Published : 23/12/2018 00:19 IST
పన్ను ఆదాకు ఫండ్ల తోడు...

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2018-19 మరో మూడు నెలల్లో ముగిసిపోతుంది. ఉద్యోగులకు ఆదాయపు పన్ను ఎంత చెల్లించాలో ఇప్పటికే స్పష్టత వచ్చి ఉంటుంది. పన్ను ఆదా చేసుకునేందుకు   అనువైన పథకాల అన్వేషణ చేశారా? ఇప్పటికీ అలాంటి ఆలోచన లేకపోతే.. సమయం   మించకుండా జాగ్రత్త పడాలి. 
పన్ను మినహాయింపు పొందేందుకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80సీ కింద కొన్ని పెట్టుబడి పథకాలున్నాయి. ఇందులో ఈక్విటీ ఫండ్లలో మదుపు చేసి, పన్ను ఆదా పొందేందుకు ఉపకరించేవే ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌). పన్ను భారం తగ్గించడమే కాకుండా.. దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధికి కూడా ఉపయోగపడే పథకాలుగా వీటికి పేరుంది. పిల్లల చదువులు, వారి వివాహం, ఇల్లు కొనుగోలు, పదవీ విరమణ తర్వాత అవసరాలు తదితరాల ప్రణాళికలోనూ ఇవి ఉపయోగపడతాయని చెప్పొచ్చు.


సాధారణ మ్యూచువల్‌ ఫండ్లలో ఎప్పుడైనా పెట్టుబడిని వెనక్కి తీసుకోవచ్చు. కానీ, వీటిల్లో మదుపు చేసినప్పుడు కనీసం 3 ఏళ్లపాటు పెట్టుబడిని కదపకూడదు. ఆదాయపు పన్ను చట్టం 1961, సెక్షన్‌ 80సీ ప్రకారం రూ.1,50,000 వరకూ వివిధ పెట్టుబడి పథకాల్లో మదుపు చేసి, పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈఎల్‌ఎస్‌ఎస్‌లో గరిష్ఠంగా ఎంత మదుపు చేయాలనే నిబంధనేమీ లేదు. కానీ, పన్ను మినహాయింపు కోసం చూసినప్పుడు మాత్రం ఈ సెక్షన్‌ అనుమతించిన పరిమితినే లెక్కలోకి తీసుకుంటారు.


ఎలా ఎంచుకోవాలి?
పనితీరు: దీర్ఘకాలంగా క్రమం తప్పకుండా ప్రామాణిక సూచీని మించి రాబడినిస్తున్న ఫండ్లనే పెట్టుబడి కోసం ఎంచుకోవాలి. ఇటీవల కాలంలో రాబడిని ఇవ్వడం ప్రారంభించిన ఫండ్లలో మదుపు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి.


వైవిధ్యం: ఫండ్‌ను ఎంపిక చేసుకునే ముందు దాని మదుపు వ్యూహాలను పరిశీలించాలి. అది ఎక్కడెక్కడ మదుపు చేస్తుందో తెలుసుకోవాలి. వైవిధ్యంగా ఉండే రంగాలు, షేర్లను ఎంచుకుంటున్న ఫండ్‌లోనే మదుపు చేయాలి.


ఏ విభాగంలో: మదుపు చేయాలనుకుంటున్న పథకం.. మిడ్‌ క్యాప్‌ లేదా లార్జ్‌ క్యాప్‌ ఫండ్లలో ఏది అనేది పరిశీలించాలి. నష్టభయం ఎక్కువగా భరించలేను అనుకుంటే.. లార్జ్‌ క్యాప్‌ ఈఎల్‌ఎస్‌ఎస్‌లను ఎంచుకోవాలి. కాస్త నష్టం వచ్చినా తట్టుకుంటాను అనుకుంటే.. వీటిల్లోనే... మిడ్‌ క్యాప్‌ ఫండ్లను చూడాలి. కొన్ని ఫండ్లు పెట్టుబడుల్లో సమతౌల్యాన్ని పాటిస్తుంటాయి. అయితే, ఇవి ఎప్పటికప్పుడు ఆయా రంగాలకు ఇచ్చే ప్రాధాన్యాన్ని మారుస్తుంటాయి.


మూడేళ్లకు మించి...
ఈఎల్‌ఎస్‌ఎస్‌ పెట్టుబడులు పన్ను ఆదా పథకాల్లో కెల్లా అతి తక్కువ వ్యవధి ఉన్న పథకాలు. ఇందులో మూడేళ్లపాటు పెట్టుబడిని కొనసాగిస్తే చాలు. పెట్టుబడి పెట్టిన ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపు పొంది ఉంటాం. కాబట్టి, వ్యవధి తీరేంత వరకూ ఇందులో పెట్టుబడిని ఉపసంహరించుకోవడం వీలు పడదు.
పేరుకు పన్ను ఆదా కోసం అయినా.. ముందే అనుకున్నట్లు ఇవి పూర్తి ఈక్విటీ పథకాలే. మార్కెట్‌ అధిక స్థాయుల వద్ద ఉన్నప్పుడు మదుపు చేశారనుకుందాం.. మనం వెనక్కి తీసుకునేప్పుడు మార్కెట్‌ తగ్గితే.. పెట్టుబడి మొత్తం కూడా ఆ మేరకు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి, మూడేళ్ల తర్వాత తీసుకోవాలనే ఆలోచన కాకుండా.. డబ్బు అవసరం లేకపోతే.. వీలైనంత ఎక్కువ కాలం ఈఎల్‌ఎస్‌ఎస్‌లలో కొనసాగవచ్చు.


ఇలా చేయొచ్చు..
పన్ను ఆదా కోసం ఒకేసారి పెట్టుబడి పెట్టడం అంత ఆచరణీయం కాదు. కాబట్టి, నెలనెలా కొంత మొత్తాన్ని ఈఎల్‌ఎస్‌ఎస్‌లలో సిప్‌ చేయాలి. మూడేళ్లపాటు ఇలా చేసిన తర్వాత.. వ్యవధి తీరిన నెల పెట్టుబడిని వెనక్కి తీసుకొని, తిరిగి అదే ఫండ్‌లో మదుపు చేసేందుకు ప్రయత్నించవచ్చు. ఇలా మీపై అదనపు భారం లేకుండా పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టేందుకు మీకు ఇబ్బంది అవుతుంటేనే ఇలాంటి మార్గాన్ని చూడాలి. ఇబ్బంది లేదు అనుకుంటే.. సిప్‌ చేస్తూ వెళ్లడమే మంచిది.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని