ఇంటర్నెట్‌డెస్క్: మరికొద్ది రోజుల్లో ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్‌శర్మ లేకపోయినా టీమ్‌ఇండియాకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉందని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ పేర్కొన్నాడు. తాజాగా అతడు ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోతో వీడియోచాట్‌లో మాట్లాడాడు. టీమ్‌ఇండియాలో హిట్‌మ్యాన్ కీలక ఆటగాడని, అతడు లేకపోవడం కోహ్లీసేనకు భారీ లోటని అన్నాడు. అయితే.. కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్ ఐపీఎల్‌లో రెచ్చిపోయారన్నాడు. దాంతో రోహిత్ స్థానాన్ని భర్తీ చేసే ప్రక్రియలో టీమ్‌ఇండియాలో మంచి నైపుణ్యం గల ఆటగాళ్లు ఉన్నారన్నాడు.
ఇక స్లెడ్జింగ్‌పై స్పందించిన వార్నర్ ఈసారి టీమ్‌ఇండియాతో తాను ఎలాంటి మాటల యుద్ధానికి దిగనని పేర్కొన్నాడు. తన అనుభవం రీత్యా బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఇదివరకు టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాలో పర్యటించిన సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్లు స్లెడ్జింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. ‘వ్యక్తిగతంగా ఈసారి నేను ఆటమీదే దృష్టిసారించాలని అనుకుంటున్నా. గతేడాది ఇంగ్లాండ్ నుంచి తిరిగొచ్చాక స్లెడ్జింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇక ఇప్పుడు కూడా అలాగే ఉండాలనుకుంటున్నాను’ అని వార్నర్ వివరించాడు. ఎలాగూ టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆఖరి మూడు టెస్టులు ఆడటం లేనందున తాము మంచి ప్రదర్శన చేయాలనుకుంటున్నట్లు వెల్లడించాడు.