ఆదివారం, నవంబర్ 01, 2020

Published : 08/12/2019 01:00 IST
తెలుసుకుంటేనే ఆరోగ్య ధీమా!

వైద్య ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. చిన్న జ్వరానికీ రెండు మూడు రోజులు ఆసుపత్రిలో చేరడం.. వేలకు వేల రూపాయల బిల్లులూ ఇప్పుడు సర్వసాధారణం అయ్యాయి. ప్రపంచ ఆరోగ్య ద్రవ్యోల్బణంతో పోలిస్తే.. మన దేశంలో ఎంతో అధికంగా ఉందని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా ఉండటం తప్పనిసరి అవుతోంది. ఇంతటి కీలకమైన ఈ బీమా పాలసీ తీసుకునే ముందు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా దేనికి బీమా వర్తిస్తుంది.. దేనికి వర్తించదు అనే అంశాలపై అవగాహన ఉండాలి.
 

రోగ్య బీమా పాలసీ ఉన్నంత మాత్రాన అన్ని రకాల అనారోగ్యాలకూ బీమా వర్తించదు అనేది తెలిసిన రహస్యమే. ప్రతి ఆరోగ్య బీమా పాలసీలోనూ... వర్తించేవి.. వర్తించని జబ్బులు అంటూ కొన్ని నిబంధనలు ప్రత్యేకంగా ఉంటాయి. వర్తించేవాటి విషయం ఎలా ఉన్నా.. వేటికి వర్తించదు అనేది తెలుసుకోకపోతే.. తీరా ఆసుపత్రిలో చేరిన తర్వాత ఇబ్బందులు తప్పకపోవచ్చు. అందుకే, బీమా పాలసీ తీసుకునే ముందు నియమనిబంధనల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.

సాధారణంగా ఆరోగ్య బీమా పాలసీలో వర్తించేవి ఏముంటాయంటే..
* ఆసుపత్రిలో చేరి, 24 గంటల పాటు చికిత్స పొందినప్పుడు ఆరోగ్య బీమా వర్తిస్తుందనేది సహజ నిబంధన. ఇందులో ఆసుపత్రి గది అద్దె, ఐసీయూ ఖర్చు, ఆపరేషన్‌ థియేటర్‌ ఛార్జీలు, డాక్టర్‌, సర్జన్‌, మత్తుమందు డాక్టర్‌, నర్సుల ఫీజులు కలిసి ఉంటాయి. దీంతోపాటు మందులు, ఆక్సిజన్‌, రక్తంలాంటి వాటికి అయిన ఖర్చులకూ బీమా వర్తిస్తుంది.
* ఆసుపత్రిలో చేరడానికన్నా ముందు.. ఇంటికి వెళ్లాక అయిన ఖర్చులకూ బీమా రక్షణ వర్తిస్తుంది.
* అనారోగ్యం బారిన పడినప్పుడు.. ఇంటి నుంచి లేదా ఏదైనా ఇతర ప్రాంతం నుంచి ఆసుపత్రి వరకూ రావడానికి అయ్యే అంబులెన్స్‌ ఖర్చును పాలసీ భరిస్తుంది. అయితే, ఇది ఎంత మేరకు అనేది ముందే తెలుసుకోవాలి.
* కొన్ని చికిత్సలకు తప్పనిసరిగా 24 గంటల పాటు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం రాదు. ఇలాంటి వాటిని ‘డే కేర్‌ ట్రీట్‌మెంట్‌’గా వ్యవహరిస్తారు. పాలసీలో ముందే తెలియజేసిన నిబంధనల మేరకు ఆ చికిత్సలకు పరిహారం ఇస్తుంది.
* అవయవ దానం పొందినప్పుడు.. అవయవదానం కోసం అయిన ఖర్చు, శస్త్రచికిత్సకు అయిన వ్యయాన్ని బీమా పాలసీ భరిస్తుంది.
* ప్రస్తుతం చాలా ఆరోగ్య బీమా పాలసీలు.. ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియోపతి వైద్య పద్ధతులకూ వర్తిస్తున్నాయి. మీరు పాలసీని ఎంచుకునేప్పుడు ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసుకోండి.
* వ్యాధుల తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న సందర్భాల్లో ఆసుపత్రిలు ఖాళీగా ఉండటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటికి దగ్గరగా ఉన్న ఆసుపత్రిలో మంచాలు అందుబాటులో లేనప్పుడు ఇంటి దగ్గర ఉండి కూడా చికిత్స తీసుకోవచ్చు. ఇలాంటప్పుడూ.. బీమా పరిహారం లభించేలా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి వాటినీ పరిశీలించాలి.
* ఒకటి నుంచి నాలుగేళ్లపాటు ఎలాంటి క్లెయింలు లేనప్పుడు ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడానికి ఇప్పుడు చాలా సంస్థలు అనుమతిస్తున్నాయి. ఈ సౌకర్యాన్ని మీ ఆరోగ్య బీమా సంస్థ అందిస్తుందా లేదా తెలుసుకోండి. ఒకవేళ అందిస్తుంటే.. పరీక్షలు చేయించుకోండి.
* ఆరోగ్య బీమా పాలసీల్లో కీలకమైన అంశం ‘రీస్టోర్‌’. పాలసీ ఏడాదిలో పాలసీ విలువ మొత్తం ఖర్చయితే.. మళ్లీ పాలసీ విలువ పునురుద్ధరిస్తారు. వైద్య ఖర్చులు పెరిగిన నేపథ్యంలో మీ పాలసీలో ఇలాంటి వీలుండేలా చూసుకోవడం తప్పనిసరి అవసరం అవుతోంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఒక వ్యక్తికి.. ఒక వ్యాధి, చికిత్సకు ఏడాదిలో ఒకసారి మాత్రమే ఇది వర్తిస్తుంది. వేరే వ్యాధులు, చికిత్స కోసం మాత్రమే ‘రీస్టోర్‌’ అయిన మొత్తాన్ని వినియోగించుకునేందుకు వీలవుతుంది.

ఇవన్నీ సాధారణంగా అన్ని బీమా సంస్థలు అందిస్తుంటాయి. కొన్ని సంస్థలు ప్రత్యేకంగా ప్రసూతి ఖర్చులకూ వర్తించేలా బీమా పాలసీలను తీసుకొచ్చాయి. అప్పుడే పుట్టిన నవజాత శిశువులకూ వర్తించేలా బీమా పాలసీలు తీసుకోవచ్చు. ఓపీడీ చికిత్సలకైన ఖర్చులను భరించే పాలసీలూ అందుబాటులోకి వచ్చాయి.

కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యాధులు, చికిత్సలకు ఆరోగ్య బీమా సంస్థలు పరిహారం చెల్లించకపోవచ్చు. వీటిని మనం నిశితంగా గమనించాల్సిన అవసరం ఉంది.
* ఆరోగ్య బీమా పాలసీలు చాలావరకూ ముందస్తు వ్యాధుల చికిత్సకు వర్తించవు. ఉదాహరణకు.. పాలసీదారుడు.. పాలసీని తీసుకోవడానికి ముందే.. ఏదైనా వ్యాధితో బాధపడుతున్నారనుకోండి.. అప్పుడు పాలసీలో ఆ వ్యాధికి నిర్ణీత వ్యవధిపాటు పరిహారం అందకపోవచ్చు. సాధారణంగా ఈ వేచి ఉండే సమయం బీమా సంస్థ, పాలసీని బట్టి 1-4 ఏళ్ల వ్యవధి ఉండొచ్చు.
* పాలసీ తీసుకున్న మొదటి 30-90 రోజుల వరకూ సాధారణ అనారోగ్యాలకు పాలసీ పరిహారం ఇవ్వదు. ప్రమాదాలు జరిగినప్పుడు ఈ నిబంధన వర్తించదు.
* పాలసీ తీసుకున్న రెండు నుంచి నాలుగేళ్ల లోపు మోకీలు మార్పిడి, హెర్నియా, పైల్స్‌లాంటి వాటి చికిత్సలకు పరిహారం లభించకపోవచ్చు.
* సొంతంగా గాయాలు చేసుకోవడం, యుద్ధాలు, మత కలహాల్లాంటి వాటివల్ల గాయాలు అయినప్పుడు సాధారణంగా ఆరోగ్య బీమా వర్తించదు.
* ప్రత్యేకంగా పాలసీలో పేర్కొంటే తప్ప.. ప్రసూతి ఖర్చులు, అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు వ్యాక్సినేషన్‌లాంటి ఖర్చులను చెల్లించరు.
* సౌందర్య, దంత చికిత్సలకు సాధారణంగా బీమా వర్తించదు. కానీ, ప్రమాదవశాత్తూ దంతాలకు ఏదైనా జరిగితే.. ఆ చికిత్సకు పరిహారం లభిస్తుంది. శాస్త్రీయంగా రుజువు కాని చికిత్సలకోసం ఖర్చు చేస్తే బీమా పాలసీ దాన్ని పట్టించుకోదు.
* ముందుగానే పాలసీలో పేర్కొన్నప్పుడే.. ఓపీడీ చికిత్సల ఖర్చులు చెల్లిస్తారు.
- ప్రసూన్‌ సిక్దార్‌, ఎండీ-సీఈఓ, మనిపాల్‌సిగ్నా హెల్త్‌ ఇన్సూరెన్స్‌

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని