న్యాయ నేస్తం

Published : 19/05/2019 00:26 IST
హామీ ఉన్నారా? బాకీ బాధ్యత మీదే!

మా అమ్మానాన్నలు 60 ఏళ్ల పైనే ఉంటారు. వారిద్దరికీ కలిపి ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం వారికి పెద్దగా ఎలాంటి జబ్బులూ.. ఇతర ఇబ్బందులూ లేవు. పెద్ద వారి కోసం పాలసీలు అందుబాటులో ఉన్నాయా? ఈ పాలసీకి చెల్లించిన ప్రీమియాన్ని నేను ఆదాయపు పన్ను మినహాయిపు కోసం చూపించుకోవచ్చా?

-రామకృష్ణ

 

ప్రస్తుతం చాలా ఆరోగ్య బీమా పాలసీలకు ప్రవేశ వయసు 65 ఏళ్ల వరకూ ఉంది. కాబట్టి, మీ అమ్మానాన్న పేరుమీద పాలసీ తీసుకునేందుకు అవకాశం ఉంది. అయితే, వయసు అధికంగా ఉంటుంది కాబట్టి, ప్రీమియం కాస్త అధికంగానే ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. పెద్దవారికి బీమా సంస్థలు పాలసీని ఇచ్చినప్పటికీ అనేక నిబంధనలు విధిస్తాయి. ముఖ్యంగా సహ చెల్లింపు నిబంధన విధిస్తుంటాయి. ఉప పరిమితులూ ఉంటాయి. మీరు అన్ని కంపెనీల పాలసీలనూ గమనించండి. దీనికోసం మీకు అందుబాటులో ఉన్న బీమా సలహాదారుడిని సంప్రదించండి. అతను చెప్పిన విషయాలను బీమా సంస్థ సేవా కేంద్రాన్ని సంప్రదించి మరోసారి ధ్రువీకరించుకోండి. మీపై ఆధారపడిన తల్లిదండ్రుల ఆరోగ్య బీమా పాలసీకి చెల్లించే ప్రీమియంపై మీరు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80డీ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.

నా స్నేహితుడు ఒక బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాడు. అతనికి నేను హామీ సంతకం చేశాను. కొంతకాలం నుంచి అతను నెలసరి వాయిదాలు చెల్లించడం లేదని బ్యాంకు నాకు నోటీసు పంపించింది. ఒకవేళ అతడు ఆ బాకీ చెల్లించకపోతే నేను బాధ్యుడిని అవుతానా?

- ప్రకాశ్‌

 

ఒక రుణానికి హామీ ఉండటం అంటే.. ఆ బాకీ తీరేంత వరకూ మీరే బాధ్యత వహిస్తాననీ, ఒకవేళ అసలు రుణాన్ని తీసుకున్న వ్యక్తి చెల్లించకపోతే ఆ మొత్తానికి హామీదారుడు బాధ్యత వహించాలనీ అర్థం. సాధారణంగా బ్యాంకులు/రుణ సంస్థలు ముందుగా రుణం తీసుకున్న వ్యక్తి దగ్గర్నుంచి బాకీ వసూలు చేసుకునేందుకే ప్రాధాన్యం ఇస్తాయి. అవసరమైతే అతని వ్యక్తిగత ఆస్తులను జప్తు చేస్తాయి. నిబంధనల మేరకు వేలం వేస్తాయి. అప్పటికీ.. బాకీ తీరకపోతే.. హామీగా ఉన్న వ్యక్తిని సంప్రదిస్తాయి.. అతని నుంచి మిగిలిన మొత్తాన్ని వసూలు చేస్తాయి. కాబట్టి, ఆర్థిక క్రమశిక్షణ లేనివారికి హామీ ఇవ్వకపోవడమే ఉత్తమం..

మా నాన్నగారు తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని అమ్మారు. దీనిపై వచ్చిన లాభాన్ని దీర్ఘకాలిక మూలధన లాభంగా చూపించుకోవచ్చా? ఆయనకు ఎలాంటి ఆదాయ వనరులూ లేవు. మేము గృహరుణం తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నాం. నేను 30శాతం పన్ను శ్లాబులో ఉన్నాను. మా ఇద్దరిలో ఎవరి పేరుమీద గృహరుణం తీసుకోవడం మంచిది?

-జనార్దన్‌

 

మీరు అమ్మిన ఆస్తి మీ స్వాధీనంలో రెండేళ్లకు మించి ఉంది కాబట్టి, మీరు దీర్ఘకాలిక మూలధన లాభంగా చూపించుకునే అవకాశం ఉంది. నివాస యోగ్యమైన మరో ఇంటిని కొనడం ద్వారా మీరు ఆ పన్ను భారం పడకుండా చూసుకోవచ్చు. ఇక గృహరుణం విషయానికి వస్తే.. మీ నాన్నగారికి ఎలాంటి ఆదాయమూ లేదు కాబట్టి, పన్ను వర్తించదు. మీరు 30శాతం శ్లాబులో ఉన్నారు కాబట్టి, మీ పేరుపైనే గృహరుణం తీసుకోవడం ద్వారా పన్ను భారం తగ్గుతుంది. కాబట్టి, మీరే గృహరుణం తీసుకోండి.

మా అపార్ట్‌మెంట్‌ నిర్వహణ కోసం ఒక కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీని ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఖాతాలో ఉన్న మిగులు నిల్వను ఏదైనా అధిక రాబడి వచ్చేలా మదుపు చేయాలని ఆలోచిస్తున్నాం. మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టేందుకు మాకు అవకాశం ఉంటుందా?

- శ్రీనివాస్‌

 

కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీలు మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసేందుకు అవకాశం ఉంది. అయితే, మీ దగ్గర ఉన్న నిధి అపార్ట్‌మెంట్‌ నిర్వహణ, దాని మరమ్మతులవంటి వాటికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ఖర్చు ఎప్పుడు వస్తుందో అంచనా ఉండదు. కాబట్టి, కాస్త నష్టభయం తక్కువగా ఉండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదును వెనక్కి తీసుకునేందుకు వీలుగా మీ పెట్టుబడులు ఉండాలి. డెట్‌ ఫండ్లలో మదుపు చేయాలనుకుంటే.. యాక్సిస్‌ లిక్విడ్‌ ఫండ్‌, కోటక్‌ లో డ్యూరేషన్‌ ఫండ్లను పరిశీలించవచ్చు.

- సాయికృష్ణ పత్రి, సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని