న్యాయ నేస్తం

Published : 20/01/2019 01:36 IST
సైబర్‌ మోసాలు.. బాధ్యత.. బ్యాంకుదా? మనదా?

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో, ఇంటి నుంచే ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకునే సౌలభ్యం అందరికీ చేరువయ్యింది. డిజిటల్‌ వ్యవహారాలు పెరగడంతో, వాటి ఆధారంగా జరుగుతున్న మోసాలు అధికమవుతున్నాయి. వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి, అక్రమ ఆన్‌లైన్‌ లావాదేవీలతో డబ్బు కాజేస్తున్న సంఘటనలు తరచూ వింటూనే ఉన్నాం. ఫలితంగా చాలామందికి ఆన్‌లైన్‌ అంటేనే భయం పట్టుకుంది. ఖాతాదారులకు ఆన్‌లైన్‌ ఆర్థిక లావాదేవీలపై ఉన్న అనసవర భయాలు పోగొట్టేందుకు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టింది. ఖాతాదారుల నష్టభయాన్ని తగ్గించేందుకూ, మోసపూరిత లావాదేవీల్లో గరిష్ఠ బాధ్యతను పరిమితం చేస్తూ మార్గదర్శకాలు రూపొందించింది. నిర్భయంగా ఆన్‌లైన్‌లో లావాదేవీలు నిర్వహించుకునే భరోసానిచ్చే ఆ వివరాలు తెలుసుకుందాం.

డెబిట్‌, క్రెడిట్‌, ప్రీ పెయిడ్‌ కార్డులూ... ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌.. మొబైల్‌ బ్యాంకింగ్‌.. ఇలా బ్యాంకింగ్‌ స్వరూపం పూర్తిగా మారిపోయిందిప్పుడు. వీటితోపాటే.. ఖాతాదారుల రహస్య సమాచారాన్ని తస్కరించి, వారి ఖాతాలను నిలువు దోపిడీ చేస్తున్న సైబర్‌ నేరగాళ్లూ ఎక్కువ అవుతున్నారు. చాలా సందర్భాల్లో ఖాతాదారులు తాము నష్టపోయినప్పటికీ అటు బ్యాంకులకూ, ఇటు పోలీసులకూ ఫిర్యాదు చేయకుండా మిన్నకుండిపోతున్నారు. ఇలా ఊరుకుంటుండటంతోనే వారు మరింత మందిని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్‌బీఐ ఇటీవల తీసుకొచ్చిన మార్గదర్శకాల్లో మోసపూరిత లావాదేవీల సందర్భంలో బ్యాంకులు, ఖాతాదారుల బాధ్యత ఎంత మేరకు ఉంటుందనే విషయంలో స్పష్టతనిచ్చింది.

పూర్తి భరోసా... 
బ్యాంకుల నిర్లక్ష్యం లేదా లోపం వల్ల అక్రమ లావాదేవీ జరిగితే, ఖాతాదారుడు ఫిర్యాదు చేసినా చెయ్యకపోయినా పూర్తి బాధ్యత బ్యాంకులదే. అలాంటి లావాదేవీల మొత్తాన్ని ఖాతాదారుడు పూర్తిగా తిరిగి పొందవచ్చు. ఖాతాదారుడు ప్రమేయంగానీ, బ్యాంకుల నిర్లక్ష్యంగానీ లేకుండా కేవలం మూడో పార్టీ మోసం లేదా వ్యవస్థాగత లోపం వల్ల జరిగిన అనధీకృత లావాదేవీ విషయాన్ని, ఖాతాదారుడు బ్యాంకు నుంచి సమాచారం వచ్చిన మూడు పనిదినాల్లోగా ఫిర్యాదు చేసిన పక్షంలో ఆ లావాదేవీ మొత్తానికి ఖాతాదారుడి బాధ్యత లేదు. ఈ పూర్తి మొత్తానికి బ్యాంకులు భరోసానిస్తాయి. అక్రమ లావాదేవీల విషయంలో ఖాతాదార్ల ప్రమేయాన్ని రుజువు చేసే బాధ్యత బ్యాంకులపైనే ఉంటుంది.

అప్రమత్తంగా లేకపోతే.. 
ఆన్‌లైన్‌ లావాదేవీలు నిర్వహించేందుకు అవసరమైన వ్యక్తిగత సమాచారాన్ని రహస్యంగా ఉంచుకోవాల్సిన పూర్తి బాధ్యత ఖాతాదారుడిదే. అతని/ఆమె నిర్లక్ష్యం వల్ల లేదా అవగాహనా లోపం వల్ల వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచుకోలేకపోతే.. ఫిర్యాదు చేసే వరకూ జరిగిన లావాదేవీలకు పూర్తి బాధ్యత ఖాతాదారుడిదే. బ్యాంకులు ఆ లావాదేవీలకు సంబంధించిన నష్టాన్ని భరించవు. ఫిర్యాదు చేసిన తర్వాత ఏదైనా అక్రమ లావాదేవీ జరిగితే ఖాతాదారుడికి ఎటువంటి బాధ్యత ఉండదు. ఆ తర్వాత జరిగే లావాదేవీల్లో నష్టపోయిన సొమ్మను తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత బ్యాంకులదే.

ఆలస్యం చేయొద్దు...

ఖాతాలో అనధీకృత, మోసపూరిత లావాదేవీ జరిగిందని గుర్తించిన తక్షణమే సంబంధిత బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి. ఆలస్యం చేస్తే మరింత నష్టపోయే ప్రమాదం ఉంది. అక్రమ లావాదేవీ జరిగిన వెంటనే ఖాతాను స్తంభింప చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి.  
మీరు చేయని వ్యవహారానికి సంబంధించి 4 నుంచి 7 పనిదినాల్లోగా ఫిర్యాదు చేసినప్పుడు ఖాతా రకాన్ని అనుసరించి ఖాతాదారుడికి ఈ కింద పేర్కొన్న విధంగా పరిమిత బాధ్యత ఉంటుంది. ఆ పైబడిన మొత్తాన్ని ఖాతాదారుడు తిరిగి  
పొందవచ్చు. 
ప్రాథమిక పొదుపు ఖాతాలు:  రూ.5,000  
అన్ని ఇతర పొదుపు ఖాతాలు/ప్రీపెయిడ్‌ చెల్లింపు పత్రాలు/గిఫ్ట్‌ కార్డులు, ఎంఎస్‌ఎంఈల కరెంట్‌, క్యాష్‌-క్రెడిట్‌, ఓవర్‌డ్రాఫ్ట్‌ ఖాతాలు/ వ్యక్తుల వార్షిక సగటు బ్యాలెన్సు (మోసం జరగడానికిఇ ముందు 365 రోజులలో) పరిమితి రూ.25లక్షల వరకూ ఉన్న కరెంట్‌ ఖాతాలు, క్యాష్‌ క్రెడిట్‌, ఓవర్‌ డ్రాఫ్ట్‌ ఖాతాలు/ రూ.5లక్షల వరకూ పరిమితి ఉన్న క్రెడిట్‌ కార్డులు:  రూ.10,000 వరకూ  
అన్ని ఇతర కరెంట్‌/క్యాష్‌-క్రెడిట్‌/ఓవర్‌ డ్రాఫ్ట్‌ ఖాతాలు: రూ.25,0000 వరకూ 
అక్రమ లావాదేవీ జరిగిన 7 రోజుల తర్వాత ఫిర్యాదు చేస్తే, ఆయా బ్యాంకుల బోర్డు ఆమోదం పొందిన విధాన నిర్ణయం ప్రకారం ఖాతాదారుడి బాధ్యత ఎంత అనేది నిర్ణయిస్తారు. ఫిర్యాదు ఎన్ని రోజుల్లో చేశారనది నిర్ధరించడానికి ఖాతా ఉన్న శాఖ పని దినాల్ని, ఫిర్యాదు తేదీ, సమయాన్ని పరిగణనలోనికి తీసుకుంటారు. రోజుల్ని లెక్కించేప్పుడు, ఫిర్యాదు చేసిన రోజును మినహాయిస్తారు. 

పరిష్కారం ఎలా? 
ఖాతాదారుడి ఫిర్యాదు అందిన 10 పని దినాల్లోపు, బీమా క్లెయిం పరిష్కారంతో సంబంధం లేకుండా అక్రమ డిజిటల్‌ లావాదేవీల నిబంధనల మేరకు పరిహారానికి అర్హత ఉన్న మొత్తాన్ని ఖాతాదారుడు పొందవచ్చు. అక్రమ లావాదేవీ జరిగిన తేదీ నాటికి, అదే తేదీతో, అంతే విలువ మొత్తాన్ని ఖాతాదారునికి బ్యాంకులు జమ చేయాలి. 
ఖాతాదారుడు నిర్లక్ష్యంగా ఉన్న సందర్భాల్లో కూడా బ్యాంకులు తమ విచక్షణతో ఏ ఖాతాదారు బాధ్యతనైనా పూర్తిగా రద్దు చేసి, లావాదేవీ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయవచ్చు. 
బ్యాంకు బోర్డు ఆమోదిత విధానాన్ని అనుసరించి, ఫిర్యాదు అందుకున్న తేదీ నుంచి 90 రోజులు మించకుండా ఫిర్యాదు పరిష్కారం అయ్యేట్టు చూడాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంది. ఏ కారణంతోనైనా 90 రోజుల్లో ఫిర్యాదు పరిష్కరించలేకపోతే, ఖాతాదారుడికి వడ్డీ రూపంలో ఎలాంటి నష్టం రాకుండా బ్యాంకులు చర్యలు తీసుకోవాలి.

బ్యాంకులు ఏం చేయాలి? 
ఆన్‌లైన్‌ లావాదేవీలకు అధిక రక్షణ కల్పించేందుకు రిజర్వు బ్యాంకు బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 
బ్యాంకులు తమ ఖాతాదారులకు డిజిటల్‌ లావాదేవీల్లో జరిగే మోసాలపై ఖాతాదారులకు అవగాహన 
కల్పించాలి. 
లావాదేవీ జరిగిన ప్రతిసారీ ఖాతాదారుడి మొబైల్‌ నెంబరుకు సంక్షిప్త సందేశం కోసం నమోదు చేసుకునేలా ఖాతాదారుల్ని ప్రోత్సహించాలి. అవసరమైన వివరాలను ఈమెయిల్‌ ద్వారా పంపించాలి. 
డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల్లాంటివి పోగొట్టుకున్నామనీ, లేదా అక్రమ లావాదేవీ గురించి ఫిర్యాదు చేయడానికి అవసరమైన సౌలభ్యం ఉండాలి. అది ఖాతాదారులకు 24 గంటలూ అందుబాటులోకి రావాలి. 
అక్రమ లావాదేవీల ఫిర్యాదులు నమోదు చేయడానికి, వెబ్‌సైట్లలో ఒక ప్రత్యేక ప్రత్యక్ష లింకు స్పష్టంగా కనిపించాలి. 
ఖాతాదారుడి బాధ్యతను అంచనా వేసేందుకు వీలుగా ఫిర్యాదు అందిన సమయాన్ని నమోదు చేయాలి. నమోదైన ఫిర్యాదు సంఖ్యతోపాటు తక్షణ ప్రతిస్పందనను ఖాతాదారులకు పంపే ఏర్పాటు ఉండాలి. 
అనధికారిక లావాదేవీల నివారణ కోసం పటిష్టమైన, క్రియాశీలకమైన యంత్రాగాన్ని ఏర్పాటు చేయాలి.

డిజిటల్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ బలోపేతం కావాలంటే మోసపూరిత లావాదేవీలను అడ్డుకునేందుకు బ్యాంకులు నిరంతరం పటిష్ఠమైన రక్షణ చర్యలు తీసుకోవాలి. ఖాతాదారులు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తే, డిజిటల్‌ లావాదేవీలను సురక్షితంగా నిర్వహించుకోవచ్చు.

ఈ జాగ్రత్తలు తీసుకోండి..

లావాదేవీలకు సంబంధించిన అన్ని సంక్షిప్త సందేశాలు మీ బ్యాంకు ఖాతాలో నమోదైన మొబైల్‌కు వచ్చేలా చూసుకోండి.  
అపరిచిత వ్యక్తులు మీకు ఫోన్‌ చేసి, డెబిట్‌/క్రెడిట్‌ కార్డు నెంబరు, సీవీవీ, పాస్‌వర్డ్‌, ఓటీపీ, మొబైల్‌ సిమ్‌ నెంబరు వంటివి అడుగుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీరికి సమాధానం ఇవ్వొద్దు.  
తరచూ మీ ఏటీఎం/మొబైల్‌ బ్యాంకింగ్‌/ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌లు మార్చేయాలి. 
తక్షణమే ఫిర్యాదు చేయడానికి వీలుగా, మీ ఖాతా ఉన్న బ్యాంకు టోల్‌ ఫ్రీ నెంబరు, వెబ్‌సైటు తదితర వివరాలు అందుబాటులో ఉంచుకోండి. 
మీ డెబిట్‌, క్రెడిట్‌ కార్డు వివరాలు, ఇంట‌ర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌ల వంటి వ్యక్తిగత సమాచారం అందరికీ అందుబాటులో ఉండేలా పెట్టకండి. ముఖ్యంగా కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లలో భద్రపర్చడం ప్రమాదకరం. 
హోటళ్లు, పెట్రోలు బంకుల్లో లావాదేవీలు నిర్వహించేప్పుడు, మీరే స్వయంగా పిన్‌ నమోదు చేయండి. 
సామాజిక మాధ్యమాల్లో మీ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే సమాచారాన్ని తెలియచేయవద్దు. 
ఉచిత వైఫై కేంద్రాల్లోనూ, నెట్‌ సెంటర్లలోనూ, ఆన్‌లైన్‌ ఆర్థిక లావాదేవీలు నిర్వహించవద్దు. మీ స్మార్ట్‌ఫోన్‌కు తప్పనిసరిగా పాస్‌వర్డ్‌  
ఉండాలి. 
మోసపూరిత లావాదేవీ జరిగినట్లు భావిస్తే, వెంట‌నే ఫిర్యాదు నమోదు చేయడంతోపాటు మీ ఖాతాను స్తంభింప చేయండి.


 

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని