Published : 20/11/2020 00:30 IST
ఆరోగ్య బీమా.. ఇవన్నీ తెలుసుకున్నాకే...

ఒకప్పడు ఆరోగ్య బీమా గురించి చాలామంది పెద్దగా ఆలోచించేవారు. కానీ, కొవిడ్‌ నేపథ్యంలో పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం ఈ బీమాను ఒక తప్పనిసరి అవసరంగా      భావించడం ప్రారంభించారు. ఇతరులకు అయిన వైద్య ఖర్చులను తెలుసుకున్న తర్వాత.. తాము ఆరోగ్య బీమాను ఎంతమాత్రం విస్మరించకూడదనుకుంటున్నారు. నామమాత్రపు ప్రీమియం  చెల్లించడం ద్వారా రూ.లక్షల భారాన్ని తప్పించుకోవచ్చనేది ఇప్పుడు అందరూ గుర్తిస్తున్నారు. ప్రజల ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పులను బీమా సంస్థలూ గ్రహిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే పాలసీల్లో తగిన మార్పులు చేర్పులతో ముందుకు వస్తున్నాయి. ఇలా ఇటీవల కాలంలో వచ్చిన కొన్ని ప్రధాన ప్రయోజనాలను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
బోనస్‌ పెరిగింది..
ఆరోగ్య బీమా సాధారణంగా వార్షిక పాలసీ. పాలసీ వ్యవధిలో ఎలాంటి క్లెయిం చేసుకోకపోతే.. పాలసీదారులకు కొంత ప్రయోజనం చేకూర్చేందుకు బీమా సంస్థ బోనస్‌ను ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా పాలసీ మొత్తాన్ని కొంత శాతం పెంచుతుంది. దీన్నే బీమా పరిభాషలో క్యుములేటివ్‌ బోనస్‌ అని పిలుస్తుంటారు. గతంలో ఇది 10-15శాతం వరకూ ఉండేది. కానీ, వైద్య ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని, బీమా సంస్థలు ప్రస్తుతం దీన్ని అధిక శాతంలోనే అందిస్తున్నాయి.
ఒక ఉదాహరణ చూద్దాం.. కుమార్‌ రూ.5లక్షల ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్నాడనుకుందాం. చిన్న వయసులోనే పాలసీ తీసుకోవడంతో అతను మొదటి ఏడాది ఎలాంటి క్లెయిం చేసుకోలేదు. అందువల్ల అతనికి 50శాతం సూపర్‌ క్యుములేటివ్‌ బోనస్‌ అందింది. దీంతో అతని పాలసీ విలువ రూ.7.5లక్షలకు చేరింది. రెండో ఏడాదిలోనూ ఎలాంటి క్లెయిం చేయలేదు. దీంతో ప్రాథమిక పాలసీపై మళ్లీ 50శాతం బోనస్‌ లభించింది. రెండు సార్లు బోనస్‌ రావడంతో ఇప్పుడు అతని పాలసీ విలువ రూ.10లక్షలకు చేరింది. పాలసీ కొనుగోలు చేసినప్పటితో పోలిస్తే ఇది రెట్టింపు. అతను ప్రీమియం రూ.5లక్షలకు చెల్లిస్తున్నప్పటికీ.. రూ.10లక్షల బీమా ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ అతను క్లెయిం చేసుకోవాల్సి వస్తే.. తదుపరి పునరుద్ధరణలో బీమా ప్రాథమిక మొత్తంలో బోనస్‌ 10 శాతం తగ్గుతుంది.
రీఛార్జ్‌ లాభం...
క్లెయిం చేసుకున్నప్పుడు ఆరోగ్య బీమా పాలసీలో ఉన్న పరిమితి పూర్తి కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్ణీత శాతం వరకూ పాలసీ రీఛార్జి అయ్యే అవకాశాన్ని బీమా సంస్థలు అందుబాటులోకి తెస్తున్నాయి.
ఉదాహరణకు.. కుమార్‌ రూ.5లక్షల బీమా పాలసీ తీసుకున్నాడు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. బిల్లు రూ.6లక్షలు అయ్యింది. ఇక్కడ అతని పాలసీకి 20శాతం వరకూ రీఛార్జి అవకాశం ఉండటంతో.. అదనంగా చెల్లించాల్సిన రూ.లక్ష కూడా పాలసీ నుంచే అందింది. దీనికి ఎలాంటి అదనపు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.

పరిమితి లేకుండా..
నిర్ణీత మొత్తం పాలసీని ఎంచుకునే బదులు అపరిమితంగా రక్షణ కల్పించే పాలసీలూ ఇప్పుడు లభిస్తున్నాయి. ఇలాంటి వాటిల్లో ఒక రోజు గది అద్దె ఎంత వరకూ చెల్లించాలి.. అనేది పాలసీదారుడు నిర్ణయించుకోవచ్చు. రూ.3,000- రూ.50,000ల వరకూ ఇది ఉంటుంది. అప్పుడు పాలసీ మీరు నిర్ణయించుకున్న మొత్తానికి దాదాపు 100 రెట్ల వరకూ పరిహారాన్ని అందిస్తుంది. ఉదాహరణకు రోజుకు రూ.10వేలు గది అద్దె అనుకున్నారనుకోండి.. అప్పుడు రూ.10లక్షల వరకూ బీమా సంస్థ పరిహారం అందిస్తుంది. ఈ తరహా పాలసీల్లో అపరిమితంగా బీమా రక్షణ కొనసాగుతుంది. క్లెయిం మొత్తం 100 రెట్లు మించితే.. అప్పుడు క్లెయిం మొత్తానికి కొంత శాతం అదనంగా చెల్లించే ఏర్పాటు చేసుకోవచ్చు. దీన్ని సహ చెల్లింపుగా పిలుస్తారు. బిల్లులో 15, 20, 25 శాతం సహ చెల్లింపును ఎంచుకోవచ్చు. బీమా పాలసీని తీసుకునేటప్పుడే.. సహ చెల్లింపు శాతాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఆరోగ్యాన్ని కాపాడుకునేలా..
బీమా సంస్థలు ప్రస్తుతం పాలసీదారులకు పలు ఇతర ప్రయోజనాలనూ అందిస్తున్నాయి. వారు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చేస్తున్న కృషికి అభినందనగా వీటిని అందిస్తున్నాయి. వీటితోపాటు ఔట్‌ పేషెంట్‌ చికిత్సలకు రాయితీలు, ఔషధాల కొనుగోలు, ఆరోగ్య పరీక్షలు, ఫిట్‌నెస్‌ సెంటర్లలోనూ రాయితీని అందించే ఏర్పాటు చేస్తున్నాయి. తీసుకున్న పాలసీని బట్టి ఇవి అందుతుంటాయి.  మీ పాలసీలో ఈ ప్రయోజనాలు ఉన్నాయా లేదా చూసుకోండి.


తిరిగి వాడుకునేలా...

ఆరోగ్య బీమా పాలసీలోనే ఒక బ్యాకప్‌లాంటి అవకాశం ఇప్పుడు బీమా సంస్థలు కల్పిస్తున్నాయి. అయితే, ఈ ప్రయోజనం ఈ ప్రయోజనాన్ని అందుకునేందుకు కొంత అదనంగా చెల్లించక తప్పదు. ఎంచుకున్న పాలసీ మొత్తం పూర్తయినప్పుడు ఇది ఎంతో సహాయపడుతుంది. ఉదాహరణకు కుమార్‌ అనుకోకుండా ప్రమాదం బారిన పడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో చికిత్స కోసం అతను తీసుకున్న రూ.5లక్షల పాలసీ ఖర్చయిపోయింది. ఆ తర్వాత ఏడాదిపాటు ఎలాంటి అనారోగ్యం వచ్చినా.. పాలసీ నుంచి పరిహారం అందదు. కానీ, ఈ పునస్థాపన ప్రయోజనాన్ని ఎంచుకున్నాడునుకుందాం.. పాలసీ పరిమితి పూర్తి కాగానే.. తిరిగి ప్రాథమిక పాలసీ అదే మొత్తానికి చేరుతుంది. ఇతర అనారోగ్యాలతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినప్పుడు పాలసీ గతంలోలాగానే పరిహారం అందిస్తుంది. అంటే, ఒకసారి బీమా మొత్తం అయిపోయినా.. ఈ పునస్థాపన అవకాశం వల్ల ఎలాంటి చింత లేకుండా ఉండవవచ్చన్నమాట. అయితే, బీమా సంస్థ ఏయే వ్యాధులకు దీన్ని వర్తింపచేస్తోంది? వేచి ఉండే వ్యవధి ఉందా? తదితర అంశాలను పరిశీలించండి.


మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని