న్యాయ నేస్తం

Published : 03/03/2019 01:13 IST
ఆదా కాదు.. ఉండాలి ప్రణాళిక

చేసిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకోవాలి.. ఇది సాధారణ జీవిత సూత్రం. ఆర్థిక విషయాలకూ ఇది వర్తిస్తుంది. కొన్నిసార్లు ఆర్థిక విషయాల్లో చేసే పొరపాట్లు సరిదిద్దుకోలేనివి అవుతుంటాయన్నది వాస్తవం. ఆదాయపు పన్ను చట్టం విధించిన పరిమితికి మించి ఆదాయం ఆర్జించినప్పుడు ప్రతి వ్యక్తీ నిబంధనల మేరకు పన్ను చెల్లించాలి. పన్ను భారం తగ్గించుకునేందుకు చట్టమే అవకాశాలను కల్పించింది. మనం చేయాల్సిందల్లా.. చట్టం ఇచ్చిన అవకాశాన్ని ఎలాంటి పొరపాట్లకు తావీయకుండా ఉపయోగించుకోవడమే.

న్ను ఆదాకు ఉన్న అవకాశాలను.. దీర్ఘకాలంలో మన ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు ఉపయోగించుకోవాలి. నిబంధనలు అనుమతించిన పెట్టుబడి పథకాలకు, కాస్త విజ్ఞతను జోడించి ఎంచుకోవాలి. అప్పుడే అవి ఆర్థికంగా వృద్ధి చెందే క్రమంలో తమవంతు తోడ్పాటును అందిస్తాయి. అందుకే, పన్ను ఆదా కోసం పెట్టుబడి పథకాలను ఎంచుకునేప్పుడు సాధారణంగా చేసే పొరపాట్లు, వాటిని ఎలా సరిదిద్దుకోవాలనే అంశాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అన్నీ ఒకే చోటనా... 
పన్ను ఆదా కోసం పెట్టుబడులు అనగానే అందరికీ వెంటనే స్ఫురించేది సెక్షన్‌ 80సీ. ఇందులో గరిష్ఠంగా రూ.1,50,000 వరకూ మదుపు చేసేందుకు అవకాశం ఉంటుంది. చాలామంది పన్ను చెల్లింపుదారులు ఈ సెక్షన్‌ కింద వచ్చే అన్ని పథకాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. బీమా పాలసీలు, పన్ను ఆదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఈఎల్‌ఎస్‌ఎస్‌, ఎన్‌ఎస్‌సీలు తదితరాలను ఉపయోగించుకుంటారు. ఈపీఎఫ్‌ ఎలాగూ ఉంటుంది.. ఈ సెక్షన్‌ను పూర్తిగా వినియోగించుకోవాలనే తాపత్రయంతో ఇతర పెట్టుబడి పథకాల్లో ఉన్న అవకాశాలను విస్మరించడం చాలామంది చేసే పొరపాటు.

చేయాల్సిందేమిటంటే.. పన్ను ఆదా పెట్టుబడుల్లోనూ వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. సెక్షన్‌ 80సీలో పరిమితికి మించి మదుపు చేయడం సరికాదు. సెక్షన్‌ 80సీసీడీలో భాగంగా జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌)లాంటి వాటినీ పరిశీలించాలి. ఆరోగ్య బీమాకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా దాన్నీ తీసుకోవాలి. దీనికి సెక్షన్‌ 80డీ కింద మినహాయింపు వర్తిస్తుంది.

ప్రస్తుతం మనం 2018-19 ఆర్థిక సంవత్సరం చివరి నెలలో ఉన్నాం. ఇప్పుడు చేయాల్సిందేమిటంటే.. ముందుగా మీ ఆదాయం ఎంతో లెక్క తీయండి. ఇందులో మీరు పెట్టిన పెట్టుబడులేమిటి? వాటికి ఎంత మేరకు మినహాయింపు వర్తిస్తుందో చూసుకోండి. మీ వేతన ఖాతా వివరాలూ, బ్యాంకు ఖాతా, క్రెడిట్‌ కార్డు వివరాలూ సరిచూసుకోండి. వాటిని పరిశీలించడం ద్వారా మీరు పెట్టుబడి పెట్టి, మర్చిపోయినవి ఏమైనా ఉన్నాయేమో తెలుస్తుంది. అందులో పన్ను ఆదాకు పనికొచ్చేవి ఏమైనా ఉన్నాయేమో గమనించండి. గృహరుణం అసలు, పిల్లల ఫీజులు ఇలాంటివన్నీ సెక్షన్‌ 80సీలో భాగమే. ఇవన్నీ మీరు మీ యాజమాన్యానికి సమర్పించారా? మరోసారి సరిచూసుకోండి.

అవగాహన పెంచుకోవాలి.. 
పెట్టుబడి పెట్టేప్పుడు దానికి పన్ను ఆదా వర్తిస్తుందా? అని చాలామంది అడుగుతుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఆయా పథకాల్లో ఉండే నష్టభయాన్ని విస్మరిస్తుంటారు. మీరు పెట్టిన పెట్టుబడికి పన్ను ఆదా అనేది ఒక అదనపు ప్రయోజనంగానే చూడాలి. పెట్టుబడులను ఎంచుకునేప్పుడు వాటిపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. అవి అందించే రాబడి ఎంత?ఎన్నేళ్లు కొనసాగాలి?గతంలో అవి అందించిన రాబడి? ఇలాంటివన్నీ పరిశీలించాలి. పన్ను తగ్గించుకునే లక్ష్యంతో రాబడి విషయంలో రాజీ పడకూడదు.

ఉదాహరణకు ఎన్‌ఎస్‌సీలు, పన్ను ఆదా బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఐదేళ్లు కొనసాగించాలి. పీపీఎఫ్‌ వ్యవధి 15 ఏళ్లు. ప్రస్తుతం పీపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీలపై 8శాతం వడ్డీ రేటు అందుతోంది. ఎన్‌ఎస్‌సీలపై వచ్చే వడ్డీకి పన్ను చెల్లించాలి. వ్యవధి కూడా చాలా తేడా. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 6.85శాతం వరకూ వడ్డీ వస్తోంది. ఇలాంటప్పుడు ఐదేళ్ల పెట్టుబడి పథకం కావాలనుకుంటే.. ఎన్‌ఎస్‌సీలను ఎంచుకోవచ్చు. దీర్ఘకాలం పెట్టుబడి కోసం పీపీఎఫ్‌ను పరిశీలించాలి. పైగా పీపీఎఫ్‌ వడ్డీకి పన్ను మినహాయింపు ఉంటుంది. పెట్టుబడులు పెట్టినప్పుడే కాదు.. వాటి ద్వారా వచ్చిన రాబడికీ పన్ను మినహాయింపు ఉన్నప్పుడే మనకు అధిక లాభం అన్న సంగతి మర్చిపోకూడదు.

నగదు రూపంలో చేయొద్దు.. 
పెట్టుబడి పెట్టడం ఒక్కటే కాదు.. అందులో మదుపు చేసేప్పుడు అందుకు అవసరమైన డబ్బును ఎలా చెల్లించారు అనేదీ ఇక్కడ ముఖ్యమే. కొన్ని పెట్టుబడి పథకాలకు నేరుగా డబ్బు రూపంలో చెల్లించామని చెబితే.. పన్ను ఆదాకు పరిగణనలోనికి తీసుకోరు. ఉదాహరణకు ఆరోగ్య బీమా పాలసీకి చెక్కు, ఆన్‌లైన్‌ ఖాతా, డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా చెల్లించినప్పుడే మినహాయింపు వర్తిస్తుంది. సెక్షన్‌ 80జీ కింద విరాళాలు రూ.10,000 వరకూ మాత్రమే నగదును అనుమతిస్తారు.

ఖర్చులను చూసుకోండి.. 
కొన్ని ఖర్చులకూ పన్ను ఆదా ఉంటుంది. పిల్లల ట్యూషన్‌ ఫీజులు, రూ.5,000 వరకూ ఆరోగ్య పరీక్షలు, కొన్ని తీవ్ర వ్యాధుల చికిత్సకు అయ్యే ఖర్చులు, మొదటిసారి ఇల్లు కొన్నప్పుడు స్టాంపు ఫీజు, రిజిస్ట్రేషన్‌ రుసుము, విరాళాలూ, ఇంటిరుణంపై చెల్లించే వడ్డీ.. ఇలా కొన్నింటికి మినహాయింపులు ఉంటాయి. కాబట్టి, ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు చేసిన అన్ని రకాల ఖర్చులనూ ఒకసారి చూసుకోండి. అందులో ఏవైనా పన్ను ఆదాకు ఉపయోగపడేవి ఉన్నాయా తెలుస్తుంది. దీనివల్ల మీరు అదనంగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం రాదు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని