న్యాయ నేస్తం

Published : 12/05/2019 00:40 IST
క్లెయిం పేరుతో మోసపోవద్దు...

నాలుగేళ్ల నుంచీ ఆరోగ్య బీమా చెల్లిస్తున్నారా? ఇప్పటి వరకూ ఒక్క క్లెయిం కూడా లేదా? మీకెందుకు మేమున్నాం.. ఏదో ఒక విధంగా క్లెయిం దరఖాస్తు చేసి, డబ్బులు ఇప్పిస్తాం.. అంటూ.. చెపుతున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగింది.. వీరిని నమ్మి మీ ఆరోగ్య బీమా పాలసీ వివరాలు చెప్పారో.. ఇక అంతే సంగతి.. మీరు మోసగాళ్ల బారిన పడినట్లే...

రోగ్య బీమాపై ఇప్పుడు చాలామందికి అవగాహన పెరిగింది. అనారోగ్యంలో ఆర్థిక రక్షణ కల్పించే పాలసీగా దీన్ని అందరూ గుర్తిస్తున్నారు. ఆసుపత్రిలో చేరినప్పుడు నిర్ణీత మొత్తం వరకూ ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఆదుకుంటుందీ పాలసీ. అధిక శాతం మంది వైద్య బీమా పాలసీని ఈ విధంగానే ఉపయోగించుకుంటున్నారు. కానీ, కొంతమంది దీనికి భిన్నంగా పాలసీదారుల నుంచి సమాచారాన్ని సేకరించి మోసపూరిత క్లెయింలు చేసుకునేందుకు వాడుకుంటున్నారు. 
ఇటీవల కాలంలో ఈ సంఘటనలు పెరుగుతున్న దృష్ట్యా పాలసీదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఏం జరుగుతోందంటే.. 
చెల్లించిన ప్రీమియం వృథా అయిపోతుందనీ, ఎందుకు వదిలేయాలని చెబుతూ.. ముందుగా మోసగాళ్లు పాలసీదారులను ఒప్పించేందుకు ప్రయత్నిస్తారు.. ఆ తర్వాత బీమా పాలసీ క్లెయిం చేసుకునేందుకు వీలుగా వారి వివరాలు సేకరిస్తారు. అంతేకాకుండా.. కొందరు మోసపూరితంగా పాలసీలు అంటగట్టేందుకూ ప్రయత్నిస్తారు.

ఏం చేస్తారంటే.. 
అసలు పాలసీదారుడు కాకుండా.. వేరే వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పిస్తుంటారు. 
ముందస్తు వ్యాధుల వివరాలు తెలియజేయకుండా పాలసీని ఇప్పిస్తారు. 
బీమా కంపెనీలు బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన ఆసుపత్రుల్లో చేర్పించడం 
వైద్య బీమా పాలసీ ఉందని చెప్పి, వాస్తవంగా అయిన ఖర్చుకన్నా అధిక మొత్తం బిల్లులు వేయడం చేస్తుంటారు.

పాలసీదారులను మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగా.. వారికీ కొంత మొత్తం ఇస్తామని ఆశ చూపిస్తుంటారు. మోసగాళ్ల మాయమాటలకు లొంగిపోతే.. తర్వాత ఇబ్బంది పడేది పాలసీదారులే. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన సాంకేతికత ఆధారంగా నిజంగా పాలసీదారుడే వాస్తంగా క్లెయిం చేశారా లేదా మోసపూరిత క్లెయిం చేశారా అనేది ఇట్టే తెలిసిపోతుంది. వారు ఇప్పటివరకూ ఏయే వ్యాధులకు చికిత్స తీసుకున్నారు.. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది?లాంటివన్నీ సులువుగానే అర్థమవుతాయి. ఒకసారి మోసం చేశారని బీమా సంస్థ నిర్ధారణకు వస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.

ఎలా అరికట్టాలి..

పాలసీదారుడు మోసగాళ్ల చేతిలో చిక్కుకోకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
మీకు పాలసీ వచ్చాక.. అది మీరు అనుకుంటున్న పాలసీయేనా కాదా అనేది ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోండి. 
మీ మొబైల్‌ నెంబరు, ఈ మెయిల్‌లాంటివి మారితే వెంటనే బీమా సంస్థకు ఆ విషయాన్ని తెలియజేయండి. 
పాలసీని క్లెయిం చేసుకున్నట్లుగా మీకు ఏదైనా సందేశం వస్తే.. అది వాస్తవం కాకపోతే వెంట‌నే బీమా సంస్థను సంప్రదించండి. 
మీకు ఉన్న పాలసీల గురించి మీ కుటుంబ సభ్యులకు పూర్తి వివరాలు తెలియజేయండి.

దీంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటంటే..

పాలసీ తీసుకునేప్పుడు ముందస్తు వ్యాధుల వివరాలు తెలియజేయండి. మీకు సమీపంలో ఉన్న ఆసుపత్రుల వివరాలు.. అందులో బీమా సంస్థ జాబితాలో ఉన్నవాటి గురించి తెలుసుకోండి. బీమా కార్డును ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంచుకోండి. మోసపోయినట్లు అనిపిస్తే.. వెంటనే మీ బీమా సంస్థను సంప్రదించండి. అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేయండి.

మెరుగైన వైద్యాన్ని అందించడం కోసం ఎంతోమంది వైద్యులు, ఆసుపత్రులు కృషి చేస్తున్నాయి. బీమా పాలసీల వల్ల అనారోగ్యంలో ఆర్థిక సంక్షోభం బారిన పడకుండా కాపాడుతుంటాయి. సమాజంలో మోసం చేసేవారు ఎప్పుడూ ఉంటారు. వారి బారిన పడకుండా.. పూర్తి అవగాహనతో మనల్ని మనం రక్షించుకోవాల్సిందే..

- సంజీవ్‌ ద్వివేదీ, హెడ్‌ (ఇన్వెస్టిగేషన్‌), బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని