శనివారం, అక్టోబర్ 24, 2020

Updated : 24/02/2019 00:38 IST
అమెరికా నుంచి మదుపు చేయొచ్చా?

మా అమ్మాయి, అల్లుడు అమెరికాలో ఉంటున్నారు. వారి పేరు మీద ఇక్కడ మ్యూచువల్‌ ఫండ్లలో సిప్‌ చేద్దామనే ఆలోచన ఉంది. భవిష్యత్తులో మొత్తం పెట్టుబడితో ఇక్కడ ఏదైనా స్థిరాస్తి కొనాలనేది వారి ఆలోచన. మదుపు చేసేందుకు ఏమైనా నిబంధనలు ఉంటాయా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి?

- మనోహర్‌

 

మీ అమ్మాయి, అబ్బాయి అమెరికాలో ఉన్నారు కాబట్టి, వారు ఇక్కడ మదుపు చేయాలంటే.. కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ముందుగా వారు ఎన్‌ఆర్‌ఐ కేవైసీ నిబంధనలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎన్‌ఆర్‌ఈ (నాన్‌ రెసిడెంట్‌ ఎక్స్‌టర్నల్‌) ఖాతాను ప్రారంభించాలి. దీనికోసం ఏదైనా బ్యాంకును ఎంచుకోవచ్చు. అక్కడ మీకు సమీపంలో మన దేశానికి సంబంధించిన బ్యాంకు ఉంటే ఈ ఖాతాను ప్రారంభించండి. లేదా మళ్లీ ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్‌ఆర్‌ఈ ఖాతాను తెరవండి. మన దేశంలో ఉన్నవారు మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అమెరికా, కెనడా దేశాలకు వెళ్లిన వారు పెట్టుబడి పెట్టాలంటే.. కొన్ని మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీల్లోనే అవకాశం ఉంది. ఇందులో మళ్లీ రెండు రకాలున్నాయి... ఎల్‌అండ్‌టీ మ్యూచువల్‌ ఫండ్‌, యూటీఐ మ్యూచువల్‌ ఫండ్లు సాధారణ నిబంధనలతో మదుపు చేసేందుకు అవకాశం ఇస్తున్నాయి. రిలయన్స్‌ మ్యూచువల్‌ ఫండ్‌, ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌, యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ, ఎస్‌బీఐ మ్యూచువల్‌, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌, ఎడిల్‌వైజ్‌ ఏఎంసీ, సుందరం మ్యూచువల్‌ ఫండ్‌ లాంటివి ‘ఫట్కా’ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. వీటిల్లోనూ కొన్ని కంపెనీలు మదుపరి భారత్‌కు వచ్చినప్పుడు మాత్రమే పెట్టుబడి పెట్టేందుకు అవకాశం కల్పిస్తాయి. కాబట్టి, మీరు మన దేశంలోని మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసేందుకు ముందుగా ఎన్‌ఆర్‌ఈ ఖాతాలో జమ చేసి, ఫండ్లలోకి మళ్లించాల్సి ఉంటుంది. 
 

మా అమ్మగారి పేరుమీద రూ.3లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఉంది. తన వయసు 59 ఏళ్లు. వడ్డీ 7 శాతం వస్తోంది. దీన్ని మార్చి, కాస్త అధిక రాబడి వచ్చేలా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాం. లిక్విడ్‌ ఫండ్లలో మదుపు చేస్తే 11శాతం వరకూ రాబడి వస్తుందని విన్నాను. నిజమేనా? సురక్షితంగా ఉండేలా ఏ పథకాన్ని ఎంచుకోవాలి?

- శ్రావ్య

 

4 నష్టభయం తక్కువగా ఉండే లిక్విడ్‌ ఫండ్లలో 11శాతం వరకూ రాబడి రావడం అసాధ్యం. ఇప్పుడున్న పరిస్థితుల్లో లిక్విడ్‌ ఫండ్లు 7-8 శాతం వరకే రాబడినిస్తున్నాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు మించి అధిక రాబడి ఆశిస్తుంటే.. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లను పరిశీలించవచ్చు. పెట్టుబడికి హామీ ఉండాలని అనుకుంటే.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో కొనసాగడమే మంచిది. 
 

నేను గతంలో టర్మ్‌ బీమా పాలసీ తీసుకున్నాను. మధ్యలో ప్రీమియం చెల్లించలేదు. దీంతో ఆ పాలసీ రద్దయ్యింది. ఇటీవల నాకు అధిక రక్తపోటు ఉందని తెలిసింది. ఇప్పుడు కొత్త పాలసీ తీసుకోవడంలో ఇబ్బంది వస్తుందా? పాత పాలసీకి ప్రీమియం చెల్లించి, అమల్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంటుందా?

- శివకుమార్‌

 

మీకు అధిక రక్తపోటు ఉంది కాబట్టి, కొత్త పాలసీ తీసుకోవాలంటే.. బీమా కంపెనీలు కాస్త అధిక ప్రీమియాన్ని వసూలు చేసే అవకాశం ఉంది. వీలైతే పాత పాలసీని పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నించండి. మీ బీమా కంపెనీకి వెళ్లి వివరాలు తెలుసుకోండి. కాస్త వడ్డీ విధించి, ప్రీమియాన్ని తీసుకునేందుకు బీమా సంస్థ అంగీకరించవచ్చు. మీరు ప్రీమియం చెల్లించకుండా ఆరు నెలలకు మించితే.. ఆరోగ్య పరీక్షలు అడగవచ్చు. అప్పుడు కొంత బీమా ప్రీమియం పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ పాత పాలసీలో కొనసాగడమే మేలు. 
 

మాకు ఇద్దరు పిల్లలు. వారి చదువు కోసం ఏడాదికి రూ.1,50,000 వరకూ ఖర్చువుతోంది. దీన్ని మూడు విడతలుగా చెల్లిస్తుంటాం. దీనికోసం నెలకు రూ.10,000 చొప్పున పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉంది. ఒకేసారి రూ.5లక్షలు మదుపు చేస్తే నెలకు రూ.10వేలు వచ్చే అవకాశం ఎక్కడైనా ఉందా?

- వినోద్‌

 

మీరు రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టి, నెలకు రూ.10,000 సంపాదించాలంటే.. దాదాపు 24 శాతం రాబడి రావాలి. ఇది అంచనాకు మించి ఆశించడమే అవుతుంది. పారదర్శకంగా ఉండి, నియంత్రణ సంస్థల పరిధిలో ఉండే పెట్టుబడి పథకాలు ఇంత రాబడిని ఇవ్వడం కష్టమే. రూ.5లక్షలపైన 8శాతం వడ్డీ వస్తుందనుకుంటే.. రూ.3,300 వరకూ లభిస్తాయి. మీరు నెలకు రూ.10వేల చొప్పున పెట్టుబడి పెట్టాలనుకుంటే.. లిక్విడ్‌ ఫండ్లను ఎంచుకోండి. మీకు అవసరమైనప్పుడు ఆ ఫండ్ల నుంచి వెనక్కి తీసుకోండి. ఇక్కడ 7-8శాతం వరకూ రాబడి వస్తుంది. ఫ్రాంక్లిన్‌ ఇండియా లిక్విడ్‌ ఫండ్‌, ఎస్‌బీఐ మ్యాగ్నమ్‌ లో డ్యూరేషన్‌ ఫండ్‌, టాటా ట్రెజరీ అడ్వాంటేజ్‌ ఫండ్‌లను ఎంపిక చేసుకోవచ్చు. 
 

నా వయసు 34 ఏళ్లు. ఇటీవలే ఉద్యోగం మానేశాను. ఈపీఎఫ్‌ నుంచి రూ.4లక్షల వరకూ వస్తాయి. ఈ డబ్బును మరో 10 ఏళ్ల తర్వాత వాడుకోవాలని ఆలోచన. ఆలోపు మంచి రాబడి వచ్చేలా ఏదైనా పెట్టుబడి పథకంలో పెట్టాలనుకుంటున్నాను. సొంతంగా వ్యాపారం చేస్తున్నాను. జీవిత బీమా పాలసీ ఎంత మేరకు తీసుకోవాలి?

- శ్రీకాంత్‌

 

మీరు వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నారు కాబట్టి, ముందుగా ఆర్థికంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మొదట చేయాల్సిన పని.. టర్మ్‌ పాలసీ తీసుకోవడం. మీకు ఏడాదికి అయ్యే ఖర్చులను బట్టి, దానికి 15 రెట్ల వరకూ పాలసీ మొత్తాన్ని ఎంచుకోవాలి. కనీసం ఏడాది ఖర్చులను అత్యవసర నిధిగా అందుబాటులో ఉంచుకోవాలి. దీన్ని వెంటనే నగదుగా మార్చుకునేందుకు వీలున్న పథకాల్లో జమ చేసుకోవాలి. దీని తర్వాత మీరు పెట్టుబడుల గురించి ఆలోచించండి. మీరు దీర్ఘకాలం మదుపు చేద్దామనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి, ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక రాబడి వస్తుంది. మీ దగ్గర ఉన్న మొత్తాన్ని ఒకేసారి కాకుండా.. క్రమానుగత బదిలీ విధానం (ఎస్‌టీపీ)లో మదుపు చేయండి. యాక్సిస్‌ మల్టీ క్యాప్‌ ఫండ్‌, కోటక్‌ స్టాండర్డ్‌ మల్టీ క్యాప్‌ ఫండ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీ క్యాప్‌ ఫండ్లను పరిశీలించవచ్చు.

- సాయి కృష్ణ పత్రి, సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని