ఆదాయపు పన్ను

Updated : 12/01/2021 15:57 IST
రిటర్నుల సమర్పణకు సిద్ధమయ్యారా? 

పరిమితికి మించిన ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాలిందే. 2019-20 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్‌ ఇయర్‌ 2020-21) రిటర్నులు దాఖలు చేయడానికి డిసెంబరు 31, 2020 వరకూ సమయం ఉంది. ఇంకా చాలా సమయం ఉంది కదా.. అని అనుకోవచ్చు. కానీ, చివరి నిమిషం వరకూ ఎదురు చూడకుండా.. ముందే రిటర్నులు దాఖలు చేస్తే మేలు కదా..

నిజానికి రిటర్నులు దాఖలు చేయడం ఇప్పుడు పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్‌ వెబ్‌సైటులోకి లాగిన్‌ అయితే.. చాలు.. దాదాపు అన్ని వివరాలూ ముందుగానే నింపి ఉన్న ఐటీఆర్‌-1 అక్కడ సిద్ధంగానే ఉంటుంది. మనం చేయాల్సిందల్లా.. అక్కడ ఉన్న మినహాయింపులకు అదనంగా ఏమైనా జత చేయాలా అనేది చూసుకోవడమే. 

ఉద్యోగులందరికీ.. యాజమాన్యాలు ఆదాయం, మూలం వద్ద పన్ను కోతకు సంబంధించిన వివరాలతో ఫారం-16ను అందిస్తాయి. ఇందులో మీ ఆదాయానికి సంబంధించిన వివరాలతోపాటు, పన్ను మినహాయింపులకు సంబంధించిన అంశాలూ ఉంటాయి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రిటర్నుల ఫారాలకు అనుగుణంగా ఇప్పుడు కొత్త రూపంలో ఈ పత్రం అందుతుంది. 
ఈ ఫారం 16ను జాగ్రత్తగా గమనించండి. మీరు ఇచ్చిన ఆధారాలను బట్టి, మినహాయింపులు సరిగా క్లెయిం చేశారా లేదా చూసుకోండి. ఒకవేళ అందులో పేర్కొనకపోతే మీరు రిటర్నులలో వాటిని చూపించాల్సి ఉంటుంది. ఉదాహరణకు కొన్ని సంస్థలు 80జీని ఫారం 16లో పేర్కొనవు. మీరేమైనా విరాళాలు ఇచ్చినప్పుడు దానిని ఐటీఆర్‌లోనే చూపించుకోవాల్సి వస్తుంది. 
♦  ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసిన వారికి వచ్చే వడ్డీపై మూలం వద్ద పన్ను కోత విధించినప్పుడు బ్యాంకులు ఫారం 16 ఏను జారీ చేస్తాయి. అదే విధంగా మీరు ఇల్లు అమ్మినప్పుడు కొనుగోలుదారుడు పన్ను మినహాయించిన సందర్భంలో ఫారం 16బి ఇస్తారు. నెలవారీ అద్దె మొత్తం రూ.50,000 దాటినప్పుడు.. అద్దె చెల్లించే వారు పన్ను మినహాయించి, యజమానికి ఇచ్చే సర్టిఫికెట్‌ ఫారం 16సి. పన్ను రిటర్నులు దాఖలు చేసేప్పుడు.. పైన పేర్కొన్న ఆదాయాలకు వర్తించే ఫారాలను తీసుకోవడం మర్చిపోకండి. వీటి ఆధారంగానే మీ మొత్తం ఆదాయాన్ని లెక్కించేందుకు వీలవుతుంది.
♦ మీరు ఆదాయపు పన్ను శాఖకు ఎంత పన్ను చెల్లించారన్నది తెలుసుకునేందుకు ఫారం ‘26ఏఎస్‌’ను గమనించండి. ఆదాయపు పన్ను ఈ ఫైలింగ్‌ వెబ్‌సైటులోనూ ఈ ఫారాన్ని పొందవచ్చు. యాజమాన్యం, బ్యాంకులు, సొంతంగా మీరు చెల్లించిన పన్ను వివరాలన్నీ ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ పత్రాన్నీ జాగ్రత్తగా పరిశీలించండి. మీ ఆదాయాలు, దానికి సంబంధించి పన్ను మినహాయింపులన్నీ సరిగా నమోదయ్యాయా? చూసుకోండి. 

అన్ని ఆదాయాలూ కలపాలి...
ఒకటికి మించిన ఆదాయాలు ఉన్నప్పుడు.. వాటన్నింటినీ కలిపి మొత్తం ఆదాయంగా చూపించాలి. చాలామంది పొరపాటు చేసేది ఇక్కడే. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం వేతనం ద్వారా ఆదాయం వచ్చినప్పుడు దీంతోపాటు.. అద్దె ద్వారా వచ్చిన ఆదాయం, ఆస్తులు విక్రయించినప్పుడు వచ్చిన మూలధన పెట్టుబడులపై రాబడులు, వృత్తి, వ్యాపారం ద్వారా ఆదాయాలను ఆర్జించినప్పుడు, బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఇవన్నీ కలిపి చూపించాలి. దీంతోపాటు మూలధన లాభం, డివిడెండ్లను ఆదాయాల నుంచి మినహాయింపులు పొందిన విషయమూ తెలియజేయాలి. ఆదాయాలు పూర్తిగా చూపించకపోతే.. ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు అందుకోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే.

ఏ ఫారంలో..
ఆదాయపు పన్ను శాఖ వివిధ వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఏడు రకాల ఇన్‌కంట్యాక్స్‌ రిటర్నుల ఫారాలను అందిస్తోంది. వ్యక్తులకు లభించే ఆదాయాలను బట్టి ఐటీఆర్‌-1 నుంచి ఐటీఆర్‌-7 వరకూ ఏ ఫారాన్ని ఎంచుకోవాలన్నది ఆధారపడి ఉంటుంది. వ్యక్తులు, సంస్థలు, కంపెనీలకూ వేర్వేరు ఫారాలు ఉంటాయి. ఐటీఆర్‌-1 లేదా సహజ్‌ ఫారంలో వేతనం, పింఛను, ఒక ఇంటి ద్వారా ఆదాయం లేదా ఇతర ఆదాయాలు ఉన్నవారు ఎంచుకోవాలి. మొత్తం ఆదాయం రూ.50లక్షల లోపు ఉంటేనే ఈ ఫారం వర్తిస్తుంది. కాబట్టి, మీ ఆదాయ వనరులు ఏమిటి? అనేది తెలుసుకున్నాకే.. సరైన ఫారాన్ని ఎంచుకోవాలి. 

బ్యాంకు ఖాతా.. 
రిటర్నులు సమర్పించేప్పుడు బ్యాంకు ఖాతా వివరాలను కూడా తప్పనిసరిగా పేర్కొనాల్సి ఉంటుంది. అవి కచ్చితంగా ఎలాంటి తప్పులు లేకుండా ఉండేలా చూసుకోండి. ఐఎఫ్‌ఎస్‌సీ, ఖాతా వివరాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి. ఖాతా వివరాల్లో తప్పులు దొర్లితే.. రిఫండు రావడంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. 

వ్యక్తిగత వివరాలు..
ఆదాయపు పన్ను రిటర్నుల ఫారంలో వ్యక్తిగత వివరాల్లో ఏ తప్పులూ లేకుండా చూసుకోవాలి. మీ చిరునామా, ఈమెయిల్‌ ఐడీ, ఫోన్‌ నెంబరు తప్పుల్లేకుండా చూసుకోండి. పొరపాటు దొర్లితే.. ఆదాయపు పన్ను శాఖ మీ రిటర్నులను తిరస్కరించవచ్చు. సరైన సమాచారం లేకపోతే ఆదాయపు పన్ను శాఖ నుంచి వచ్చే సమాచారం సమయానికి అందకపోవచ్చు. ఇది పలు ఇబ్బందులకు దారి తీస్తుంది.

వెరిఫై చేయండి..
రిటర్నులు సమర్పించడమే కాదు.. దానిని ఇ-వెరిఫై చేయడం మర్చిపోకండి. నెట్‌ బ్యాంకింగ్, ఆధార్‌ ఓటీపీ ద్వారా ఇ-వెరిఫై చేయొచ్చు. లేదా అక్నాలజ్‌మెంట్‌ ప్రింట్‌ తీసుకొని, సంతకం చేసి, నేరుగా సీపీసీ, బెంగళూరుకు పోస్టులో పంపించే వీలూ ఉంది. ఏది చేసినా రిటర్నులు సమర్పించిన తేదీ నుంచి 120 రోజుల్లోగా పూర్తి చేయాలి. 

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని