Published : 07/04/2019 01:03 IST
మనవరాలికి బంగారం కొనాలంటే..

మ్యూచువల్‌ ఫండ్లలో క్లోజ్‌ ఎండెడ్‌ పథకాల పేర్లు తరచూ వినిపిస్తుంటాయి కదా! వీటిలో పెట్టుబడి పెట్టడం వల్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకన్నా ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉందా? ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టు బడిని వెనక్కి తీసుకునే వీలుంటుందా?

- సురేందర్‌

 

క్లోజ్‌ ఎండెడ్‌ ఫండ్లు ఈక్విటీ, డెట్‌ విభాగాల్లో అందుబాటులో ఉంటాయి. వీటిలో కొంతకాలంపాటు మాత్రమే పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఎన్‌ఎఫ్‌ఓ ముగిసిన తర్వాత మదుపు చేసే వీలుండదు. నిర్ణీత కాలం తర్వాతే పెట్టుబడిని కూడా వెనక్కి తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. డెట్‌ ఆధారిత క్లోజ్‌ ఎండెడ్‌ పథకాల్లోనూ కాస్త నష్టభయం ఉంటుంది. మంచి రేటింగ్‌ ఉన్న డెట్‌ ఫండ్‌ను ఎంచుకుంటే.. మూడేళ్ల తర్వాత ద్రవ్యోల్బణ సూచీకి సర్దుబాటు చేయడం వల్ల.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకన్నా 1-1.5% వరకూ అధిక రాబడి వచ్చే వీలుంది. ఇందులో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడానికి వీలుండదు. వ్యవధి తీరేంతవరకూ ఆగాల్సిందే. 
 

నా వయసు 21 ఏళ్లు. నా దగ్గర రూ.1,00,000 ఉన్నాయి. వీటిని 15 ఏళ్ల పాటు ఏదైనా పెట్టుబడి పథకంలో పెట్టాలనే ఆలోచనతో ఉన్నాను. నిఫ్టీ 50 ఈటీఎఫ్‌లో మదుపు చేయడం మంచిదని స్నేహితుడు చెప్పాడు. నిజమేనా? దీనికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా?

- పవన్‌

 

సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్లకన్నా.. సూచీల ఆధారిత ఫండ్లు మంచి రాబడిని అందిస్తుంటాయి. కానీ, మన దేశంలో గత చరిత్రను గమనిస్తే.. మంచి ఈక్విటీ డైవర్సిఫైడ్‌ ఫండ్లు, సూచీలకు మించి రాబడిని అందించాయి. కొన్ని ఫండ్లు సూచీల రాబడికన్నా 4-7శాతం అధికంగానే రాబడినిచ్చాయి. మరో ఐదేళ్ల తర్వాత మన మార్కెట్లు కూడా అభివృద్ధి చెందితే.. అప్పుడు సూచీ ఫండ్లు మెరుగైన పనితీరు చూపించొచ్చు. ప్రస్తుతం ఈక్విటీ డైవర్సిఫైడ్‌ ఫండ్లను ఎంచుకోవడమే మేలు. ఫ్రాంక్లిన్‌ ఇండియా ఈక్విటీ ఫండ్‌, మిరే అసెట్‌ లార్జ్‌ క్యాప్‌ ఫండ్లను పరిశీలించవచ్చు. 
 

మా నాన్నగారు ఇటీవలే పదవీ విరమణ చేశారు. రూ.5లక్షల వరకూ వచ్చాయి. వీటిని పూర్తిగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో కాకుండా.. కొంత మొత్తాన్ని పోస్టాఫీసు పథకాల్లోనూ వేయాలని అనుకుంటున్నాం. మ్యూచువల్‌ ఫండ్లలో ఎక్కువ రాబడి వస్తుందా?

- కార్తీక్‌

 

మీరు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లో కాకుండా పోస్టాఫీసులో సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీంను పరిశీలించండి. ఇందులో ప్రస్తుతం 8.7శాతం రాబడి వస్తోంది. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లు ఇంతకు మించి రాబడిని ఇస్తాయని చెప్పలేం. కాస్త నష్టభయం కూడా ఉంటుంది. అధిక రాబడి రావాలంటే ఈక్విటీ ఫండ్లను ఎంచుకోవాలి. కానీ, ఐదేళ్లకు మించి ఇందులో మదుపు చేస్తేనే వీటిని పరిశీలించాలి. వీటిలో కాస్త అధిక నష్టభయం ఉంటుందని మర్చిపోకూడదు. 
 

మరో మూడేళ్ల తర్వాత ఇల్లు కొనాలనుకుంటున్నాం. ఈపీఎఫ్‌లో దాదాపు రూ.8లక్షల వరకూ ఉన్నాయి. నెలకు అదనంగా రూ.20వేల వరకూ పొదుపు చేద్దామని ఆలోచన. వీపీఎఫ్‌ ఎంచుకోవాలా? లేదా వేరే ఏదైనా పథకం మేలా? ఏం చేస్తే బాగుంటుందో సూచించండి?

- వర్మ

 

మీకు మూడేళ్ల సమయమే ఉంది కాబట్టి, మీ పెట్టుబడి సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తాన్ని వీపీఎఫ్‌లోనే జమ చేయండి. ప్రస్తుతం ఇందులో 8.65శాతం రాబడి లభిస్తోంది. పైగా రాబడిపై పన్ను ఉండదు. ఇల్లు కొనేప్పుడు ఈపీఎఫ్‌/వీపీఎఫ్‌ నుంచి నిబంధనల మేరకు డబ్బును తీసుకోవచ్చు. కాబట్టి, ఇబ్బందేమీ ఉండదు. 
 

మా మనవరాలి పేరుమీద నెలకు రూ.4,000 పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాం. తన వయసు ఏడాది. మరో 10 ఏళ్ల తర్వాత ఆ డబ్బుతో బంగారం కొనాలి. దీనికోసం ఏం చేయాలి?

- మురళి

 

మీకు పదేళ్ల సమయం ఉంది కాబట్టి, మీరు పెట్టాలనుకుంటున్న మొత్తాన్ని ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయండి. అప్పటి వరకూ జమైన మొత్తాన్ని వెనక్కి తీసుకొని, బంగారం కొనండి. ఈక్విటీ ఫండ్లలో దాదాపు 13శాతం వరకూ రాబడి వచ్చే అవకాశం ఉంది. నెలకు రూ.4,000 చొప్పున పదేళ్లపాటు పెట్టుబడి పెడితే.. 13శాతం రాబడి అంచనాతో.. రూ.8,84,147 వచ్చే వీలుంది. ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఈక్విటీ ఫండ్‌, యూటీఐ ఈక్విటీ ఫండ్లను పరిశీలించవచ్చు.

- తుమ్మ బాల్‌ రాజ్‌, సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని