మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ నెల ఎంత ఖర్చు చేశారో లెక్క చూసుకున్నారా? ప్రతి బిల్లునూ క్రెడిట్ కార్డుపైనే చెల్లించడం వల్ల లాభాల మాట ఎలా ఉన్నా.. క్రెడిట్ స్కోరు విషయంలో చిక్కులు తప్పకపోవచ్చు. మరి కార్డును వాడేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామా!
ప్రతి క్రెడిట్ కార్డుకూ కొంత పరిమితి ఉంటుంది. ఆ పరిమితి మొత్తం వినియోగించుకున్నా ఇబ్బందేమీ ఉండదు. కానీ.. రుణ వినియోగ నిష్పత్తి పెరుగుతున్న కొద్దీ అటు ఆర్థిక ప్రణాళిక, బడ్జెట్‌పైనా, ఇటు క్రెడిట్ స్కోరు, రుణ చరిత్రపైనా ప్రభావం పడుతుంది. ఉదాహరణకు మీకు రెండు క్రెడిట్ కార్డులు ఉన్నాయి. అందులో ఒకదానికి రూ.1,00,000, మరోదానికి రూ.50,000 పరిమితి ఉందనుకుందాం. ఇప్పుడు ఈ రెండు క్రెడిట్ కార్డులతోనూ కలిపి రూ.75,000 వరకూ కొన్నారనుకుంటే.. అప్పుడు మీ రుణ వినియోగ నిష్పత్తి 50శాతం అవుతుంది. మీకు ఉన్న రుణ అనుమతిలో ఎంత శాతం వినియోగించుకున్నారనేదే ఇక్కడ ప్రధానం.
ఏదేని రుణం కావాలంటే.. క్రెడిట్ స్కోరు, రుణ చరిత్ర ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీన్ని నిర్ణయించడంలో క్రెడిట్ కార్డుల పాత్ర ఎంతో ఉంటుంది. కాబట్టి, రుణ వినియోగం 40శాతానికి మించి లేకుండా చూసుకోవడమే ఎప్పుడూ అవసరం. క్రెడిట్ కార్డును తక్కువగా వినియోగించుకోవడం, తరచూ దానిపై ఆధారపడకపోవడం ఆర్థిక క్రమశిక్షణకు గుర్తు. తక్కువ రుణ వినియోగం క్రెడిట్ స్కోరు పెరిగేందుకు ఉపయోగపడుతుంది. ఫలితంగా కొత్త రుణం కావాలన్నా.. క్రెడిట్ కార్డు తీసుకోవాలన్నా ఎంతో సులభం అవుతుంది. ఒకవేళ మీరు కార్డుపై ఎక్కువగా ఖర్చు చేస్తుంటే.. రుణ సంస్థలు మిమ్మల్ని కాస్త ఇబ్బందిపెట్టే రుణగ్రహీతగా పరిగణిస్తాయి.
ఒకవేళ మీ క్రెడిట్ కార్డు వాడకం ప్రతిసారీ 40శాతాన్ని మించిపోతుంటే.. జాగ్రత్తలు తీసుకోవాల్సిన తరుణం ఆసన్నమయ్యిందన్నమాట.
బాకీ చెల్లించేయండి..
క్రెడిట్ కార్డులపైన బిల్లు ఎప్పటికప్పుడు చెల్లించేయాలి. బాకీ ఎక్కువగా ఉంటే.. మీ అప్పు మొత్తం కూడా పెరుగుతూనే ఉంటుంది. గత నెల బిల్లు బాకీ.. ఈ నెల బిల్లులో కలిసిందంటే.. చిక్కులు కొని తెచ్చుకున్నట్లే. ముందుగా ఆ భారాన్ని వదిలించుకోండి. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లేదా పెద్ద బిల్లు మొత్తాన్ని ఈఎంఐలోకి మార్చుకోవడం ద్వారా తొందరగా బాకీని తీర్చేందుకు వీలవుతుంది. ఒకవేళ మొత్తం బిల్లును ఒకేసారి చెల్లించడం సాధ్యం కాకపోయినా.. కొంతకొంత చెల్లించినా.. మీ రుణ వినియోగ శాతం తగ్గుతూ వస్తుంది.
పరిమితి అధికంగా.. మీరు తరచూ అధిక మొత్తంలో క్రెడిట్ కార్డును వినియోగిస్తుంటే.. కార్డు పరిమితిని పెంచుకోవడమే మేలు. తక్కువ పరిమితితో ఉన్న కార్డు అవసరాలకు సరిగా ఉపయోగపడకపోగా.. మీ రుణ చరిత్రపై ప్రభావం చూపిస్తుంది. క్రెడిట్ కార్డుపైనే ఎక్కువగా ఆధారపడితే.. మరో కొత్త కార్డును తీసుకోవడం కూడా మంచిదే. కొత్త కార్డు ఇవ్వాలంటే.. క్రెడిట్ స్కోరు కీలకంగా మారుతుంది. ఒకవేళ మీ స్కోరు సరిగా లేకపోతే.. కార్డు ఇవ్వడానికి నిరాకరించవచ్చు. |
గమనిస్తూ ఉండండి..
మంచి క్రెడిట్ స్కోరు కావాలంటే.. క్రెడిట్ కార్డు బిల్లును ఎప్పటికప్పుడు సమయానికి చెల్లిస్తే చాలు అనే భావన కూడా ఉంటుంది. ఇక్కడ బిల్లు సరిగా చెల్లిస్తున్నామా లేదా అనేదానికన్నా.. ఎంత పరిమితి వరకూ వాడుతున్నామనేదే కీలకం.. మీ దగ్గర ఒకటికి మించి క్రెడిట్ కార్డులుంటే.. ప్రతి దానిలోనూ 40శాతానికి మించి వాడకుండా జాగ్రత్త పడండి. వీలైన చోట నగదు, నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డును వాడండి. ఇలా క్రెడిట్ కార్డు వినియోగాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
పాతవి ఉన్నాయా?
రెండు మూడు క్రెడిట్ కార్డులున్నప్పటికీ.. కొన్నిసార్లు ఒకదానినే వాడుతూ.. మిగతా వాటిని పక్కన పడేస్తుంటాం. కార్డు వాడకం పెరిగినప్పుడు ఇలా పక్కన పెట్టిన కార్డులనూ వినియోగంలోకి తెచ్చుకోవాలి. రుణ వినియోగం ఎక్కువగా ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డులను రద్దు చేసుకోవాలని చూడొద్దు. అలా చేస్తే.. మీ మొత్తం రుణ పరిమితి తగ్గిపోతుంది. ఫలితంగా తక్కువ మొత్తంలో కార్డు వాడినా.. అప్పు శాతం అధికంగానే ఉంటుంది. ఇది మంచిది కాదు. కాబట్టి, ఉన్న కార్డులను సమర్థంగా వాడుకోవడమే ఎప్పుడూ అవసరం.