శనివారం, అక్టోబర్ 24, 2020

Updated : 25/05/2020 01:49 IST
వేచి చూస్తేనే లాభాలు

నా వయసు 62 ఏళ్లు. నా దగ్గర ఉన్న మొత్తాన్ని మూడేళ్ల క్రితం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశాను. ఇప్పుడు దాని వ్యవధి తీరింది. చేతికి రూ.2,50,000 వరకూ వచ్చే అవకాశం ఉంది. దీన్ని తిరిగి ఎఫ్‌డీ చేస్తే వడ్డీ చాలా తక్కువగా వస్తోంది. కనీసం 8-9 శాతం వచ్చేలా నేను ఏ పథకాన్ని ఎంచుకోవాలి? - నారాయణ

* ప్రస్తుతం మన దేశంలో వడ్డీ రేట్లు బాగా తగ్గాయి. వచ్చే 4-6 నెలల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లు 4.5%-5.00% మధ్యలోకి వచ్చే అవకాశం ఉంది. ఇది మరికొంతకాలం కొనసాగవచ్ఛు ప్రస్తుతం మీ డబ్బు సురక్షితంగా ఉంటూ.. అధిక రాబడి రావాలంటే.. పోస్టాఫీసులో సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీంను పరిశీలించవచ్ఛు ఇందులో ఇప్పుడు 7.4 శాతం వడ్డీ ఇస్తున్నారు. ఎఫ్‌డీలతో పోలిస్తే.. ఇందులో 2శాతం వరకూ అధికంగా రాబడినిస్తుంది. దీన్ని ఐదేళ్ల వరకూ కొనసాగించాలి. మూడు నెలలకోసారి వడ్డీ చెల్లిస్తారు.●


మా అమ్మాయి పేరు మీద సుకన్య సమృద్ధి యోజన పథకంలో నెలకు రూ.3,000 మదుపు చేస్తున్నాను. ఇప్పుడు దీనికి అదనంగా మరో రూ. 2,000 పెట్టుబడి పెట్టాలనుకుంటున్నా. 17 ఏళ్ల తర్వాత డబ్బు వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాను. నా పెట్టుబడి ప్రణాళిక ఎలా ఉంటే బాగుంటుంది? - మధు

* మీ అమ్మాయి భవిష్యత్తు అవసరాలకు ఆర్థిక రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. దీనికోసం మీ పేరుమీద తగినంత మొత్తానికి జీవిత బీమా పాలసీ తీసుకోండి. ఇప్పటికే మీరు సురక్షితంగా ఉండే సుకన్య సమృద్ధి యోజనలో మదుపు చేస్తున్నారు.. కాబట్టి, కాస్త నష్టభయం ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో అధిక రాబడిని అందించే అవకాశమున్న డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకోండి. దీనికోసం యాక్సిస్‌ మల్టీ క్యాప్‌ ఫండ్‌, మిరే అసెట్‌ లార్జ్‌ క్యాప్‌ ఫండ్లను పరిశీలించవచ్ఛు నెలకు రూ.2,000 చొప్పున మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేస్తే.. 17 ఏళ్లలో దాదాపు 13 శాతం రాబడి అంచనాతో.. రూ.12,89,737 అయ్యే అవకాశం ఉంది.●


గత రెండేళ్లుగా నాలుగు మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో నెలకు రూ.8,000 చొప్పున మదుపు చేస్తున్నాను. కొంతకాలం మంచి రాబడే లభించినా.. ఇప్పుడు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేను పెట్టుబడిని కొనసాగించాలా? ఆపేయాలా? ఇప్పుడు మొత్తం డబ్బును వెనక్కి తీసుకోవడం మంచి ఆలోచనేనా? - కుమార్‌

* స్టాక్‌ మార్కెట్‌ ఆధారిత పెట్టుబడులను కనీసం 7-10 ఏళ్లపాటు కొనసాగించాలి. స్వల్పకాలంలో హెచ్చు తగ్గులు సహజం. కొన్నిసార్లు నష్టమూ రావచ్ఛు ఇలాంటప్పుడు నిరాశ చెందకుండా.. మదుపు చేస్తూ వెళ్లాలి. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలంలో మన పెట్టుబడి మంచి లాభాలను ఇస్తుందని చెప్పొచ్ఛు వీలైతే.. మార్కెట్‌ పతనాల్లో కొంత మొత్తాన్ని అదనంగా పెట్టుబడి పెట్టడమూ మంచిదే. ఇప్పుడు మార్కెట్లో దిద్దుబాటు కనిపిస్తోంది కాబట్టి, నష్టం కనిపిస్తోంది. మీరు మదుపు చేసిన ఫండ్ల పనితీరు బాగుంటే.. ఆందోళన అవసరం లేదు.

- తుమ్మ బాల్‌రాజ్‌, సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని