న్యాయ నేస్తం

Published : 07/07/2019 00:36 IST
నెట్టింట మునగొద్దు!

తాళాలు పగలగొట్టి.. ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు.. ఒకప్పుడు బాగా వినిపించే మాట ఇది. ఆధునిక కాలంలో ఇది తగ్గిపోయింది.. దొంగలు మోసగాళ్ల అవతారం ఎత్తారు. ఆధునిక  సాంకేతికత.. మన బలహీనతలే వారికి ఆయుధాలుగా మారాయి. ఇటీవల కాలంలో డబ్బు  నష్టపోయిన ఎంతో మంది ఇలాంటి మోసగాళ్ల బారినపడ్డవారే.. ఆధునిక మోసాలు ఎలా జరుగుతున్నాయి.. వాటి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి? మన డబ్బును ఎలా కాపాడుకోవాలి? తెలుసుకుందాం...

మోసపోతున్న వారున్నంత వరకూ మోసం చేసేవారు ఉంటూనే ఉంటారు. రోజుకో కొత్త తరహా మోసం గురించి వింటూనే ఉన్నా.. ఏమో.. అది నిజమేమో అనుకుంటూ.. చాలామంది మోసగాళ్ల వలలకు చిక్కుతున్నారు. మనం చేసే చిన్న పొరపాట్లే.. పెద్ద కష్టాలకు కారణమవుతుంటాయి.

ఫ్యాన్సీ నెంబర్ల మోజులో..

మోసం తీరు..: సైబర్‌ నేరగాళ్లు గతంలో బ్యాంకు అధికారుల పేరుతో ఖాతాదారులకు ఫోన్లు చేసి డెబిట్‌కార్డు, పిన్‌, సీవీవీ సంఖ్యలను తెలుసుకునేవారు. అనంతరం ఖాళీ డెబిట్‌ కార్డులను కార్డు రీడర్‌లో రీడ్‌ చేసి అసలైన ఖాతాదారుల వివరాలతో నకిలీ డెబిట్‌కార్డు సృష్టించేవారు. ఈ క్లోనింగ్‌ ప్రక్రియను నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. తొలుత కొన్ని ఈ-కామర్స్‌, టికెట్‌ బుకింగ్‌లాంటి సైట్లు, యాప్‌లలోకి వెళ్లి బ్యాంకు ఖాతాదారుల నెంబర్లను నాటకీయంగా కనిపెడుతున్నారు. సాధారణంగా కొన్ని బ్యాంకుల డెబిట్‌కార్డులకు గల 16 అంకెల్లోని తొలి 6 అంకెలు(బ్యాంకు ఐడెంటిఫికేషన్‌ నంబరు) ఏకరీతిలో ఉండటంతో మిగిలిన పది అంకెలను అంచనా కొద్దీ నమోదు చేస్తున్నారు. ఒకవేళ 16 అంకెలు సరిగ్గా నమోదు చేస్తే సదరు యాప్‌లో చెల్లింపుల ప్రక్రియకు దారితీస్తుంది. అలా జరిగితే ఆ సంఖ్య ఓ డెబిట్‌కార్డు ఖాతాదారుడిగా గుర్తిస్తారు. తర్వాత ఏకంగా బ్యాంకుల కాల్‌సెంటర్లకు ఫోను చేస్తున్నారు. ఆ సమయంలో డెబిట్‌కార్డు నంబరుతోపాటు పిన్‌ నంబరు నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పటికే డెబిట్‌కార్డు నంబరు తెలిసి ఉండటంతో నేరగాళ్లు నాలుగు అంకెలను అలా ర్యాండమ్‌గా నమోదు చేస్తున్నారు. ఉదాహరణకు 1234, 0000, 1122, 9999.. తరహా ఫ్యాన్సీ నంబర్లనే ఎక్కువ మంది ఖాతాదారులు తమ పిన్‌గా నమోదు చేసుకొని ఉంటుండటంతో అలాంటి సంఖ్యలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. పలు విడతల ప్రయత్నాల అనంతరం ఆ అంకెలు కలిసిపోతే చాలు కాల్‌ సెంటర్‌కు కనెక్ట్‌ అవుతుంది. అలా బాధితుడి ఖాతాలో ఉన్న నగదు నిల్వను తెలుసుకుంటున్నారు. అనంతరం క్లోనింగ్‌ ప్రక్రియ ద్వారా బాధితుడి డెబిట్‌ కార్డు నంబరు, పిన్‌ వివరాలతో నకిలీ కార్డుల్ని సృష్టిస్తున్నారు. అనంతరం ఏటీఎంల్లో డెబిట్‌ కార్డుల ద్వారా నగదును ఉపసంహరిస్తున్నారు. తాజాగా జార్ఖండ్‌ రాష్ట్రం జాంతారా జిల్లాకు చెందిన సైబర్‌ నేరగాళ్ల ముఠా రూ.3కోట్లను ఓ ప్రముఖ ప్రైవేటు బ్యాంకు ఖాతాల నుంచి కొట్టేసింది. కేవలం 3 వేల కార్డుల వివరాలు తెలుసుకునేందుకు 3లక్షల సార్లు ప్రయత్నించిందా ముఠా. 

జాగ్రత్త ఇలా..: డెబిట్‌ కార్డులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాన్సీ సంఖ్యలను పిన్‌గా పెట్టుకోవద్దు. వాహనం నంబర్లను, పుట్టిన తేదీలనూ వాడకూడదు. అలాగే పిన్‌నూ తరచూ మార్చుకోవాలి. అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే వెంటనే బ్యాంకుకు ఫిర్యాదు చేయండి.

యాప్‌లతో జాగ్రత్త...

మోసం తీరు ఇది..: ప్రస్తుత ఆన్‌లైన్‌ శకంలో ఎక్కువ శాతం బ్యాంకు లావాదేవీలు మొబైల్‌ యాప్‌ల ద్వారానే జరిగిపోతున్నాయి. బ్యాంకులకు వెళ్లి గంటల తరబడి క్యూ కట్టే అవస్థలను ఈ సదుపాయం తప్పించింది. కానీ సైబర్‌ నేరగాళ్లు మాత్రం ఈ సదుపాయాన్ని తమ మోసాలకు అనువుగా మలుచుకుంటున్నారు. ఆయా బ్యాంకు లావాదేవీల్ని అత్యంత సులభంగా పూర్తి చేసేందుకు ఒకే యాప్‌ ఉపకరిస్తుందని, దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలని బ్యాంకు అధికారుల పేరుతో ఖాతాదారులకు ఫోన్లు చేస్తున్నారు. లేదంటే సంక్షిప్త సందేశాలు పంపిస్తున్నారు. దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలని మోసగాళ్లు సూచిస్తుండటంతో బాధితులు నమ్మేస్తున్నారు. ఒకసారి గనక ఆ యాప్‌ను చరవాణిలో నిక్షిప్తం చేసుకునేందుకు ఖాతాదారు ఒప్పుకుంటే నిండా మునిగినట్లే. అలా యాప్‌ను నిక్షిప్తం చేసుకునే సమయంలో నేరగాళ్లు తొమ్మిది అంకెల సంఖ్యను ఖాతాదారుడికి సంక్షిప్త సందేశం(ఎన్‌క్రిప్షన్‌) రూపంలో పంపిస్తున్నారు. నేరగాళ్లు సూచించిన విధంగా ఆ నంబరును చరవాణిలో నమోదు చేసిన వెంటనే చరవాణి వశం తప్పిపోతుంది. రిమోట్‌ కంట్రోల్‌ అంతా నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతోంది. ఒకరకంగా బ్యాంకు లావాదేవీల వ్యవహారాన్ని సదరు నేరస్థుడికి అప్పగించేందుకు చేజేతులా అంగీకరించినట్లే. అనంతరం చరవాణి ద్వారా ఆన్‌లైన్‌లో బ్యాంకు లావాదేవీలు నేరస్థులకు ఎప్పటికప్పుడు తెలిసిపోతాయి. అలా యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, ఓటీపీ అన్నీ నేరగాళ్లకు ఇట్టే తెలిసిపోతాయి కాబట్టి ఖాతాలో ఉన్న డబ్బులను సాంతం కొట్టేస్తారు.

జాగ్రత్త ఇలా..:  బ్యాంకు అధికారుల మాదిరిగా ఫోన్‌ చేసి ఖాతా వివరాల్ని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దు. అసలు బ్యాంకు అధికారులెవరూ ఇలా ఫోన్లు చేసి వివరాలు అడగరు అని గుర్తుంచుకోవాలి. అలాగే ‘ఎనీ డెస్క్‌’ యాప్‌ అత్యంత ప్రమాదకారి అని మరిచిపోవద్దు.

నైజీరియన్ల మ్యాట్రి‘మనీ’ మోసాలు

మోసం తీరు ఇది..: అసలు సైబర్‌ నేరాలు అంటే మొదలుపెట్టిందే నైజీరియన్లు. తొలినాళ్లలో వీరి మోసాలను ‘411 ఫ్రాడ్స్‌’గా వ్యవహరించేవారు. ప్రస్తుతం ఉత్తరాది ముఠాల నుంచి సైబర్‌ మోసాల్లో వీరికి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈనేపథ్యంలో నైజీరియన్‌ నేరగాళ్లు పంథా మార్చారు. ఎక్కువగా మాట్రిమోనీ మోసాలకు ఎంచుకుంటున్నారు. ప్రముఖ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో పేర్లు నమోదు చేసుకొన్న వధువులకు వలేస్తున్నారు. వెబ్‌సైట్‌లలో తమ పేర్లు నమోదు చేసుకుంటూ వధువుల వివరాల్ని తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా అప్పటికే విడాకులు పొంది రెండో పెళ్లి కోసం ఎదురు చూస్తున్న మహిళల్ని లక్ష్యంగా చేసుకొంటున్నారు. తమను తాము విదేశాల్లో ప్రముఖ వైద్యులుగా లేదంటే పారిశ్రామికవేత్తలుగా పరిచయం పెంచుకుంటున్నారు. మాయమాటలతో నమ్మకం కలిగించిన తర్వాత తన ప్రతినిధిని హైదరాబాద్‌ పంపుతున్నామని చెబుతున్నారు. ఎలాగూ కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాం కాబట్టి విలువైన ఆభరణాల్ని, వజ్రాల్ని, బహుమతులతో కూడిన గిఫ్ట్‌ప్యాక్‌ను ఫలానా రోజు పంపిస్తున్నానని ఎర వేస్తున్నారు. సరిగ్గా ఆ ఫలానా రోజే దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్‌ అధికారి పేరుతో బాధితురాలికి ఫోన్‌ వస్తోంది. ఖరీదైన గిఫ్ట్‌ప్యాక్‌ తీసుకొచ్చిన విదేశీయుడు కస్టమ్స్‌ తనిఖీల్లో పట్టుకున్నామని చెబుతున్నారు. విదేశీ మారక పన్ను కడితే అతడితోపాటు గిఫ్ట్‌ప్యాక్‌ను పంపిస్తామనేది ఫోన్‌కాల్‌ సారాంశం. మరికొద్ది సేపట్లో లక్షల డాలర్ల విలువైన గిఫ్ట్‌ప్యాక్‌ తమ సొంతం అవుతుందనే భ్రమలో ఉన్న బాధితురాలు.. నేరగాళ్లు అడిగిన మొత్తాన్ని వారు సూచించిన ఖాతకు బదిలీ చేసేస్తోంది. అలా మొదలయ్యే బురిడీ పర్వం యాంటీ టెర్రరిస్ట్‌ ఫండ్‌, ఆర్‌బీఐ సుంకం, జీఎస్టీ.. ఇలా వీలైన రకాల పన్నుల పేరుతో బాధితురాలిని పీల్చి పిప్పి చేసే వరకు కొనసాగుతోంది. తర్వాత షరామామూలుగానే ముఠాసభ్యుల సెల్‌ఫోన్లు స్విచ్‌ఆఫ్‌ అయిపోతున్నాయి.

జాగ్రత్తలు ఇలా..:  పెళ్లి సంబంధాల విషయంలో ప్రత్యక్షంగా చూసిన తర్వాతే సంప్రదింపులు జరపడం ఉత్తమం. ఒకవేళ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నా.. సుంకాల పేరుతో బ్యాంకులో డబ్బు జమ చేయాలని ఏ కోశానా డిమాండ్‌ చేయరు. అలా చేశారంటే వంద శాతం సైబర్‌ నేరస్థుల పనే అని గ్రహించాలి.

‘ఈ-కామర్స్‌’ బురిడీ

మోసం తీరు ఇది:  ప్రస్తుతం ఎక్కువగా జరుగుతున్న సైబర్‌ మోసాలివి. సాధారణంగా పాత వస్తువులను అమ్మేందుకు, కొనేందుకు ఇప్పుడు చాలా వేదికలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని వినియోగించుకునే వారి సంఖ్యా బాగా పెరిగింది. సరిగ్గా ఈ అవసరాన్నే సైబర్‌ నేరగాళ్లు తమకు అనువుగా మలుచుకుంటున్నారు. ఖరీదైన కార్లను తక్కువ ధరకే విక్రయిస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో కీలక స్థానాల్లో ఉన్న తమకు అత్యవసరంగా వేరే ప్రాంతానికి బదిలీ కావడం వల్లే తక్కువకు అమ్మేస్తున్నామంటూ పేర్కొంటూ అందినకాడికి దోచుకుంటున్నారు. చాలా రోజుల నుంచి ఈ తరహా మోసాలపై ప్రచారం జరగడంతో నేరగాళ్లు నయా ఎత్తుగడల్ని అనుసరిస్తున్నారు. బాధితుల్ని సులభంగా నమ్మించేందుకు బీఎండబ్ల్యూ లాంటి ఖరీదైన కార్ల ఫొటోలే కాకుండా సంబంధిత పత్రాల్ని, కేంద్ర ప్రభుత్వ సంస్థ అధికారిగా తెలిపే గుర్తింపుకార్డుల ఫొటోల్ని ఆయా ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నారు. అయితే ఇవన్నీ నకిలీవని తెలియని బాధితులు నేరగాళ్ల బుట్టలో సులభంగా పడిపోతున్నారు. ఒకవేళ బాధితులు తమ గాలానికి చిక్కితే నేరగాళ్లు చకచకా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. కొంత ధరావత్తు చెల్లిస్తే కారును నేరుగా ఇంటికే పంపిస్తామని నమ్మబలుకుతున్నారు. అలా వీలైనంత మేరకు దండుకొని ఫోన్‌నంబరు స్విచ్‌ఆఫ్‌ చేస్తున్నారు. దాదాపు 5వేలకు మందికి పైగా ఈ తరహా మెసాలకు బాధితులు అయ్యారు. 

జాగ్రత్త ఇలా:  మోసగాళ్లయితే సాధారణంగానే ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలో ఊరించే స్థాయిలో ప్రకటనలను ఉంచుతుంటారు. వాటిని చూసి వస్తువు అందకముందే డబ్బు చెల్లించడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. పేరు మోసిన ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ నిర్వాహకులైతే వస్తువు వినియోగదారుడికి చేరిన తర్వాతే డబ్బు చెల్లించే వెసులుబాటు కల్పిస్తారని గుర్తుంచుకోవాలి.

- ఎం.సత్యం, ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని