Published : 05/02/2021 00:19 IST
చైనాలో మదుపు చేస్తారా?

ఇటీవల కాలంలో విదేశీ మార్కెట్లలో ఈక్విటీ పెట్టుబడులు పెట్టి దేశీయ మదుపరులకు అధిక లాభాలు ఆర్జించి పెట్టాలనే లక్ష్యంతో కొన్ని వినూత్నమైన పథకాలను మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు ఆవిష్కరిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా అమెరికా ఈక్విటీలపై దృష్టి పెట్టిన పథకాలనే ఇంతకాలం చూశాం. ప్రధానంగా నాస్‌డాక్‌లోని టెక్‌ స్టాక్‌ గత కొన్నేళ్ల కాలంలో అనూహ్యమైన ప్రతిఫలాన్ని అందించిన నేపథ్యంలో అలాంటి అమెరికా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని ఆశించే మదుపరులను లక్ష్యంగా చేసుకొని ఈ పథకాలను కొన్ని మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు తీసుకొచ్చాయి. ఇదే కోవలో మరికొంత భిన్నంగా చైనా ఈక్విటీ షేర్లలో పెట్టుబడి పెట్టే మూచ్యువల్‌ ఫండ్‌ యూనిట్లను కొనుగోలు చేసే అవకాశాన్ని దేశీయ మదుపరులకు కల్పించే భిన్నమైన పథకాన్ని యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తీసుకొచ్చింది.
‘యాక్సిస్‌ గ్రేటర్‌ చైనా ఈక్విటీ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌’ అనే పేరుతో వచ్చిన ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 5తో ముగియనుంది. కనీస పెట్టుబడి రూ.5,000. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. దీనికి ఫండ్‌ మేనేజర్లుగా హితేష్‌ దాస్‌ (విదేశీ సెక్యూరిటీలు), ఆర్‌.శివకుమార్‌ (ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌) వ్యవహరిస్తారు.  
చైనా ఆర్థిక వ్యవస్థ అధిక విలువ కల వస్తు తయారీకి కేంద్ర స్థానంగా మారుతున్నట్లు, అంతేగాక చైనా కంపెనీలు సాంకేతిక ఆవిష్కరణలతో సత్వర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నట్లు యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ భావిస్తోంది. అందువల్ల చైనాలో పెట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన తరుణమని విశ్వసిస్తోంది. ఈ దృష్టితోనే ‘యాక్సిస్‌ గ్రేటర్‌ చైనా ఈక్విటీ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌’ను రూపొందించింది.
ఈ మ్యూచువల్‌ ఫండ్‌ పథకం ద్వారా సేకరించిన సొమ్ముతో ష్రోడర్‌ ఇంటర్నేషనల్‌ సెలక్షన్‌ ఫండ్‌ గ్రేటర్‌ చైనా యూనిట్లు కొనుగోలు చేస్తారు. పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా (పీఆర్‌సీ), హాంగ్‌కాంగ్‌ ఎస్‌ఏఆర్‌, తైవాన్‌ లోని కంపెనీలకు చెందిన ఈక్విటీ షేర్లు, ఈక్విటీ పత్రాల్లో ఈ ఫండ్‌ పెట్టుబడి పెడుతోంది. దాదాపు 5 శాతం సొమ్మును అక్కడి రుణపత్రాల్లోనూ పెట్టుబడిగా పెట్టే వీలుంది.  
తమ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను వివిధీకరణ (డైవర్సిఫికేషన్‌)పై దృష్టి ఉన్న మదుపరులకు, చైనా ఆర్థిక వ్యవస్థ మీద విశ్వాసం ఉన్న వారు ‘యాక్సిస్‌ గ్రేటర్‌ చైనా ఈక్విటీ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌’ లో పెట్టుబడి పెట్టే అంశాన్ని పరిశీలించవచ్చు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని