న్యాయ నేస్తం

Published : 13/11/2020 11:45 IST
నమ్మిస్తారు... ముంచేస్తారు..

మోసాల పంథా మారింది. గోడలకు కన్నాలేసి దోచుకునే పద్ధతి కనుమరుగైపోతోంది. ఇప్పుడంతా ఆన్‌లైన్‌ నేరాలే. మన వివరాలు మన నుంచే రాబట్టి మన డబ్బు కొల్లగొట్టడంలో నేరస్థులు ఆరి తేరారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఖాతా ఖాళీ అయిపోతోంది. భవిష్యత్తులో ఈ తరహా నేరాలు మరింతగా పెరుగుతాయని స్వయానా పోలీసులే స్పష్టం చేస్తున్న నేపథ్యంలో స్వీయ జాగ్రత్తలే శ్రీరామ రక్షగా మారాయని చెప్పక తప్పదు. ఇటీవలికాలంలో సైబర్‌ మోసాలు తరచూ ఎలా జరుగుతున్నాయి..? వాటి బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి..? అనేవి తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశాలు..

అపరిచితులతో జాగ్రత్త.. 
మీరు ఫేస్‌బుక్‌ ఖాతాదారులా..? అయితే ఈ జాగ్రత్తల గురించి తెలుసుకోవాల్సిందే. మీకు ఓ పోలీస్‌ అధికారి లేదా మరో ఉన్నతాధికారి నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ రావచ్చు. వారు ముందే మీకు స్నేహితులై ఉండొచ్చు. రిక్వెస్ట్‌ను ఆమోదిస్తే వెంటనే ‘హాయ్‌..’ ‘హలో..’ అంటూ చాటింగ్‌ మొదలు కావచ్చు. సహజంగానే మీరు స్పందిస్తారు కదా. అలా ఒకట్రెండు సంభాషణల తర్వాత అవతలి వ్యక్తి వెంటనే ‘అర్జంట్‌ ఐ నీడ్‌ సమ్‌ మనీ’ అని మెసేజ్‌ పంపొచ్చు. ‘ప్లీజ్‌ సెండ్‌ దిస్‌ గూగుల్‌పే నంబర్‌’ అంటూ నంబరు పంపించొచ్చు. తెలిసిన వ్యక్తే కదా అని వెంటనే మీరు డబ్బు పంపిస్తే ఉచ్చులో ఇరుక్కున్నట్లే. దేశవ్యాప్తంగా దాదాపు 300 మంది పోలీస్‌ అధికారుల పేరుతో ఫేస్‌బుక్‌ నకిలీ ఖాతాలు తెరిచి ఇలాగే డబ్బు   కొల్లగొట్టారు.

ఏం చేయాలి..? : మీకు తెలిసిన వ్యక్తి నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వస్తే యాక్సెప్ట్‌ చేయడం వరకు ఫర్వాలేదు. అంతేకానీ చాటింగ్‌ ద్వారా డబ్బు అడుగుతున్నాడంటే మాత్రం అనుమానించాల్సిందే. వెంటనే ఆ వ్యక్తి చరవాణికి ఫోన్‌ చేస్తే చాలు నేరస్థుల ఎత్తుగడకు ఫుల్‌స్టాప్‌ పెట్టి డబ్బు పోగొట్టుకోకుండా జాగ్రత్త పడొచ్చు. అలాగే మీ ఫేస్‌బుక్‌ ఖాతాలో ప్రైవసీ సెట్టింగ్‌లోకి వెళ్లి ఫేస్‌బుక్‌ ఖాతాలోని వారు తప్ప అపరిచితులు చూడకుండా ఉండే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

అప్రమత్తంగా ఉండాల్సిందే..
యాప్‌లను చరవాణిలోకి నిక్షిప్తం చేసుకునేటప్పుడు ప్లే స్టోర్‌ను మాత్రమే వినియోగించాలి. ఉచితంగా యాప్‌లను నిక్షిప్తం చేసుకోవాలంటూ వచ్చే లింక్‌ల్ని ఎట్టి  పరిస్థితుల్లోనూ క్లిక్‌ చేయొద్దు. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ లావాదేవీల సమయంలో  సాధారణ కీబోర్డును కాకుండా ‘వర్చువల్‌ కీ బోర్డు’నే వినియోగించాలి. ఈ కీబోర్డుపై సంఖ్యలు, అక్షరాలు వినియోగించిన ప్రతీసారి మారుతాయి కాబట్టి.. అవతలి వైపు నుంచి సైబర్‌ నేరగాళ్లు ఏ అక్షరాల్ని, అంకెల్ని నమోదు చేస్తున్నామో గుర్తించలేరు. అవసరం ఉన్నా, లేకున్నా యాప్‌లను నిక్షిప్తం చేసుకోరాదు. ఏదైనా అవసరంపై యాప్‌ను నిక్షిప్తం చేస్తే పని అయిపోయిన తర్వాత వెంటనే డిలీట్‌ చేయాలి.

మాల్‌వేర్‌ మంత్రం..
స్మార్ట్‌ఫోన్‌ ఉందంటే అందులో ఏవో యాప్‌లు ఉండాల్సిందే. యాప్‌లు లేకుంటే చరవాణి ద్వారా ఏ పనీ ముందుకు కదలని పరిస్థితి సహజమే. అందుకే బ్యాంకింగ్‌ రంగం నుంచి మొదలుకొని పలు సంస్థలు తమ సేవల్ని విస్తరించేందుకు యాప్‌లను రూపొందించి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నాయి. అయితే ‘ఎంత చెట్టుకు అంత గాలి’ చందంగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించే చోటే సైబర్‌ నేరాలకు అవకాశం ఏర్పడుతోంది. మొబైల్‌ యాప్‌ల ద్వారానే బ్యాంకింగ్‌ లావాదేవీలు నిర్వహించే వినియోగదారుల చరవాణిలోకి సైబర్‌ నేరగాళ్లు చొరబడుతున్నారు. యాప్‌ల మాటున మాలీషియస్‌ సాఫ్ట్‌వేర్లను, మాల్‌వేర్లను చరవాణిల్లోకి చొప్పించి నేరాలకు తెర లేపుతున్నారు. ఒకవేళ ఈ తరహా మాల్‌వేర్లు చరవాణిలోకి ప్రవేశిస్తే ఆ ఫోన్‌ ఇక నేరస్థుల అధీనంలోకి వెళ్లినట్లే. ఫోన్‌లో నిక్షిప్తం చేసిన సమస్త సమాచారాన్ని వాళ్లు వీక్షించగలుగుతారు. ఈక్రమంలో బ్యాంకింగ్‌ లావాదేవీలు నిర్వహించే సమయంలో యూజర్‌నేమ్, పాస్‌వర్డ్, ఓటీపీ.. ఇలాంటి రహస్య సంకేతాలన్నీ వారికి చేజిక్కుతాయి. అలాగే చరవాణిలోని చిత్రాలు, వీడియోలు అన్నీ వారి పరమవుతాయి. ఒకవేళ ఆ చరవాణిలో వ్యక్తిగత చిత్రాలు, వీడియోలుంటే ఇక అంతే సంగతులు. సైబర్‌ నేరగాళ్లు వాటిని బూచీగా చూపి డబ్బులు డిమాండ్‌ చేసే ఆస్కారమెక్కువగా ఉంటోంది. అంతటితో ఆగకుండా బాధితులు మహిళలైతే నేరగాళ్లు ఆ వీడియోల్ని బ్లాక్‌మెయిలింగ్‌ చేసే అస్త్రాలుగా వినియోగించుకుంటారు. అలా ఒకరకంగా చెప్పాలంటే చరవాణి వినియోగదారుడి చేతిలోనే ఉన్నా.. అందులోని సమాచారమంతా సైబర్‌ నేరగాడి గుప్పిట ఉన్నట్లే లెక్క ఈక్రమంలో నేరగాళ్లు కొన్నిసార్లు ఆన్‌లైన్‌ లావాదేవీల సమయాల్లో అసలు వినియోగదారుడి చరవాణికి ఓటీపీ రాకుండా చేసి ఖాతా నుంచి డబ్బు మళ్లించుకొంటాడు. ఆన్‌లైన్‌ లావాదేవీ పూర్తి చేసేందుకు ఓటీపీనే కీలకం కాబట్టి.. వినియోగదారుడి చరవాణిని కొంతసేపు పనిచేయకుండా చేసి పని కానిచ్చేస్తాడు.

సహాయ కేంద్రాల ముసుగులో..
ఇప్పుడు ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేయడం అత్యంత సాధారణమైపోయింది. అలా షాపింగ్‌ చేసిన వస్తువును మార్చాలనుకుంటే కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేయడమూ అంతే సాధారణం. ఈ పరిణామాన్నే సైబర్‌ నేరస్థులు తమకు అనువుగా మలుచుకుంటున్నారు. అచ్చం అసలు కస్టమర్‌ కేర్‌ పోర్టల్‌ను పోలిన నకిలీ పోర్టల్‌లను సృష్టించి అంతర్జాలంలో పెడుతున్నారు. అందులో తమ ఫోన్‌నంబర్లను అందుబాటులో ఉంచుతున్నారు. పొరపాటున గనక ఆ నంబరుకు ఫోన్‌ చేస్తే చాలు మోసానికి తెర లేపుతున్నారు. తాము పంపించే లింక్‌ను క్లిక్‌ చేసి కొంత  సమాచారం పొందుపరచాలని సూచిస్తున్నారు. ఆ లింక్‌ను క్లిక్‌ చేస్తే వెంటనే మాల్‌వేర్‌ ఫోన్‌లోకి ప్రవేశించి డేటా దొంగిలిస్తోంది. తద్వారా బ్యాంకు ఖాతాను ఊడ్చేస్తున్నారు.
ఈ జాగ్రత్తలు అవసరం : సాధారణంగా పెద్ద కంపెనీలు తమ వినియోగదారుల సౌకర్యార్థం కస్టమర్‌ కేర్‌ సేవల్ని అందుబాటులో ఉంచుతాయి. ఒకవేళ కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేస్తే తప్పనిసరిగా ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌(ఐవీఆర్‌ఎస్‌) విధానంలో మాత్రమే స్పందించే విధానం అవలంబిస్తుంది. ఉదాహరణకు వినియోగదారులు ఫోన్‌ చేసిన వెంటనే ‘ఒకటి లేదా రెండు నొక్కండి’ అనే వాయిస్‌ మాత్రమే వినిపిస్తుంది తప్ప నేరుగా వ్యక్తులెవరూ మాట్లాడరు. ఒకవేళ ఫోన్‌ చేసిన వెంటనే అవతలి వైపు నుంచి నేరుగా ఎవరైనా మాట్లాడితే కచ్చితంగా మోసగాళ్ల పనే అని గుర్తించాలి.

-మల్యాల  సత్యం, ఈనాడు, హైదరాబాద్‌ 

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని