న్యాయ నేస్తం

Updated : 02/06/2019 01:55 IST
అగ్ని ప్రమాదంలో.. అండాదండ!

విద్యుత్‌ షార్ట్‌ సర్య్యూట్‌తో దుకాణంలో మంటలు.. సిలిండర్‌ పేలి బూడిదైన సామగ్రి.. ఇలా తరచూ వార్తలు కనిపిస్తూనే ఉంటాయి. కారణం ఏదైనా దుకాణం లేదా వ్యాపార సముదాయాలలో సంభవించే అగ్ని ప్రమాదాల్లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరుగుతుంటుంది. అగ్నికీలల్లో ఆస్తులతోపాటు.. కలలూ కాలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అనుకోని ప్రమాదం జరిగినా.. ఆర్థికంగా భారం పడకుండా ఉండాలంటే.. ఫైర్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవడం మంచిది. అయితే, ఈ బీమా తీసుకునే విషయంలో చాలామందికి కొన్ని అపోహలు ఉంటాయి. వాటినీ, అందులో ఉన్న వాస్తవమేమిటి? అనే సంగతులు తెలుసుకుందాం..

వ్యాపార సంస్థలకు అగ్ని ప్రమాదాల వల్ల నష్టం జరిగితే పరిహారం ఇచ్చేది ఫైర్‌ ఇన్సూరెన్స్‌. మంటలు వ్యాపించడం వల్ల ఆస్తులు, వస్తువులకు జరిగిన నష్టాన్ని ఇది భర్తీ చేస్తుంది. పాలసీ తీసుకునేముందే ఎంత విలువైన పాలసీని తీసుకుంటారో అంత మేరకు పరిహారం లభిస్తుంది.

అపోహ: మంటలు వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాం.. అయినా ఫైర్‌ ఇన్సూరెన్స్‌ అవసరమా?

నిబంధనల ప్రకారం ప్రతి వ్యాపార సంస్థా అగ్ని ప్రమాదాలు జరగకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. అగ్ని ప్రమాదం జరిగినా.. అది వ్యాప్తి చెందకుండా చూసేందుకు అవసరమైన అన్ని పరికరాలనూ, సిబ్బందికి శిక్షణలాంటివీ ఉండాలి. ఎంత అప్రమత్తంగా ఉన్నా.. అనుకోకుండా చిన్న నిప్పు రవ్వతో అగ్ని కీలలు చెలరేగిన సందర్భాలు అనేకం. అగ్ని ప్రమాద బీమా ప్రాధాన్యం ఎంత ఉందో.. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అగ్ని ప్రమాదం చెలరేగడానికి ప్రాథమికంగా విద్యుత్‌ వైర్లే కారణం అవుతుంటాయి. ప్రతి వ్యాపార సంస్థ, దుకాణంలో ఇవి సర్వసాధారణం. కాబట్టి, వ్యాపార సంస్థ పరిమాణంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ బీమా తీసుకోవాల్సిందే. ఫ్యాక్టరీ యజమానులకు తమ స్టాక్‌ అంతా కాలిపోతే వ్యాపారం నడవడం కష్టం. కొన్నిసార్లు ప్రమాదంలో ఉద్యోగులు మరణించవచ్చు. ఇలాంటప్పుడు వారి కుటుంబానికి పరిహారాన్ని ఈ బీమా అందిస్తుంది. వ్యాపారాన్ని బట్టి ఈ అగ్ని ప్రమాద బీమాను తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అగ్ని ప్రమాద బీమా లేకపోతే.. మరమ్మతు ఖర్చులన్నీ సొంతంగా భరించాల్సి ఉంటుంది. వ్యాపార సంస్థ దగ్గర డబ్బు సర్దుబాటుకాకపోతే వ్యాపారాన్నే మూసి వేయాల్సిన పరిస్థితి రావచ్చు.

అపోహ: ప్రీమియం మరీ ఎక్కువగా ఉంది.. ఆస్తి విలువను తక్కువ చేసి, పాలసీ తీసుకుంటే సరిపోతుంది.

చాలామంది వ్యాపార సంస్థల యజమానులు.. అగ్ని ప్రమాద బీమా కోసం చెల్లించే ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుందని భావిస్తుంటారు. ప్రీమియం తగ్గించుకునే లక్ష్యంతో.. వారి ఆస్తులను తక్కువ విలువ ఉన్నట్లు నమోదు చేస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు.. వాటిల్లిన నష్టానికి పూర్తి పరిహారం అందదు. అలాంటప్పుడు పాలసీ ఉన్నా దానివల్ల వచ్చే ప్రయోజనం అంతంత మాత్రమే. బీమా తీసుకునేప్పుడు మీ ఆస్తి విలువకు సరిసమానంగా పాలసీ ఉండేలా చూసుకోండి. తక్కువ బీమా పాలసీని కొనుగోలు చేయడం వల్ల అది ఉన్నా లేనట్లే..

తీసుకునేప్పుడు జాగ్రత్త...

గ్ని ప్రమాద బీమా పాలసీ తీసుకున్న తర్వాత దాన్ని కాలనుగుణంగా సమీక్షించుకోండి. వ్యాపార పరిమాణం పెరగడం, ఆస్తుల విలువ అధికం కావడంలాంటివన్నీ చూసుకొని, దానికి తగినట్లుగా బీమా ఉందా లేదా చూసుకోండి.

పాలసీ పత్రంలో చిరునామా సరిగా ఉందా లేదా చూసుకోండి. ఒకే ప్రదేశంలో పలు రకాల వస్తువులు, ఆస్తులు ఉన్నప్పుడు వాటన్నింటికీ కలిపి ఒకే బీమా పాలసీ ఉండేలా చూసుకోవాలి. ప్రతి దానికీ విడివిడిగా పాలసీ తీసుకోవడం కంటే.. అన్నింటికి కలిపి ఒకే పాలసీ తీసుకోవడం వల్ల ఖర్చు తగ్గుతుంది.

అగ్ని ప్రమాదం జరిగినప్పుడు దాన్ని నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే అంశాలపై ఒక నివారణ ప్రణాళికను అందుబాటులో ఉంచుకోవాలి.

మీ సంస్థలో పనిచేసే ఉద్యోగులందరికీ అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలో వివరించడంతోపాటు, శిక్షణ ఇవ్వాలి.

ప్రమాద నివారణ పరికరాలను, ప్రమాదం జరిగినప్పుడు అప్రమత్తం చేసే అలారాలు తదితరాలను ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల ప్రీమియంలో కొంత రాయితీ కూడా లభిస్తుంది.

- సంజయ్‌ దత్తా, చీఫ్‌ - అండర్‌ రైటింగ్‌, క్లెయిమ్స్‌ అండ్‌ 
రీ ఇన్సూరెన్స్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌.

 

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని