న్యాయ నేస్తం

Published : 04/12/2020 01:21 IST
ఆశ పడ్డారో.. మోసపోతారు

కరోనా రాకతో ఇల్లే ఒక ప్రపంచంగా మారిపోయింది. కాలు కదపకుండానే అన్ని పనులూ చక్కబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బ్యాంకులకు వెళ్లడం తగ్గించారు. ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు అలవాటుపడ్డారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే కరోనా మాటున సైబర్‌ మోసాలు చేసేవారు సరికొత్త పద్ధతులను ఆశ్రయిస్తూ.. వినియోగదార్లను సులువుగా మోసం చేస్తున్నారు. అధిక వడ్డీ ఆశ కల్పించడమో.. లేదంటే లాటరీ తగిలింది మీరే అదృష్టవంతులని ఊరించడమో.. ఉచితంగా వైద్య సేవలందిస్తామని చెప్పడమో.. పద్ధతేదైనా.. ఒకసారి అందులో చిక్కారా.. మీ డబ్బులకు రెక్కలు వచ్చినట్లే..

ఉచిత మెడికల్‌ టెస్టులు..
కరోనా నేపథ్యంలో ఉచిత మెడికల్‌ టెస్టులు చేస్తామంటూ ఈ మధ్య మోసం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం తరఫు లేదా, ఆరోగ్యకార్యకర్తల తరఫు ప్రతినిధులమంటూ చెప్పుకొని నకిలీ ఆఫర్లు, ఉచిత సేవల పేరిట మోసాలకు పాల్పడ్డారు. కరోనా పేరుతో విరాళాలూ సేకరించి.. ఎటువంటి సేవలు చేయకుండా వాటిని మింగేసినట్లు పలు  ఉదంతాలు కనిపించాయి.
ఏం చేయాలి: ఏ ఉచిత టెస్టులైనా,  సేవలైనా నమోదిత ఎన్‌జీఓ లేదా సంస్థ చేస్తేనే ముందడుగు వేయాలి. ఊరూ పేరు తెలియని సంస్థ, వ్యక్తులు మీ దగ్గరకు వచ్చినపుడు రెండో మాటకు తావులేకుండా తోసిపుచ్చడమే మేలు.
భారీ తగ్గింపులు..
ఆన్‌లైన్‌ స్టోర్లలో బ్రాండెడ్‌ వస్తువులను భారీ తగ్గింపుతో ఇస్తున్నట్లు ప్రకటన ఇస్తారు. ఆ ధరలను చూసి మోసపోయి డబ్బులు కట్టామా.. కొన్న వస్తువులు రావు. మీ డబ్బులు వెనక్కి తిరిగిరావు. ఇలా పలువురు వినియోగదార్లు డబ్బులు కట్టి మోసపోవద్దని.. వాటికి బాధ్యత వహించలేమని బ్యాంకులు జాగ్రత్తలు చెబుతున్నాయి.
ఏం చేయాలంటే: ఆన్‌లైన్‌ స్టోర్‌లో ఆఫర్లు సహజమే. కానీ అవి నిజమైన వెబ్‌సైట్లా లేక నకిలీ వెబ్‌సైట్లా అనేది చెక్‌ చేసుకుని మరీ.. షాపింగ్‌ చేయాలి.
కేంద్ర పథకాల పేరుతోనూ..
ప్రధాన మంత్రి ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలు, పథకాలు, రుణ మారటోరియం, వడ్డీ మాఫీ పేరుతోనూ సైబర్‌ మోసగాళ్లు వల పన్నుతున్నారు. ఫలానా పథకంలో మీరు దరఖాస్తు చేశారు కదా అంటూ మొదలుపెట్టి.. మీతో ఎంతో కొంత  కట్టించుకోవడమో లేదంటే బ్యాంకు వివరాలు పొంది ఖాతాలో డబ్బులు కొట్టేయడమో చూస్తారు.

ఏం చేయాలి: ఏ ప్రభుత్వ పథకానికి సంబంధించి ఎవరూ మిమ్మల్ని నేరుగా సంప్రదించరు. పథకానికి సంబంధించి ఇపుడు నేరుగా నగదు బదిలీ ఉండడం గుర్తుంచుకోవాలి. ఏదైనా అనుమానం వస్తే వెంటనే ఆయా ప్రభుత్వ శాఖలు, కార్యాలయాల వద్దకు వెళ్లి అధికారులతో ఈ విషయాన్ని ధ్రువీకరించుకోండి.
అధిక వడ్డీలు
మీ మొబైల్‌కు మెసేజ్‌ వస్తుంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్లు పెరిగాయి. ఏ బ్యాంకు ఇవ్వనంత వడ్డీ రేటు మేమిస్తాం అంటూ. మీరిచ్చే డబ్బులను వివిధ  పెట్టుబడుల్లో పెడతాం. మీకు కావలిసినంత వడ్డీ ఇస్తామని ఊరిస్తారు. కింది లింక్‌ క్లిక్‌ చేసి వివరాలు నింపితే చాలంటారు. అలా మీ బ్యాంకు వివరాలు రాబట్టుకోవడమో లేదా డబ్బులు డిపాజిట్‌ చేయించుకోవడమో చేస్తారు. మళ్లీ కనిపించరు.
ఏం చేయాలి: మెసేజ్‌లలో వచ్చే లింక్‌లను ఎప్పుడూ ఓపెన్‌ చేయకూడదు. ఎందుకంటే ఒరిజినల్‌ సంస్థ/బ్యాంకులను పోలిన వెబ్‌సైట్లలోకి మిమ్మల్ని అవి తీసుకెళతాయి. మీరు నమోదు చేసే లాగిన్‌, పాస్‌వర్డ్‌ల ద్వారా మీ ఖాతాలోని డబ్బులను సైబర్‌ నేరగాళ్లు ఖాళీ చేస్తారు. ఎపుడైనా బ్యాంకు వెబ్‌సైట్‌ను విడిగా ఓపెన్‌ చేసే ఏ లావాదేవీలైనా నిర్వహించాలి.
లాటరీ తగిలిందా?
‘మీకు లాటరీ తగిలింది. అయితే ముందస్తుగా  రిజిస్ట్రేషన్‌ ఖర్చులకు కొంత మొత్తాన్ని చెల్లించాలంటూ’ ఫోన్‌లు వస్తాయి. ఇంకేముంది అంత పెద్ద మొత్తానికి ఆ మాత్రం ఖర్చులుంటాయని కట్టేస్తాం. ఇలా ఎక్కువ మంది వద్ద చిన్న మొత్తాలను కొట్టేసి.. అతిపెద్ద మోసాలకు పాల్పడే వారు ఉన్నారు.
ఏం చేయాలి: లాటరీ మీకు తెలియకుండానే ఎలా వస్తుందనేది మీరు ఆలోచించాలి. మీ మొబైల్‌ నంబరు కూడా తెలియకుండా.. మీకు మెసెజ్‌ ఎలా పంపారో ఆలోచించాలి. వారి దగ్గరున్న అన్ని మొబైళ్లకూ ఒకే మెసేజ్‌ పంపి మోసానికి పాల్పడాలన్నదే వారి ఉద్దేశం. కాబట్టి ఆశకు వెళ్లకుండా..కాస్త ఎక్కువ సేపు వారితో మాట్లాడి చూడండి. వెంటనే కాల్‌ కట్‌ చేస్తారు.

-బెజవాడ వెంకటేశ్వర్లు
 

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని