ఆదివారం, నవంబర్ 01, 2020

ఆదాయపు పన్ను

Published : 16/02/2020 00:18 IST
కొత్తదా... పాతదా...? ఎవరికి ఏది మేలు?

‘పన్నుల వసూలు, రిటర్నుల దాఖలును సులభతరం చేస్తాం’ అని ఆర్థిక మంత్రి ఫిబ్రవరి 1న కొత్త బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. దీనికోసం కొత్తగా వివిధ పన్ను శ్లాబులను తీసుకొస్తున్నట్లు చెప్పారు. పాత విధానమూ కొనసాగుతుందని తెలిపారు. దీంతో ఏ పన్ను విధానం ఎంచుకోవాలన్న దానిపై ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు రెండు వారాలు గడిచినా సందేహాలు తీరడం లేదు. పన్ను పరిధిలోకి వచ్చేవారు పాత, కొత్త పన్ను విధానాల్లో ఏది ఎంచుకోవాలో నిర్ణయించుకునే ముందు తెలుసుకోవాల్సిన అంశాలేమిటో చూద్దాం...

 

ఆదాయ పన్ను చట్టం ప్రకారం పన్ను భారం తగ్గించుకునేందుకు కొన్ని మినహాయింపులను కల్పించారు. కొత్త పన్నుల విధానాన్ని సునిశితంగా పరిశీలిస్తే.. ఎలాంటి మినహాయింపులూ లేకుండా వచ్చిన ఆదాయానికి కొత్త శ్లాబుల ప్రకారం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో రూ.5లక్షల నుంచి రూ.20లక్షల వరకూ వివిధ ఆదాయాలు ఉన్నవారు.. తాము ఏ పద్ధతిలో పన్ను చెల్లిస్తే ప్రయోజనమో పరిశీలిద్దాం.

నచ్చిన పద్ధతిలో..

వ్యాపార ఆదాయం లేని వ్యక్తులు, హిందూ అభివాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌) ప్రతి ఆర్థిక సంవత్సరంలో తమకు నచ్చిన పన్నుల విధానాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ, వ్యాపార ఆదాయం ఉన్న వ్యక్తులు, హెచ్‌యూఫ్‌లు ఒకసారి కొత్త పన్నుల విధానంలోకి మారితే.. మళ్లీ తిరిగి పాత విధానంలోకి వెళ్లడానికి ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుంది. మరోమాటలో చెప్పాలంటే.. ఎలాంటి వ్యాపారం లేని వ్యక్తులు, హెచ్‌యూఫ్‌లకు మాత్రమే ఏటా వారి వారి ఆదాయాలు, పొదుపు, పెట్టుబడులు ఇతరత్రా అంశాలను గణించి, ఏది మేలు అనిపిస్తుందో దాన్ని ఎంచుకోవచ్ఛు గడిచిన ఆర్థిక సంవత్సరంలో పన్ను పరంగా ఏ విధానం వల్ల మీకు పన్ను భారం తగ్గుతుందో గణించుకోవచ్ఛు మీరు ఎంచుకునే విధానాన్ని రిటర్నులతో పాటే తెలియజేస్తే సరిపోతుంది. దీనికోసం ప్రత్యేక పత్రం సమర్పించక్కర్లేదు. అయితే, వ్యాపారాదాయం ఉంటే.. గడువు తేదీలోగా ప్రత్యేక పత్రంలో తెలియజేయాల్సి ఉంటుంది. అయితే, చట్టం నిర్దేశించిన నిబంధనలను సరిగా పాటించకపోతే.. కొత్త విధానంలో ప్రయోజనం పొందలేరు.

ఎలా ఎంచుకోవాలి?

గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నులు దాఖలు చేసే సమయంలో ఏ ఐచ్ఛికాన్ని ఎంచుకోవాలన్నది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అంటే, 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను, 2021-22 మదింపు సంవత్సరం (అసెస్‌మెంట్‌ ఇయర్‌) రిటర్నులు దాఖలు చేసేటప్పుడు ఆప్షన్‌ను ఎంచుకోవాలన్నమాట. ఒకవేళ వీరికి వ్యాపారాదాయం ఉంటే.. నిర్ణీత పత్రంలో ఏ ఆప్షన్‌ను ఎంచుకుంటామన్నది తెలియజేయాల్సి ఉంటుంది.

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. వ్యాపారాదాయం ఉన్నప్పుడు కొత్త పన్నుల విధానాన్ని ఎంచుకుంటే.. ఒకసారి మాత్రమే ఆ ఐచ్ఛికాన్ని మార్చుకునే అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత కొత్త విధానాన్ని ఎంచుకోలేరు.

కొత్త పద్ధతిలోకి మారితే..

కోల్పోయే మినహాయింపులేమిటంటే..

* ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80సీ ప్రకారం పీఎఫ్‌, పీపీఎఫ్‌, ఇన్సూరెన్స్‌ ప్రీమియాలు, గృహరుణం అసలు చెల్లింపు, పిల్లల ఫీజుల్లాంటి వాటిపై పొందే మినహాయింపు రూ.1,50,000.

* సెక్షన్‌ 24(బి) ప్రకారం స్వయంగా నివాసం ఉంటున్న ఇంటి రుణానికి చెల్లించిన వడ్డీకి రూ.2,00,000 వరకూ

* సెక్షన్‌ 16 ప్రకారం వర్తించే ప్రామాణిక తగ్గింపు రూ.50,000

* ఇంటి అద్దె భత్యం

* ఎల్‌టీఏ మినహాయింపు

* మైనర్‌ ఆదాయాన్ని కలిపినప్పుడు వర్తించే రూ.1500 మినహాయింపు

* సెక్షన్‌ 10(17)లో పేర్కొన్న వివిధ ప్రోత్సాహకాలు (పెర్క్‌)

* ఆదాయపు పన్ను చట్టం చాప్టర్‌ VI A ప్రకారం అనుమతించిన అన్ని మినహాయింపులు (పింఛను పథకాల్లో పెట్టుబడి రూ.50,000, సెక్షన్‌ 80జేజేఏ ప్రకారం విద్యుత్‌ ఉత్పత్తిని చేసే వ్యాపారాలకు వర్తించదు)

వ్యాపార వర్గాలకు పై మినహాయింపులతోపాటు..

ఇతర మినహాయింపులూ దూరం అవుతాయి..

* బదలాయింపైన తరుగుదల నష్టం, ఇంటి ఆదాయంపై వచ్చిన నష్టం సర్దుబాటు పొందేందుకు వీలుండదు.

* పాత నిబంధనల ప్రకారం ఆదాయపు పన్ను ఎలా వర్తిస్తుందన్న దాని గురించి పట్టికలో చూద్దాం..●

పాతదే ప్రయోజనం..

కొత్త పన్ను విధానంలో ప్రవేశ పెట్టిన శ్లాబులు, పన్ను రేట్లు ఆకర్షిస్తున్నప్పటికీ.. వాస్తవంగా ఆదాయాన్ని, మినహాయింపులను తీసుకొని, గణిస్తే పాత విధానాన్ని ఎంచుకోవడమే మేలని చెప్పవచ్ఛు మీకు ఎలాంటి మినహాయింపులు పొందే అవకాశం లేనప్పుడు కొత్త విధానమే ప్రయోజనం. ఏ పన్ను విధానంలో రిటర్నులు సమర్పించాలనేది వ్యక్తులను బట్టి మారుతుంది. మీ ఆదాయం, మినహాయింపులను దృష్టిలో పెట్టుకొని దాన్ని నిర్ణయించుకోవాలి.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని