సచిన్, కోహ్లీవి నమ్మశక్యం కాని గణాంకాలు..
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ రెండు దశాబ్దాల పాటు తన ఆటతో అలరించాడు. 24 ఏళ్లు భారత జట్టుకు ఎనలేని సేవలు అందించడమే కాకుండా ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 శతకాలు బాదిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. తర్వాత అతడంతటి గొప్ప క్రికెటర్ మళ్లీ విరాట్ కోహ్లీ రూపంలో వచ్చాడు. అతడు సైతం దశాబ్ద కాలంలో ఎన్నో ఘనతలు సాధించాడు. ఇప్పటికే 70 శతకాలు బాది తెందూల్కర్ రికార్డులను తిరగరాస్తున్నాడు. అయితే, ఆ ఇద్దరు దిగ్గజాలు ఆస్ట్రేలియా జట్టుపై ఒకేరకమైన ప్రదర్శన చేశారు. కంగారూలపై సచిన్, కోహ్లీ పరుగుల వేట ఒకేలా ఉండడమే కాకుండా పలు నమ్మశక్యం కాని నిజాలు దాగి ఉన్నాయి.
అదే వయసులో అన్నే పరుగులు..
సచిన్ 1999లో 26 ఏళ్ల వయసులో ఉండగా ఆస్ట్రేలియాపై టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. అది చేరుకోవడానికి 19 ఇన్నింగ్సులు ఆడిన లిటిల్ మాస్టర్ 2 అర్ధశతకాలు, 5 శతకాలతో మెరిశాడు. మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో ఆ ఘనత అందుకోగా.. కోహ్లీ సైతం అదే జట్టుపై అచ్చం అవే గణాంకాలు నమోదు చేశాడు. 2014లో 26 ఏళ్లు ఉండగానే మెల్‌బోర్న్ స్టేడియంలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. అప్పటికి విరాట్ కూడా 19 ఇన్నింగ్సుల్లో 2 అర్ధశతకాలు, 5 శతకాలే బాదాడు. ఇంకా విచిత్రంగా మెల్‌బోర్న్ స్టేడియంలోనే ఆ ఘనత అందుకున్నాడు. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇద్దరూ బాక్సింగ్‌డే టెస్టుల్లోనే తొలి ఇన్నింగ్స్‌లో శతకాలు సాధించగా రెండో ఇన్నింగ్స్‌లో అర్ధశతకాలతో రాణించారు. కేవలం ఆయా సంవత్సరాల తేడా తప్పితే మిగతా అన్ని గణాంకాలు ఒకటిగా ఉన్నాయి.
రాబోయే సిరీస్‌లో ఏ ఒక్క శతకం బాదినా..
రాబోయే మూడు ఫార్మాట్ల సిరీసుల్లో కోహ్లీ ఏ ఒక్క శతకం బాదినా ఆస్ట్రేలియా గడ్డపై మరే బ్యాట్స్‌మెన్‌కూ సాధ్యంకాని (ఇంతవరకు) ఘనత సాధిస్తాడు. ఇప్పటికే కంగారూ గడ్డపై టెస్టుల్లో 6, వన్డేల్లో 3 సెంచరీలు కొట్టిన అతడు ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్‌మన్ జాక్‌హాబ్స్‌తో సమానంగా నిలిచాడు. వీరిద్దరూ ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపైనే అన్ని ఫార్మాట్లలో కలిపి 9 శతకాలు సాధించారు. దీంతో రాబోయే రోజుల్లో కోహ్లీ ఏ మ్యాచ్‌లో అయినా శతకం బాదితే కంగారూల సొంత గడ్డపై 10 సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. మరోవైపు టీమ్‌ఇండియా సారథి సచిన్‌తో సమానంగా అదే గడ్డపై టెస్టుల్లో 6 సెంచరీలు నమోదు చేశాడు. ఒకవేళ పింక్‌బాల్ టెస్టులో ఇంకో సెంచరీ కొడితే సచిన్ రికార్డును కూడా అధిగమిస్తాడు. అయితే, ఇప్పటికే విరాట్ ఆస్ట్రేలియా గడ్డమీద మొత్తం 11 శతకాలు సాధించాడు. 2012 ట్రై సిరీస్‌లో శ్రీలంకపై ఆస్ట్రేలియా గడ్డమీదే ఒక సెంచరీ, 2015 వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై మరో సెంచరీ సాధించాడు.
-ఇంటర్నెట్‌డెస్క్
ఇవీ చదవండి: