షేర్లు - ఫండ్లు

Published : 18/12/2020 01:43 IST
పిల్లల భవితకు ధీమా...

తమ పిల్లలకు ఏ లోటూ ఉండకూడదు. ఉన్నత చదువులు, మంచి జీవితం.. ప్రతి తల్లిదండ్రుల కలలు ఇలానే ఉంటాయి. వీటికోసం వారు ఎంతో ఇష్టంగా కష్టపడుతుంటారు. ఇది తమ బాధ్యత అనుకుంటారు. అదే సమయంలో పిల్లల ఆర్థిక భవితకూ ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉందనేది మర్చిపోకూడదు. ప్రస్తుత అనిశ్చితి రోజుల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటప్పుడు పిల్లల చదువులకు ఆటంకం కలగకూడదు. ఒక వ్యక్తికి పదవీ విరమణ ప్రణాళిక ఎంత ముఖ్యమో.. తనపై ఆధారపడిన వారికి ఆర్థిక భద్రతను అందించమూ అంతే ప్రధానం. మరి, ఇందుకోసం ఏం చేయాలి.. చూద్దాం..
పెట్టుబడి పెట్టేందుకు అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పిల్లల భవితకు భద్రత కల్పించడంతోపాటు, వారి లక్ష్యాలకు అవసరమైన నిధిని సమకూర్చేందుకు పిల్లల బీమా పాలసీలను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఈ పాలసీల్లో తల్లిదండ్రులు పాలసీని తీసుకుంటారు.. పిల్లలు దాని ప్రయోజనం పొందుతారు. ఈ పాలసీలకు నిర్ణీత వ్యవధి పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. గడువు తీరిన తర్వాత వచ్చిన డబ్బును పిల్లల చదువు, పెళ్లి, ఇతర అవసరాలకు వాడుకోవచ్చు. పాలసీ వ్యవధిలో పాలసీ తీసుకున్న వ్యక్తికి ఏదైనా జరగరానిది జరిగితే.. ఇది పిల్లలకు ఆర్థిక భరోసాని కల్పిస్తుంది. ఈ పిల్లల బీమా పాలసీల్లోనూ రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి యూనిట్‌ ఆధారిత బీమా పాలసీ. మరోటి ఎండోమెంట్‌ పాలసీ. తల్లిదండ్రులు తమ నష్టభయం భరించే సామర్థ్యం, ఆశించిన రాబడి ఆధారంగా ఏ పాలసీని ఎంచుకోవాలన్నది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.
ఏ పాలసీ..
యూనిట్‌ ఆధారిత పిల్లల బీమా పాలసీ తీసుకునేటప్పుడు ఇందులో ఉండే నష్టభయాల గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాలి. కనీసం 10 ఏళ్లకు మించి పాలసీలో కొనసాగుతామని భావించినప్పుడే పూర్తి ఈక్విటీ పథకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవి దీర్ఘకాలంలో మంచి రాబడినిస్తాయని మర్చిపోవద్దు. లేకపోతే.. ఈక్విటీ, డెట్‌లు కలిసి ఉండే పాలసీల వైపు చూడాలి. లేదా గడువు దగ్గరకు వస్తున్న కొద్దీ.. డెట్‌లోకి మారుతూ ఉండాలి. తక్కువ నష్టభయం ఉండటంతోపాటు, దీర్ఘకాలం పాలసీలో కొనసాగాలనుకునే వారు ఎండోమెంట్‌ పాలసీలను ఎంచుకోవచ్చు. ఇందులో హామీతో కూడిన రాబడి అందుతుంది.
ఇవన్నీ చూశాకే..
ఎంత మొత్తానికి పాలసీ తీసుకోవాలన్నది మొదట పరిశీలించాలి. ఇప్పటి లెక్కలు కాకుండా భవిష్యత్తు అవసరాలను దీనికోసం పరిగణనలోనికి తీసుకోవాలి. విద్యా ద్రవ్యోల్బణం ఎప్పటికప్పుడు పెరిగిపోతోంది. ఇప్పుడు రూ.12లక్షలు కావాలనుకుంటే.. పదేళ్ల తర్వాత దాదాపు 23.5లక్షల వరకూ అవసరం అవుతాయి. ఈ లెక్కలను సరిచూసుకోవాలి. మీ పిల్లల లక్ష్యానికి తగ్గట్టుగా పాలసీ వ్యవధిని నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు మీ అబ్బాయి వయసు 10 ఏళ్లనుకోండి.. మరో 10-12 ఏళ్ల తర్వాత మీకు అధిక మొత్తంలో డబ్బు కావాలనుకుంటే.. పాలసీని ఈ వ్యవధిని బట్టి ఎంచుకోవాలి. అప్పుడే అవసరానికి డబ్బు అందుతుంది. ఒకేసారి పాలసీ మొత్తం అందాలా.. లేదా విడతల వారీగా తీసుకుంటారా అనేదీ నిర్ణయించుకోవచ్చు. దీర్ఘకాలం పాటు పిల్లలకు మేలు చేసే చెల్లింపు విధానాన్ని ఎంచుకోవడం మేలు.

- సంజయ్‌ తివారీ, డైరెక్టర్‌, ఎక్సైడ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని