదు. ఎలాంటి సవాల్‌నైనా అధిగమించగలం. మాకు అనుభవం ఉంది. మా స్పిన్ బౌలింగ్‌లో వైవిధ్యం ఉంది. వేగంగా బౌలింగ్ చేయగలం. కాని మేమంతా భిన్నమైన బౌలర్లం. నైపుణ్యాలు విభిన్నం. టీమ్‌ఇండియాలో నాణ్యమైన బ్యాట్స్‌మెన్ ఉన్నారు. వారికి నెట్స్‌లో బౌలింగ్ చేస్తాం. పేర్లను చూడం. నైపుణ్యాలపైనే దృష్టిసారిస్తాం. ఎంత ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మన్ అయినా ఒక్క మంచి బంతి ఔట్ చేస్తుంది. సమష్టితత్వమే టీమ్‌ఇండియా పేసర్ల విజయ రహస్యం. మ్యాచ్‌లో మా అందరి లక్ష్యం ఒక్కటే ఉంటుంది. అందరం కలిసే ఆ లక్ష్యాన్ని అందుకునేందుకు ప్రయత్నిస్తాం. మా మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉందే తప్ప వైరం లేదు. విదేశాల్లో దాదాపు ప్రతి మ్యాచ్‌లో 20 వికెట్లు పడగొట్టాం. సొంతగడ్డపై జరిగిన గులాబీ బంతి టెస్టులోనూ ఫాస్ట్ బౌలర్లు ప్రభావం చూపారు’’ అని షమి పేర్కొన్నాడు.