Updated : 13/11/2020 12:05 IST
ఆ డబ్బుకు పన్ను చెల్లించాలా?

నా వయసు 54 ఏళ్లు. మా అబ్బాయి ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. నా కోసం కారు కొనాలనే ఆలోచనతో గత ఆరు నెలలుగా నా ఖాతాకు కొంత డబ్బు పంపిస్తున్నాడు. ఈ మొత్తాన్ని నా ఆదాయంగా చూపించాల్సి ఉంటుందా? నేను పన్ను  చెల్లించాలా? 

- రామకృష్ణ

మీ అబ్బాయి నుంచి బహుమతిగా అందుకున్న మొత్తానికి మీరు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. దగ్గరి బంధువుల నుంచి అందుకున్న బహుమతులకు పన్ను వర్తించదు. అందులో ఎవరెవరుంటారంటే.. ఒక వ్యక్తి జీవిత భాగస్వామి, తోబుట్టువులు, జీవిత భాగస్వామి తోబుట్టువులు, అమ్మానాన్నల తోబట్టువుల్లాంటి వారు ఉంటారు. వీరితోపాటు ఇతర దగ్గరి బంధువుల నుంచి అందుకున్న బహుమతులకూ పన్ను ఉండదు. కాబట్టి, మీ అబ్బాయి మీ కారు కోసం పంపిస్తున్న మొత్తాన్ని మీ ఆదాయంగా పరిగణించరు.

నేను 2011లో రూ.20లక్షల గృహరుణం తీసుకున్నాను. వడ్డీ రేటు 8.5శాతం. ఇప్పుడు  ఇంటి మరమ్మతు కోసం రూ.3లక్షల టాపప్‌ రుణం తీసుకోవాలని అనుకుంటున్నాను. ఈ కొత్త రుణాన్ని పాత రుణంతో కలిపి, కొత్త వడ్డీ రేటు విధిస్తారా? లేక దీన్ని కొత్త రుణంగానే పేర్కొంటారా? 

- జగదీశ్‌

మీరు ఇంటి మరమ్మతు కోసం రుణం తీసుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి, టాపప్‌ రుణానికి బదులుగా హోం ఇంప్రూవ్‌మెంట్‌ రుణం తీసుకోండి. దీనివల్ల మీకు తక్కువ వడ్డీకే రుణం లభించే అవకాశం ఉంటుంది. పైగా అప్పు ఎక్కువగా లభిస్తుంది. వడ్డీ చెల్లింపుపై పరిమితుల మేరకు ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. టాపప్‌ లోన్‌ తీసుకుంటే దాన్ని కొత్త రుణంగానే పరిగణిస్తారు. ప్రస్తుత వడ్డీ రేట్లు టాపప్‌ రుణానికి మాత్రమే వర్తిస్తాయి. దీనివల్ల ఇప్పటికే మీకున్న గృహరుణం వడ్డీ రేట్లపై ఎలాంటి ప్రభావం ఉండదు. ప్రస్తుతం గృహరుణాల వడ్డీ రేట్లు చాలా వరకు తగ్గాయి. ముందుగా మీ రుణ సంస్థను సంప్రదించి, ఈ విషయాన్ని తెలుసుకోండి. తక్కువ వడ్డీకి మారేందుకు అవకాశం ఉందా? దానికోసం ఎంత రుసుము చెల్లించాలా చూడండి. 

నేను ఇప్పటికే రూ.4లక్షల బీమా పాలసీకి ప్రీమియం చెల్లిస్తున్నాను.  ఇటీవల ఒక స్నేహితుడు ఈ మొత్తం  సరిపోదని కనీసం రూ.కోటి పాలసీ      తీసుకోవాల్సిందిగా చెప్పాడు. నా నెల జీతం రూ.30వేలు. పాత పాలసీని ఆపేసి, రూ.కోటి బీమా తీసుకోవాలా?  

- రాజశేఖర్‌

మీ స్నేహితుడు చెప్పింది నిజమే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రూ.4లక్షల బీమా ఏమాత్రం సరిపోదు. కాబట్టి, మీ పాలసీ మొత్తాన్ని పెంచుకోవాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. మీ ప్రస్తుత ఖర్చులు, భవిష్యత్తు లక్ష్యాలు ఇతర బాధ్యతలను లెక్క వేసుకొని, సరైన మొత్తానికి పాలసీ తీసుకోండి. సాధారణంగా వార్షికాదాయానికి కనీసం 15-20 రెట్ల వరకూ బీమా ఉంటే బాగుంటుంది. మీ వయసును బట్టి, ప్రీమియం ఆధారపడి ఉంటుంది. వీలైనంత తొందరగా రూ.కోటి పాలసీని తీసుకునేందుకు ముందుకు వెళ్లండి. మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న బీమా సంస్థలను ఎంచుకొని, పాలసీని తీసుకోండి. 

నేను ఇటీవలే కొత్త ఉద్యోగంలో చేరాను. పాత సంస్థలో రెండున్నరేళ్లు పనిచేశాను. కొత్త ఆఫీసులో పాత ఉద్యోగానికి సంబంధించిన భవిష్య నిధి వివరాలు అడుగుతున్నారు. ఆ ఖాతాలో ఉన్న డబ్బును నేను వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నాను. కానీ, ఆ డబ్బుతో ఏం చేయాలన్నది ఇంకా ఆలోచించలేదు. నా కొత్త కార్యాలయంలో ఆ వివరాలు ఇవ్వాలా? డబ్బు వెనక్కి తీసుకున్న తర్వాత చెప్పాలా? 

- సురేశ్‌

మీరు ఉద్యోగంలో కొనసాగుతున్నారు కాబట్టి, ఈపీఎఫ్‌ఓ నిబంధనల ప్రకారం ఇప్పుడే మీరు మీ ఈపీఎఫ్‌ మొత్తాన్ని వెనక్కి తీసుకోలేరు. కాబట్టి,  మీ యూఐఎన్‌ సంఖ్యను మీ కొత్త కార్యాలయంలో తెలియజేయండి. 

నా భార్యతో కలిసి ఉమ్మడిగా గృహరుణం తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇల్లు తీసుకున్న తర్వాత దాన్ని అద్దెకు ఇవ్వాలనేది మా ఆలోచన. మేము నా తల్లిదండ్రులతో కలిసి, వారసత్వంగా వచ్చిన ఇంట్లో ఉంటున్నాం. ఇప్పుడు మేము గృహరుణం తీసుకుంటే ఆ వడ్డీని ఆదాయపు పన్ను మినహాయింపు కోసం చూపించుకోవచ్చా? 

- అజయ్‌

మీకు వచ్చిన అద్దె ఆదాయాన్ని మీ మొత్తం ఆదాయంలో కలిపి చూపించాల్సి ఉంటుంది. మీరు గృహరుణం తీసుకున్న నిష్పత్తి ఆధారంగా ఈ ఆదాయాన్ని గణించాలి. అదే విధంగా మీరిద్దరూ ఆస్తిలో యాజమాన్య నిష్పత్తి ఆధారంగా వడ్డీని ఆదాయపు పన్ను మినహాయింపు కోసం చూపించుకోవచ్చు. మీ జీవిత భాగస్వామి కూడా ఆస్తి కొనుగోలుకు అవసరమైన పెట్టుబడిని సమకూర్చినప్పుడే ఇది వర్తిస్తుందన్నది గుర్తుంచుకోండి.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని