Updated : 05/02/2021 05:45 IST
ఖాతాలు స్తంభించినా.. డిపాజిట్‌ బీమా...

బ్యాంకులు దివాలా తీసినప్పుడు.. మన ఖాతాల్లో ఉన్న డబ్బుల గురించి ఆందోళన చెందడం సహజం. డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌  (డీఐసీజీసీ) ద్వారా రూ.5లక్షల వరకూ డిపాజిట్‌ బీమా ఉన్నప్పటికీ.. అవి పూర్తిగా బ్యాంకు విఫలమయ్యిందని ప్రకటించాకే వర్తిస్తుంది. కానీ, కొత్త బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి బ్యాంకు ఖాతాలు స్తంభింపజేసినప్పుడూ డీఐసీజీసీ వర్తించే విధంగా సవరణలు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. దీనికి అనుగుణంగా డీఐసీజీసీ 1961ని సవరిస్తామని పేర్కొన్నారు. ఇది ఫిక్స్‌డ్‌ డిపాజిటర్లకు ఎంతో ఊరట కల్గించే అంశమే.
భారతీయ రిజర్వు బ్యాంకు యాజమాన్యంలోని డీఐసీజీసీ బ్యాంకు డిపాజిటర్లకు ఈ బీమాను అందిస్తుంది. 2020లో ఈ బీమా మొత్తాన్ని రూ.లక్ష నుంచి రూ.5లక్షలకు పెంచారు. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం బ్యాంకు లైసెన్సు రద్దు చేసి, లిక్విడేషన్‌ చర్యలు ప్రారంభించిన తర్వాతే డీఐసీజీసీ నుంచి బీమా మొత్తాన్ని పొందేందుకు వీలుంటుంది.
ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బ్యాంకుల నిర్వహణలో ఒత్తిడి తగ్గించేందుకు ఆర్‌బీఐ బ్యాంకుల సాధారణ కార్యకలాపాల మీద తాత్కాలిక నిషేధం విధిస్తుంటుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రజలు ఉపసంహరించుకునే మొత్తానికి పరిమితి పెడుతుంది.  

చట్టాన్ని సవరిస్తే...
డీఐసీజీసీ చట్టాన్ని సవరించిన తర్వాత.. దివాలా అంచున ఉన్న బ్యాంకుల ఖాతాదారులు తమ నిధులను వెనక్కి తీసుకోవడానికి వేచి ఉండాల్సిన అవసరం లేదు. బ్యాంకు నష్టాల్లో ఉండి, ఖాతాను స్తంభింపచేసినప్పుడు.. రూ.5లక్షల వరకూ నిధులను బీమా ద్వారా పొందే వీలుంటుంది. తక్కువ రాబడి ఉన్నప్పటికీ భద్రత కోసం ఎక్కువగా బ్యాంకుల వైపు మొగ్గు చూపుతున్న ఈ సమయంలో ఈ సవరణల వల్ల ఖాతాదారుల విశ్వాసం పెరుగుతుందని చెప్పుకోవచ్చు.

ఎప్పుడు వర్తిస్తుంది
* రెండు వేర్వేరు బ్యాంకులలో డిపాజిట్లు ఉన్నప్పుడు.. ఆ రెండు బ్యాంకులూ మూసివేత దిశగా వెళ్తే.. ఒక్కో బ్యాంకులో ఉన్న ఖాతాల మీద రూ.5లక్షల వరకూ.. అంటే రూ.10లక్షలకూ బీమా ఉంటుంది.
* ఒకే బ్యాంకులో ఒక వ్యక్తి వద్ద ఉన్న అన్ని డిపాజిట్ల మొత్తం రూ.ఐదు లక్షలకు మించి ఉంటే.. అసలు, వడ్డీ మొత్తంతో కలిపి రూ.ఐదు లక్షలు మాత్రమే పొందగలుగుతారు.
* బ్యాంకు ఖాతాకు అనుబంధంగా ఉన్న పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన, పెద్దల పొదుపు పథకం ఖాతాలకు కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది. కాబట్టి, వీటిని బీమా మొత్తంలో కలపరు.
* బ్యాంకులు ఆర్థికంగా విఫలమై.. డిపాజిటర్లకు చెల్లించేందుకు డబ్బు లేనప్పుడు.. ఆ బ్యాంకులో ఉన్న ఖాతాదారులకు ఈ బీమా వర్తిస్తుంది.
* అన్ని వాణిజ్య బ్యాంకులు, విదేశీ బ్యాంకులతోపాటు, రాష్ట్ర, కేంద్ర, పట్టణ సహకార బ్యాంకులు, లోకల్‌ ఏరియా బ్యాంకులు, ప్రాతీయ గ్రామీణ బ్యాంకుల్లో చేసే డిపాజిట్లకు ఈ బీమా రక్షణ ఉంటుంది. కానీ, ప్రాథమిక సహకార సంఘాలలో చేసే డిపాజిట్లకు ఇది వర్తించదు.
* పొదుపు,స్థిర, కరెంటు, రికరింగ్‌ డిపాజిట్‌ వంటి అన్ని బ్యాంకు  డిపాజిట్లకూ కలిపి ప్రతి ఖాతాదారుడికి రూ.5లక్షల మొత్తం మీద బీమా వర్తిస్తుంది.
* ఒకే వ్యక్తికి వేర్వేరు హోదాల్లో ఖాతాలుంటే.. వాటికి విడివిడిగా బీమా రక్షణ ఉంటుంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తికి తన డిపాజిట్లపై రూ.5లక్షల వరకూ బీమా ఉంటుంది. అదే వ్యక్తికి వేరొకరితో ఉమ్మడి ఖాతా ఉంటే.. దానికీ బీమా లభిస్తుంది.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని